సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న కన్నుమూత.. కేసీఆర్, కేటీఆర్ సంతాపం
Send us your feedback to audioarticles@vaarta.com
బీఆర్ఎస్ నేత, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే జీ సాయన్న (72) కన్నుమూశారు. గత కొంతకాలంగా కిడ్నీ , గుండె సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ఈ నెల 16న యశోదా ఆసుపత్రిలో చేరారు. నాటి నుంచి సాయన్నకు వైద్యులు ఐసీయూలో వుంచి చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఆరోగ్య పరిస్ధితి విషమించడంతో సాయన్న తుదిశ్వాస విడిచారు. ఆయన భౌతికకాయాన్ని కుటుంబ సభ్యులు అశోక్ నగర్లోని నివాసానికి తరలించారు.
టీడీపీతో రాజకీయ ప్రస్థానం:
1951 మార్చి 5న జన్మించిన సాయన్న.. 1981లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బీఎస్సీ , 1984లో ఎల్ఎల్బీ పూర్తి చేశారు. అనంతరం ఆయనకు గీతతో వివాహం జరిగింది. ఈ దంపతులకు ముగ్గురు కుమార్తెలు. ఈ క్రమంలో రాజకీయాలపై ఆసక్తితో తెలుగుదేశం పార్టీతో తన పొలిటికల్ కెరీర్ను ప్రారంభించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి 1994 నుంచి 2009 వరకు వరుసగా గెలిచారు. రాష్ట్ర విభజన జరిగినప్పటికీ టీడీపీలోనే కొనసాగిన సాయన్న.. 2014లోనూ కంటోన్మెంట్ నుంచి విజయం సాధించారు. అనంతరం మారిన పరిస్ధితుల నేపథ్యంలో టీఆర్ఎస్లో చేరారు సాయన్న. 2018లో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన.. మొత్తం ఐదుసార్లు శాసనసభ్యుడిగా సేవలందించిన అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. 2015లో టీటీడీ పాలకమండలి సభ్యుడిగా.. ఆరు సార్లు హుడా డైరెక్టర్గా, వీధి బాలలకు పునరావాసంపై అసెంబ్లీలో హౌస్ కమిటీ ఛైర్మన్గా సాయన్న పనిచేశారు.
కేసీఆర్ సంతాపం:
సాయన్న మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం తెలిపారు. ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఆయన ప్రజలకు సేవలందించారని అన్నారు. సాయన్న కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అలాగే మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, నిరంజన్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తదితరులు కూడా సాయన్న మరణం పట్ల సంతాపం తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments