SBI:మొరాయించిన ఎస్‌బీఐ సర్వర్.. ఆన్‌లైన్ సేవలకు అంతరాయం, దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు
- IndiaGlitz, [Monday,April 03 2023]
ఇటీవలి కాలంలో పలు బ్యాంక్‌ల సర్వర్లు మొరాయిస్తూ వుండటంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా భారత ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆన్‌లైన్ సేవల్లో సోమవారం అంతరాయం ఏర్పడింది. యూపీఐ లావాదేవీలు, నెట్ బ్యాంకింగ్, యోనో యాప్‌ను వినియోగించలేకపోతున్నట్లు ప్రజలు సోషల్ మీడియా ద్వారా ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ రోజు ఉదయం 9 గంటల నుంచే ఈ ఇబ్బందులు ఎదురవ్వడంతో నెటిజన్ల మీమ్స్‌తో సోషల్ మీడియా హోరెత్తుతోంది. నిజానికి రెండు మూడు రోజుల నుంచే ఎస్‌బీఐ ఆన్‌లైన్ లావాదేవీల్లో సమస్యలు ఎదురైనట్లు మరికొందరు చెబుతున్నారు.
రెండు రోజుల నుంచే ఆన్‌లైన్ సేవలకు ఇబ్బందులు :
కాగా.. 2023-24 ఆర్ధిక సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎస్‌బీఐ తన ఆన్‌లైన్ సేవలకు ఏప్రిల్ 1న స్వల్ప విరామం ఇచ్చింది. అదే రోజు మధ్యాహ్నం మూడు గంటల పాటు ఆన్‌లైన్ సేవలు సైతం అందుబాటులో వుండవని తెలిపింది. అయితే ఈ అంతరాయం కొద్దిగంటల పాటే కాకుండా రోజులు తరబడి కొనసాగుతూ వుండటంతో వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అత్యవసర పనులు వున్న వారికి సర్వర్ మొరాయించడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఈ స్థాయిలో ఫిర్యాదులు వస్తున్నప్పటికీ ఎస్‌బీఐ మాత్రం ఇంకా స్పందించలేదు.