బీజేపీలో చేరిన సింధియా.. కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు
- IndiaGlitz, [Wednesday,March 11 2020]
కేంద్ర మాజీ మంత్రి, మధ్యప్రదేశ్ నేత జ్యోతిరాదిత్య సింధియా మంగళవారం నాడు కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. అయితే.. నిన్న పార్టీకి రాజీనామా చేసిన ఆయన.. ఇవాళ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో సింధియా కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ కండువా కప్పిన నడ్డా.. సింధియాను బీజేపీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ చేరిక కార్యక్రమం ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాయలయం జరిగింది. ఈ సందర్భంగా నడ్డా మాట్లాడుతూ.. బీజేపీ రాజమాత విజయరాజే సింధియా కుటుంబానికి చెందిన జ్యోతిరాదిత్య సింధియా సొంతగూటికి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు.
కాంగ్రెస్‌పై విమర్శలు
‘బీజేపీలోకి నన్ను తీసుకున్నందుకు ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు కృతజ్ఞతలు. నా జీవితాన్ని రెండు ఘటనలు మలుపు తిప్పాయి. తండ్రి మరణం జీవితాన్ని మలుపు తిప్పింది. ఆయన 75వ జయంతి మరోసారి నాకు కొత్త జీవితాన్ని ప్రసాదించింది. యువతను కాంగ్రెస్ పార్టీ విస్మరించింది. ఆ పార్టీలో యువత నిర్లక్ష్యానికి గురవుతోంది. దేశానికి యువత సేవలు అందించలేక పోతోంది. కమల్‌నాథ్ ప్రభుత్వం అవినీతికి కొమ్ము కాస్తోంది. 2019లో ఎవరూ ఊహించని అద్భుతమైన తీర్పు ప్రజలు బీజేపికి ఇచ్చారు. ప్రధాని మోదీ చేతుల్లో దేశం సురక్షితంగా ఉంది’ అని కాంగ్రెస్‌పై సింధియా విమర్శలు గుప్పించారు.