శ్రీశైలం ఆలయం వద్ద డ్రోన్ కలకలం.. పోలీసుల అదుపులో ఇద్దరు గుజరాతీయులు
- IndiaGlitz, [Friday,December 24 2021]
ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో మరోసారి డ్రోన్ కలకలం రేపింది. ఆలయ పుష్కరిణీ వద్ద డ్రోన్ ప్రయోగానికి కొందరు యత్నించడంతో ఆలయ భద్రతా సిబ్బంది వారిని అడ్డుకొని డ్రోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిన్న రాత్రి ఆలయ పుష్కరిణీ వద్ద కొందరు వ్యక్తులు డ్రోన్‌ను ఎగురవేశారు. దీనిని గమనించిన భక్తులు.. ఆలయ అధికారులకు సమాచారం ఇచ్చారు. దాంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది డ్రోన్ వెంట పరుగులు తీసి .. చుట్టుపక్కల గాలించగా ఇద్దరు వ్యక్తులు గుజరాత్ రిజిస్ట్రేషన్ వున్న కారులో కనిపించారు. సెక్యూరిటీ సిబ్బంది వారిని ప్రశ్నిస్తే పొంతనలేని సమాధానాలు చెప్పారు. దీంతో ఇద్దర్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. డ్రోన్ ఎందుకు ఎగురవేశారు..? ఆలయం దగ్గరికి ఎలా తీసుకొచ్చారు..? ఎక్కడి నుంచి వచ్చారని ప్రశ్నల వర్షం కురిపించారు. ఐతే పట్టుబడ్డ ఇద్దరు గుజరాత్‌కు చెందిన వారిగా గుర్తించారు. వారిద్దరూ శ్రీశైలం ఎందుకు వచ్చారనే కోణంలో ఆరా తీస్తున్నారు.
ఈ ఏడాది జులైలో కూడా శ్రీశైలం ఆలయ సమీపంలో డ్రోన్లు చక్కర్లు కొట్టాయి. అర్ధరాత్రి వేళ డ్రోన్లు తిరగడంతో స్థానికులు, భక్తులు భయాందోళనలకు గురయ్యారు. డ్రోన్లు తిరుగుతున్న సమయంలో పట్టుకునేందుకు దేవస్థానం, భద్రతా సిబ్బంది ప్రయత్నించినా చిక్కలేదు. ఏకంగా జిల్లా ఎస్పీ స్పందించి.. అక్కడ స్పెషల్ టీమ్‌లను రంగంలోకి దించినా ఫలితం లేకుండా పోయింది. ఈ ఘటన జరిగిన దాదాపు ఆరు నెలల తర్వాత మళ్లీ ఇప్పుడు శ్రీశైలం ఆలయ పరిసరాల్లో డ్రోన్ కనిపించడం కలకలం రేపింది. గతంలో డ్రోన్లు పంపింది కూడా వీళ్లేనా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.