కన్నడనాట సీన్ రివర్స్.. మళ్లీ కుమారన్నే సీఎం!!
- IndiaGlitz, [Thursday,July 25 2019]
కర్ణాటక రాజకీయాలు కుమారన్న సర్కార్ కుప్పకూలడంతో ముగిశాయనుకుంటే.. ఇప్పుడు మరింత టెన్షన్ పుట్టిస్తున్నాయి. కుమార సర్కార్ కూలడం.. యడ్యూరప్ప సీఎం కావడం ఖాయమని మొదట్నుంచి అందరూ అనుకుంటూ వస్తున్నారు. అయితే చివరికి సీన్ రివర్స్ అయ్యింది. యడ్యూరప్ప స్థానంలో పార్టీ సీనియర్ నేత, ప్రస్తుత ఎంపీ అయిన అనంతకుమార్ హెగ్డే పేరును ముఖ్యమంత్రి పీఠంలో కూర్చొబెట్టాలని ఢిల్లీ కమలనాథులు యోచిస్తున్నట్లు సమాచారం.
ఇదీ అసలు కారణం..!!
యడ్యూరప్ప సీఎం కావాలని ఎక్కువ మంది బీజేపీ ఎమ్మెల్యేలు కోరుకుంటున్నప్పటికీ, ఆర్ఎస్ఎస్ మాత్రం ససేమిరా అంటుండటంతో బీజేపీ అధిష్ఠానం కొత్త పేర్లను పరిశీలిస్తోందట. ఈ నేపథ్యంలో అనంతకుమార్ హెగ్డే పేరును పరిశీలిస్తున్నారట. అంతేకాదు.. ఎమ్మెల్యేలుగా ఉన్న శ్రీరాములు, ఉదాసి, అశోక్ లలో ఇద్దరికి ఉప ముఖ్యమంత్రి పదవులు ఇవ్వాలని కూడా బీజేపీ పెద్దలు భావిస్తున్నారని తెలుస్తోంది. మరోవైపు.. యడ్యూరప్పకు సీఎం పదవి ఇవ్వకుంటే అసంతృప్తులు పెరగవచ్చని అంచనా వేస్తున్న మోదీ-షా ద్వయం అందువల్లే ఇంకా సస్పెన్స్‌ను కొనసాగిస్తున్నట్టు బీజేపీ నేతలు చెబుతున్నారు.
కుమారన్నా.. యడ్డీనా!
మరోవైపు.. ఇప్పటికే రాజీనామాలు చేసిన కాంగ్రెస్ - జేడీఎస్ రెబల్ ఎమ్మెల్యేల వ్యవహారం ఓ కొలిక్కి వచ్చాకనే ప్రభుత్వ ఏర్పాటు దిశగా ముందడుగు వేస్తే బాగుంటుందని కమలనాథులు చెబుతున్నారు. బెంగళూరు చామరాజపేటలోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయ భవనమైన ‘కేశవశిల్ప’కు వచ్చిన యడ్యూరప్ప, అక్కడి ప్రముఖులతో దాదాపు గంటపాటు మంతనాలు జరిపారు. ఆర్ఎస్ఎస్ పెద్దల ఆశీర్వాదం కోసమే తాను వచ్చానని, ఇంతకాలం తాను ఆర్ఎస్ఎస్ నీడలోనే ఎదిగానని చెబుతున్నారు. అయితే ఆర్ఎస్ఎస్ పెద్దలు మాత్రం ఆయన్ను వద్దనుకుని వేరేవారిని సీఎం చేయాలని యోచిస్తున్నారు.
అంతేకాదు.. కుమారస్వామి మాత్రం మళ్లీ మన ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలున్నాయని కాంగ్రెస్-జేడీఎస్ కూటమిలో ఆశలు పుట్టిస్తున్నారు. అయితే ఇదెలా సాధ్యమనే విషయం తెలియాల్సి ఉంది. కుమారన్న మాటలబట్టి చూస్తే సీన్ రివర్స్ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎవరు కన్నడ నాట సీఎం పీఠాన్నెక్కుతారో..? తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే మరి.