కరోనా తగ్గుముఖం పట్టేది అప్పుడేనట..
Send us your feedback to audioarticles@vaarta.com
ఒక్కసారిగా ఊపందుకున్న కరోనా సెకండ్ వేవ్.. ప్రజానీకాన్ని భయాందోళనకు గురి చేస్తోంది. దేశ వ్యాప్తంగా 2.5 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదవుతుండగా.. మరణాల సంఖ్య 1500 దాటుతోంది. గత ఏడాదిలో ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నదైతే లేదు. ఈ ఏడాది ఈ స్థాయిలో విజృంభిస్తుందని ఎవరూ ఊహించను కూడా ఊహించడం లేదు. మొదటి వేవ్‌లో మన దేశం విషయానికి వస్తే తొలి కేసు జనవరిలో నమోదైంది. సెప్టెంబర్ నాటికి తీవ్ర రూపం దాల్చింది. ఆ తర్వాత క్రమక్రమంగా తగ్గుతూ వచ్చింది. ఈ ఏడాది ఆరంభానికి దాదాపు తగ్గిపోయింది. తిరిగి మార్చి మొదటి వారం సెకండ్ వేవ్ భయపెడుతోంది. ఇక ఏప్రిల్‌కు వచ్చేసరికి తీవ్ర రూపం దాల్చింది. ఇక ఇప్పుడు కేసుల సంఖ్య 2.5 లక్షలకు పైమాటే. మరి ఇంత దారుణంగా పెరిగిపోతున్న కరోనా తగ్గేదెప్పుడు? అంతమెప్పుడు? అసలు ఎంత కాలం పాటు ఇలా పెరుగుతూ పోతుంటాయి? అనేవి ప్రస్తుతం తలెత్తుతున్న ప్రశ్నలు.
పలు సంస్థలకు చెందిన శాస్త్రవేత్తలు దీనిపై వేర్వేరు అంచనాలు వేస్తున్నారు. అయితే అంచనాలు వేరైనా ఉమ్మడి అంశం మాత్రం ఒకటుంది. అదేంటంటే.. ఈ కేసులన్నీ మే నెలాఖరుకు లేదంటే జూన్ 10 నాటికి తగ్గుముఖం పడతాయని అంతా మూకుమ్మడిగా చెబుతున్నారు. రానున్న పది రోజులు మాత్రం చాలా కీలకమని.. అంతా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఎంత వేగంగా పెరిగాయో.. అంతే వేగంగా తగ్గిపోతాయని ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ క్రెడిట్ సూయిస్ అధ్యయనంలో తేలింది. దాని ప్రకారం.. ఏప్రిల్ చివరినాటికి దేశ ప్రజల్లో 40 శాతం మందిలో కరోనా యాంటీబాడీస్ ఉత్పత్తి అవుతాయి. ఆ 40 శాతం మందిలో 28 శాతం మందికి కరోనా ఇన్ఫెక్షన్ల వల్ల, మరో 12 శాతం మందికి టీకాల వల్ల యాంటీబాడీస్ ఉత్పత్తి అవుతాయని క్రెడిట్ సూయిస్ పేర్కొంది. ఫలితంగా కేసుల సంఖ్యతో పాటు కరోనా మరణాల రేటులోనూ గణనీయమైన తగ్గుదల నమోదవుతుందని వెల్లడించింది. నిజానికి గతేడాదితో పోలిస్తే మరణాల రేటు తక్కువగానే ఉంది కానీ కరోనా మహమ్మారి బారిన పడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.
కాగా.. దేశంలో కరోనా కేసుల తీరుతెన్నులపై గత ఏడాది అధ్యయనం చేసిన శాస్త్రవేత్తల బృందం.. కేసులు ఏప్రిల్ 20 నాటికి పీక్స్‌కి వెళతాయని తెలిపింది. మే నెలాఖరు నాటికి వైరస్ తీవ్రత తగ్గుతుందని కూడా ఆ బృందం వెల్లడించింది. ‘సూత్ర’ అనే గణిత విధానం ద్వారా శాస్త్రవేత్తలు ఈ అంచనా వేశారు. సూత్ర అంటే.. ‘ససెప్టిబుల్, అన్‌డిటెక్టెడ్, టెస్టెడ్ (పాజిటివ్), అండ్ రిమూవ్డ్ అప్రోచ్’. గత ఏడాది కూడా వారు ఈ ‘సూత్ర’ విధానం ద్వారానే అంచనాలు వేశారు. ఈ సూత్ర విధానం ద్వారా గతేడాడి.. దేశంలో కేసులు ఆగస్టు నుంచి వేగంగా పెరిగి, సెప్టెంబరులో పతాకస్థాయికి చేరి, ఫిబ్రవరి నాటికి తగ్గుతాయని వెల్లడించారు. అప్పుడు వారు చెప్పినట్టుగానే జరిగింది. తాజాగా మరోసారి సూత్ర విధానం ద్వారా సెకండ్ వేవ్ అంచనాలను సైతం వెల్లడించారు. ఏప్రిల్ 19 నుంచి మే 17 వరకూ కేసులు పెరుగుతూ వస్తాయని, మే రెండో వారంలో పతాకస్థాయికి చేరుకుంటాయని మిచిగాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్‌హెల్త్ శాస్త్రవేత్తలు ప్రకటించారు. వారి అంచనా మేరకు జూన్ నుంచి కేసులు తగ్గుముఖం పట్టే అవకాశముంది. అంటే మొత్తమ్మీద జూన్ వరకూ కరోనా విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండి తీరాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments