agnipath : 13 వాట్సాప్ గ్రూప్‌లతో రెచ్చగొట్టి.. పోలీసుల అదుపులో ‘‘సికింద్రాబాద్ అల్లర్ల’’ సూత్రధారి
Send us your feedback to audioarticles@vaarta.com
సాయుధ బలగాల్లో ప్రవేశాల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘అగ్నిపథ్’ స్కీమ్‌పై దేశవ్యాప్తంగా యువత, ప్రజా సంఘాలు, ఆర్మీ ఉద్యోగార్ధులు ఆందోళన నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. కొద్దిరోజుల క్రితం ఉత్తరాదిలో జరిగిన నిరసన కార్యక్రమాలు ఉద్రిక్తతకు దారి తీసిన సంగతి తెలిసిందే. తాజాగా ఇది తెలంగాణకు పాకింది. అగ్నిపథ్‌ను వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో శుక్రవారం ఆందోళనకారులు చేపట్టిన నిరసన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. వారిని నిలువరించేందుకు పోలీసులు రంగంలోకి దిగి చెదరగొట్టినా ఫలితం లేకపోయింది. ఎంతకూ ఆందోళన విరమించకపోవడంతో టియర్ గ్యాస్‌ను ప్రయోగించారు. అయినప్పటికీ పరిస్థితి అదుపులోకి రాకపోవడం, ఆందోళనకారులు రాళ్లురువ్వడంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ క్రమంలో ఒకరు మృతిచెందగా మరికొందరికి గాయాలయ్యాయి.
ఊహించని దాడితో ఖంగుతిన్న పోలీసులు:
ఊహించని దాడితో పోలీసు, రైల్వే వర్గాలు సైతం ఖంగుతిన్నాయి. శుక్రవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో మొదలైన ఉద్రిక్తత రాత్రి 7 గంటల వరకు కొనసాగింది. దీని కారణంగా సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్లలో రైళ్లను నిలిపివేశారు. నగరంలోని ఎంఎంటీఎస్, మెట్రో సర్వీసును సైతం రద్దు చేశారు. సాయంత్రానికి పరిస్ధితులు పోలీసుల అదుపులోకి రావడంతో రైళ్ల రాకపోకలను పునరుద్ధరించారు.
సాయి డిఫెన్స్ అకాడమీ పేరిట ఆర్మీ ఉద్యోగాలకు కోచింగ్:
అయితే ఇంతటి విధ్వంసం వెనుక కుట్ర కోణం వుందన్న అనుమానంతో పోలీసులు, నిఘా సంస్థలు , రైల్వే వర్గాలు రంగంలోకి దిగాయి. దీనిలో భాగంగా అల్లర్లను ప్రోత్సహించారనే అభియోగాలపై పల్నాడు జిల్లా నర్సరావుపేటకు చెందిన ఆవుల సుబ్బారావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇతను ‘‘సాయి డిఫెన్స్ అకాడమీ’’ పేరిట రెండు రాష్ట్రాల్లో ఆర్మీలో ఉద్యోగాలకు కోచింగ్ ఇస్తున్నాడు. ఈ క్రమంలో పోలీసుల దర్యాప్తులో ఇతని పాత్రపై అనుమానాలు రావడంతో ప్రకాశం జిల్లా కంభంలో సుబ్బారావును అదుపులోకి తీసుకుని నర్సరావుపేటకు తరలించారు.
ఇప్పటి వరకు 30 మంది అరెస్ట్:
ఇతను హకీంపేట ఆర్మీ సోల్జర్స్ పేరుతో 13 వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసి అభ్యర్ధులను రెచ్చగొట్టి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌పై దాడికి పక్కా ప్లాన్ వేసినట్లుగా నిఘా వర్గాలు గుర్తించాయి. ఇక ఇదే కేసులో కరీంనగర్‌కు చెందిన స్టార్ డిఫెన్స్ అకాడమీ నిర్వాహకుడు వసీం పాత్రపైనా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సికింద్రాబాద్ అల్లర్ల కేసులో పోలీసులు ఇప్పటివరకు 30 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి 12 మంది యువకుల ప్రమేయం వుందని.. ఆర్మీ ఉద్యోగాల ఆశావహులను కొందరు రెచ్చగొట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments