సేవ్ నల్లమల... శేఖర్ గళం!
Send us your feedback to audioarticles@vaarta.com
ఏదో నాలుగు సినిమాలు తీశామా? అంతటితో మన బాధ్యత అయిపోయిందని తలుపులు వేసేసుకున్నామా అన్నట్టు ఉండదు శేఖర్ కమ్ముల తత్వం. ఆయన సమాజంతో కలుస్తారు. సమాజాన్ని గురించి ఆలోచిస్తారు. సేవ్ నల్లమల పేరుతో తాజాగా ప్రభుత్వానికి అర్జీ పెట్టుకున్నారు. కృష్ణమ్మ గలగలలు, చెంచుల జీవనతరంగాలను, పెద్ద పులుల గాండ్రింపులను కాపాడమని ప్రభుత్వాన్ని కోరారు.
ఈ విషయమైన సోషల్ మీడియాలో ఆయన తన సందేశాన్ని రాసి పోస్ట్ చేశారు. ``నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం కోసం తవ్వకాలు చేపట్టబోతున్నారు. దీని వల్ల మన పర్యావరణానికి తీవ్ర నష్టం. చెంచులు, ఇటర అటవీ వాసులు నివసిస్తున్న ప్రాంతం, అంతరించి పోతున్న పులులు నివసించే ప్రాంతం అయిన నల్లమల సమూలంగా నాశనమవుతుంది.
కృష్ణ, దాని ఉపనదులు కలుషితం అవుతాయి. ఇప్పటికే చాలా మంది క్యాన్సర్ బారిన పడ్డారు. యురేనియం తవ్వకాల వల్ల క్యాన్సర్ బాధితుల సంఖ్య మరింతగా పెరుగుతుంది. యురేనియం కోసం పర్యావరణాన్ని నాశనం చేసుకోకూడదు. వెంటనే ప్రభుత్వం స్పందించి, చెంచులని, ఇతర ఆదివాసులని, పర్యావరణాన్ని మొత్తంగా నల్లమలను కాపాడాలి`` అని అందులో రాశారు.
ఇంతకు పూర్వం కూడా నిర్భయ ఘటన జరిగినప్పుడు శేఖర్ కమ్ముల అమితంగా కలత చెందారు. పలు కాలేజీలకు వెళ్లి, యువత ఆలోచనా విధానాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారు.
ఆయన ప్రస్తుతం నాగచైతన్య హీరోగా ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. `ఫిదా`లో ఆయన ఇంట్రడ్యూస్ చేసిన సాయిపల్లవి ఇందులోనూ నాయిక. ఈ సినిమా ఇంకా సెట్స్ మీదకు వెళ్లలేదు. వచ్చే నెల నుంచి సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ ఏడాది డిసెంబర్‌లోపు సినిమాను విడుదల చేయాలన్నది ఆయన ప్లాన్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments