Chalapati Rao: ముగిసిన చలపతిరావు అంత్యక్రియలు.. బోరున విలపించిన రవిబాబు
Send us your feedback to audioarticles@vaarta.com
సినీనటుడు చలపతిరావు అంత్యక్రియలు పూర్తయ్యాయి. జూబ్లీహిల్స్‌లోని మహా ప్రస్థానంలో కుమారుడు రవిబాబు తండ్రికి అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు. ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ నెల 24న చలపతిరావు గుండెపోటుతో హైదరాబాద్‌లోని తన నివాసంలో కన్నుమూశారు. అయితే ఆయన ఇద్దరు కుమార్తెలు అమెరికాలో వుండటంతో వారు వచ్చే వరకు చలపతిరావు భౌతికకాయాన్ని మహాప్రస్థానంలోని ఫ్రీజర్‌లో వుంచారు. మంగళవారం రాత్రికి ఇద్దరు కుమార్తెలు భారతదేశానికి చేరుకున్నారు. తండ్రిని కడసారి చూసుకుని వారిద్దరూ కన్నీరుమున్నీరుగా విలపించారు. అనంతరం బుధవారం ఉదయం మహాప్రస్థానంలో చలపతిరావు అంత్యక్రియలను రవిబాబు నిర్వహించారు. ఆ సమయంలో రవిబాబు కన్నీటి పర్యంతమయ్యారు. అంతకుముందు నిన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చలపతిరావు కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.
ఇది చలపతిరావు ప్రస్థానం:
1944 మే 8న కృష్ణా జిల్లా పామర్రు మండలం బల్లిపర్రులో జన్మించారు చలపతిరావు. సినిమాలపై ఆసక్తితో మద్రాసు వెళ్లిన ఆయన ఎన్టీఆర్ అడుగుజాడల్లో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. 1966లో సూపర్‌స్టార్ కృష్ణ హీరోగా తెరకెక్కిన ‘‘గూఢచారి 116’’ద్వారా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ఆయన వెనుదిరిగి చూసుకోలేదు. విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, కమెడియన్‌గా బిజీ అయిపోయారు. సుదీర్ఘ కెరీర్‌లో 1200కు పైగా సినిమాల్లో చలపతిరావు నటించారు. మూడు తరాల నటులతో కలిసి నటించిన అరుదైన ఘనత ఆయన సొంతం. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్‌బాబు, కృష్ణంరాజులతో పాటు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున , వెంకటేశ్‌లతో పాటు వారి వారసులతోనూ చలపతి రావు స్క్రీన్ షేర్ చేసుకున్నారు. చివరిసారిగా నాగార్జున, నాగచైతన్య నటించిన బంగార్రాజు ఆయన చివరి చిత్రం. కలియుగ కృష్ణుడు, కడప రెడ్డమ్మ, జగన్నాటకం, పెళ్లంటే నూరేళ్ల పంట తదితర చిత్రాలకు చలపతిరావు నిర్మాతగా వ్యవహరించారు. ఆయన కుమారుడు రవిబాబు నటుడు, దర్శకుడు, నిర్మాతగా సినీ పరిశ్రమలోనే కొనసాగుతున్నారు. రోజుల వ్యవధిలో నవరస నటనా సార్వభౌమ కైకాల సత్యనారాయణ, చలపతిరావులను కోల్పోవడంతో తెలుగు చిత్ర పరిశ్రమ శోకసంద్రంలో కూరుకుపోయింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout