హైదరాబాద్: కరోనా ఎఫెక్ట్‌తో స్కూల్స్‌కు సెలవు!
Send us your feedback to audioarticles@vaarta.com
‘కరోనా వైరస్’ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఇప్పుడీ తెలుగు రాష్ట్రాలకు పాకడంతో ఎప్పుడేం జరుగుతుందో అని జనాలు భయంతో వణికిపోతున్నారు. తెలంగాణలో ఓ కేసు నమోదు కాగానే సామాన్య ప్రజల్లో ఒక్కసారిగా భయాందోళనలు మొదలయ్యాయి. మరోవైపు.. కరోనా అనుమానితులు ఎక్కువవుతుండటంతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక జనం బిక్కుబిక్కుమంటున్నారు. హైదరాబాద్‌లో కరోనా సోకిన వ్యక్తి సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లోని మహేంద్రాహిల్స్ ప్రాంతానికి చెందిన వ్యక్తి. దీంతో ఆ పరిసరాల్లోని పాఠశాలలకు అధికారులు సెలవులు ప్రకటించారు. దగ్గు, తుమ్ములు, జలుబు ఉంటే వెంటనే ఆస్పత్రికి వెళ్లాలని ప్రభుత్వం సూచిస్తోంది. ప్రస్తుతం బాధితుడి ఇంట్లో కూడా ఎవరూ లేరు. మహేంద్రహిల్స్ ప్రాంతం దాదాపుగా ఒక్కొక్కరుగా ఇళ్లు ఖాళీ చేసి బంధువులు, సొంతూళ్లకు వెళ్లిపోతున్నారు. మరోవైపు కంటోన్మెంట్ పారిశుద్ధ్య సిబ్బంది ఈ ప్రాంతంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించి.. ఆ ప్రాంత వాసులకు వైద్య సిబ్బంది తగు జాగ్రత్తలు చెబుతోంది. కొందరు ముందస్తు జాగ్రత్తగా వైద్య పరీక్షలు చేయించుకునేందుకు సిద్ధమవుతున్నారు.
ఎవరెవర్ని కలిశాడో ఏంటో..!
కాగా.. గత నెల 19వ తేదీన దుబాయి నుంచి బెంగళూరుకు ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి వచ్చాడు. 22న మహేంద్రాహిల్స్ లోని సొంతింటికి వచ్చాక ఐదు రోజులపాటు వివిధ ప్రాంతాల్లో తిరిగాడు. అయితే ఇలా తిరిగిన ఐదు రోజుల తర్వాత కరోనా వైరస్ సోకినట్లు గుర్తించడంతో మొదట అపోలో ఆస్పత్రిలో చికిత్స తీసుకుని అనంతరం గాంధీ ఆసుపత్రిలో ప్రస్తుతం వైద్యం తీసుకుంటున్నాడు. ఐదు రోజులపాటు ఆయన ఎక్కడికెళ్లాడు..? ఎవర్ని కలిశాడు..? ఆయన కలిసి ఎవరెవరు తిరిగారు..? ఎవరెవరు ఆయనతో పాటుగా జర్నీ చేశారనేది తెలియరాలేదు. అయితే ఏపీకి సంబంధించిన 17 మంది ఆయనతో కలిసి పయనించినట్లు తెలుస్తోంది. దీంతో అటు ఏపీలో కూడా ఆ 17 మంది కనుగొనే పనిలో అక్కడి ప్రభుత్వం నిమగ్నమైంది.
పడకలు సిద్ధం!
ఇదిలా ఉంటే.. గాంధీలో 40, ఫీవర్‌లో 40, చెస్ట్ ఆస్పత్రిలో 10 పడకలను ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది. గాంధీ ఆస్పత్రిలో 7వ అంతస్తులో కరోనా వైరస్ ఐసోలేటెడ్ వార్డు, అత్యవసర విభాగంలో అక్యూట్ ఎమర్జెన్సీ కరోనా వైరస్ వార్డు పేరిట వార్డులు సిద్ధం చేశామని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం వైరస్ సోకిన వ్యక్తిని ఏడో అంతస్తులోని వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు సరోజనీదేవి కంటి ఆస్పత్రిలో 200 పడకలు, ఉస్మానియా ఆస్పత్రిలో మరో పది పడకలతో వార్డును ఏర్పాటు చేస్తున్నట్లు వైద్యులు మీడియాకు వెల్లడించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments