‘సారంగదరియా’ వివాదంపై స్పందించిన శేఖర్ కమ్ముల
- IndiaGlitz, [Thursday,March 11 2021]
‘సారంగదరియా’ పాటపై పెద్ద ఎత్తున వివాదం చెలరేగుతున్న విషయం తెలిసిందే. ఈ వివాదంపై తాజాగా డైరెక్టర్ శేఖర్ కమ్ముల స్పందించారు. అసలు ఏం జరిగిందనే విషయాన్ని ఫేస్బుక్ వేదికగా ప్రజానీకానికి వెల్లడించారు. తాను కోమలకి మాటిచ్చిన ప్రకారమే సినిమాలో క్రెడిట్ ఇస్తామని.. డబ్బు ఇస్తామని.. ఆడియో ఫంక్షన్ ఫిక్స్ అయితే , కోమలకి పాడమని ఆహ్వానం సైతం పంపిస్తామని శేఖర్ కమ్ముల తన పోస్టులో వెల్లడించారు.
‘‘చాలా ఏళ్ళ కిందట 'రేలా రే రేలా' ప్రోగ్రాంలో శిరిషా అనే అమ్మాయి 'సారంగ దరియా' అనే పాట పాడింది. ఆ పాట నాకు అలా గుర్తుండి పోయింది. ఆ పాట ఎంత నచ్చింది అంటే అంత నచ్చింది. ఈ ఫిల్మ్ విజువలైజ్ చేస్తున్నప్పుడల్లా ఈ పాట నా మైండ్‌లో తిరుగుతూనే ఉంది.
నా మొదటి సినిమా 'డాలర్ డ్రీమ్స్' లో లక్కి అలి పాట ఉంటుంది. ఆ పాటని ఫిల్మ్ లో ఉపయోగించినందుకు సోని కంపెనీకి నేను డబ్బు చెల్లించా. ఫిల్మ్ లో క్రెడిట్స్ కూడా ఇచ్చా. తర్వాత తీసిన 'ఆనంద్' లో లక్కి అలితో పాడించుకున్నా కూడా. ఆనంద్ ఫిల్మ్‌లో సుబ్బలక్ష్మి గారి పాట నుంచి ‘ఫిదా’లో.. ‘మల్లీశ్వరి’ సినిమాలో ని అప్పగింతల పాట వరకూ స్టొరీ రాస్తున్నప్పుడు నాకు ఒక్కో సినిమా కి ఒక్కో పాట తిరుగుతుంటుంది. ఇక ‘లవ్ స్టోరి’ ఫిల్మ్ కి నా మనసులో ఈ పాట ఉంది.
సుద్దాల గారిని కలిసాను. ఈ పాటని సినిమాకి అనుకూలంగా రాయాలి అంటే, ఈ పాట పల్లవి తీస్కొని, చరణాలు రాశారు. ఆ పాటకి అంత బాగా లిరిక్స్ రాసినందుకు చాలా సంతోషించాను.
మా టీంలో ఏడీ ఒకరు శిరీష ఫోన్ నంబర్ సంపాదించి, ఆమెని కాంటాక్ట్ చేశారు. ఆమెకి అప్పటికి డెలివరీ టైం అంటే, మేము ఇంక సరే అనుకున్నాం. కరోనా వల్ల ఫిల్మ్ ఆగి, మళ్ళీ షూట్ ప్రారంభమైంది. శిరీషకు అప్పుడే బేబి పుట్టింది కాబట్టి ఆమెను ఇబ్బంది పెట్టాలి అనిపించలేదు.
ఈ పాట ని నవంబర్‌లో షూట్ చేశాం. అది కూడా ట్రాక్ సింగర్ పాడిన వర్షన్‌తోనే. ఫిబ్రవరి ఆఖరులో మంగ్లీతో పాడించాం. ప్రోమో రిలీజ్ అయ్యాక సుద్దాల గారు ఫోన్ చేశారు. 'ఇద్దరు సింగర్స్ ఆ పాట మేమే పాడాలి అంటున్నారని'. ఆ ఇద్దరి నంబర్లు ఇచ్చారు. మా టీం లో ఏడీ ఆ ఇద్దరితో మాట్లాడారు. నేను వెంటనే సుద్దాల గారి ఇంటికి వెళ్ళాను.
ఈలోగా ఆయన వివరాలు సేకరించి, 'ఆ ఇద్దరిలో కొమలే ఆ పాటని వెలికితీసుకొచ్చింది, ఆమెతో పాడిద్దాం' అని సుద్దాల గారు అన్నారు. నా ముందే ఆయన కోమలకి ఫోన్ చేశారు. 'పాట రిలీజ్ చేస్తాం అని అనౌన్స్ చేశాం కాబట్టి, కోమలని వెంటనే రమ్మని అడిగాం. వరంగల్ నుంచి రావటానికి ఏర్పాటు చేస్తాం అన్నాం. మ్యూజిక్ డైరెక్టర్ని చెన్నయ్ నుంచి రప్పించాం. 'జలుబు ఉంది, రాలేను' అంది కోమల. పాట అనౌన్స్ చేశాం కాబట్టి మా ఇబ్బంది చెప్పాం. తనకి క్రెడిట్ ఇస్తే అభ్యంతరం లేదు అంది. 'జెన్యూన్ కేస్ సర్, క్రెడిట్‌తో పాటు డబ్బులు కూడా ఇస్తే బాగుంటుంది' అని సుద్దాల గారు అన్నారు. కోమలని అడిగితే, మీ ఇష్టం సర్, ఎంత ఇస్తే అంత ఇవ్వండి అంది. కచ్చితంగా ఇస్తాం అని చెప్పాను.
ఆడియో ఫంక్షన్లో పాడమని, విజిబులిటీ బాగుంటుందని.. కచ్చితంగా రమ్మని నేనే కోమలకి చెప్పాను. ఆమె సరే అంది. సుద్దాల గారి ఇంటి నుంచి ఫోన్లో కొమలతో చెప్పినట్టుగానే, పాట రిలీజ్ చేసినప్పుడు ఫేస్బుక్లో కోమలకి థాంక్స్ చెప్పాను. మరుగున పడిన జానపద గీతాన్ని వెలికి తీసుకొచ్చిన కోమలకి మేం ప్రామిస్ చేసినట్టు ఫిల్మ్ లో క్రెడిట్ ఇస్తాం, మనీ ఇస్తాం, ఆడియో ఫంక్షన్ ఫిక్స్ అయితే , కోమలకి పాడమని ఆహ్వానం పంపిస్తాం. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో పడి నేను టీవీల్లో జరుగుతున్న చర్చలు ఫాలో కాలేదు. ఒకేసారి ఫేస్బుక్లో అందరికి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. థ్యాంక్స్ టు ఆల్ అని డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెలిపారు.