Download App

Savyasachi Review

వ్య‌క్తుల్లో కొన్ని సిండ్రోమ్స్ వారి ప్ర‌వ‌ర్త‌న‌ను డామినేట్ చేస్తుంటాయి. అలాంటి సిండ్రోమ్స్‌లో వానిషింగ్ సిండ్రోమ్ అనే ల‌క్ష‌ణాన్ని ఆధారంగా చేసుకుని, యాక్ష‌న్ జోన‌ర్ క‌థ‌లో బ్లెండ్ చేసి ద‌ర్శ‌కుడు చందు మొండేటి `స‌వ్య‌సా`చి అనే క‌థ‌ను రాసుకున్నాడు. వానిషింగ్ ట్విన్ సిండ్రోమ్ ఆధారంగా ఓ వ్య‌క్తి ఎడ‌మ చేయి అసంక‌ల్పితంగా ప్ర‌తిస్పందిస్తుంది. అలా స్పందించే స‌మ‌యంలో రెండు చేతుల‌కు స‌మాన‌మైన బలం వ‌చ్చేస్తుంది. మ‌రి ఇలాంటి డిఫ‌రెంట్ పాయింట్‌తో ల‌వ్‌స్టోరీస్ చేసే చైత‌న్య సినిమా చేయ‌డానికి ఆస‌క్తి చూపాడంటే ఏకైక కార‌ణం ద‌ర్శ‌కుడు చందు మొండేటి. చైత‌న్య‌తో ప్రేమ‌మ్ వంటి హిట్ చిత్రం చేసిన చందు మొండేటి ఈ సినిమాతో మ‌రో హిట్‌ను అందించాడా?  లేదా?  అని తెలుసుకోవాలంటే క‌థ‌లోకి వెళ‌దాం...

క‌థ‌:

త‌ల్లిదండ్రులు(క‌ల్యాణి, ఆనంద్‌) చేసిన చిన్న త‌ప్పు కార‌ణంగా విక్ర‌మ్‌( నాగ‌చైత‌న్య‌) వానిషింగ్ ట్విన్ సిండ్రోమ్ అనే డిజార్డ‌ర్‌కి గుర‌వుతాడు. దీని కార‌ణంగా ఎక్కువ ఆనందంగా.. బాధ‌గా ఉన్నప్పుడు విక్ర‌మ్ ఎడ‌మ చేయి అత‌ని కంట్రోల్‌లో లేకుండా స్పందిస్తుంటుంది. ఒక వ్య‌క్తి రెండు ర‌కాలుగా ప్ర‌వ‌ర్తించ‌డంతో అత‌ని ఎడ‌మ చేయిని త‌న పెద్ద‌కొడుకుగా భావించి ఆదిత్య అని పేరు పెట్టుకుంటుంది విక్ర‌మ్ తల్లి. ఆమె త‌ర్వాత అక్క(భూమిక‌)తోనే పెరిగి పెద్ద‌వాడ‌వుతాడు. ఆమెకు ఇష్టం లేని పెళ్లిని చేయ‌కుండా అడ్డుప‌డి.. ఇష్ట‌మైన వాడి(భ‌ర‌త్ రెడ్డి)తో పెళ్లి చేస్తాడు విక్ర‌మ్‌. ఆ సంద‌ర్భంలో కాలేజ్‌లో త‌ను ప్రేమించిన చిత్ర‌(నిధి అగ‌ర్వాల్‌)కు దూర‌మ‌వుతాడు. ఆరేళ్ల త‌ర్వాత విక్ర‌మ్ యాడ్ ఫిలిం డైరెక్ట‌ర్ అవుతాడు. అనుకోండా చిత్ర క‌న‌ప‌డుతుంది. ఇద్ద‌రూ మ‌ళ్లీ గొడ‌వ‌లు మ‌ర‌చిపోయి ప్రేమించుకుంటూ ఉంటారు. ఆ స‌మ‌యంలో విక్ర‌మ్ అక్క ఉంటున్న ఇల్లు ప్ర‌మాదానికి గురై కూలిపోతుంది. విక్ర‌మ్ బావ, పాప ప్ర‌మాదంలో చ‌నిపోతారు. అక్క‌య్య హాస్పిట‌ల్ పాల‌వుతుంది. విక్ర‌మ్ బాధ‌ప‌డుతుండ‌గా ఓ రోజు అక్క కూతురు బ్ర‌తికే ఉంద‌నే నిజం తెలుస్తుంది. అస‌లు ఇంత‌కు విక్ర‌మ్‌ని, అత‌ని అక్క‌య్య‌ను టార్గెట్ చేసిందెవ‌రు?  ఎందుకు?   చివ‌ర‌కు విక్ర‌మ్ ఆ వ్య‌క్తిని క‌నిపెట్టాడా?  విక్ర‌మ్ స‌మ‌స్య‌ల‌ను దాట‌డానికి అత‌ని ఎడ‌మ చేయి ఎలా సహ‌క‌రిస్తుంది?  అనే విష‌యాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే..

ప్ల‌స్ పాయింట్‌:

న‌టీన‌టుల విష‌యానికి వ‌స్తే నాగచైత‌న్య వానిషింగ్ ట్విన్ సిండ్రోమ్ ఉన్న వ్య‌క్తిలా.. ఒక‌రు ఇద్ద‌రిలా న‌టించడంలో చ‌క్క‌గా చేశాడు. సిండ్రోమ్ ఉన్న న‌ట‌న కార‌ణంగా ఫ‌స్టాఫ్‌లో కొన్ని స‌న్నివేశాల్లో కామెడీ జ‌న‌రేట్ అవుతుంది. లుక్ పరంగా చైతు బావున్నాడు. ఇక మెయిన్ విల‌న్‌గా చేసిన మాధ‌వ‌న్ ఆనంద్ అనే ఉన్మాది పాత్ర‌లో అద్భుతంగా న‌టించాడు. ఆయ‌న న‌ట‌న గురించి మ‌నం ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. టెక్నీషియ‌న్స్ విష‌యానికి వ‌స్తే ద‌ర్శ‌కుడు చందు మొండేటి అనుకున్న మెయిన్ పాయింట్ బావుంది. అలాగే ఎడ‌మ చేయి రియాక్ట్ అయ్యే సంద‌ర్భాల్లో యాక్ష‌న్ పార్ట్ ఆకట్టుకుంటుంది. నిధి అగ‌ర్వాల్‌, భూమిక‌, భ‌ర‌త్ రెడ్డి, విద్యుల్లేఖా రామ‌న్, వెన్నెల‌కిషోర్‌, స‌త్య‌, తాగుబోతు ర‌మేశ్ ఇలా అంద‌రూ వారి వారి పాత్ర‌ల్లో చక్క‌గా న‌టించారు. కాలేజీలో సుభ‌ద్ర ప‌రిణ‌యం కామెడీ పార్ట్ ఆక‌ట్టుకుంటుంది. ఎం.ఎం.కీరవాణి నేప‌థ్య సంగీతం బావుంది. టైటిల్ సాంగ్ బావుంది. యువ‌రాజ్ సినిమాటోగ్ర‌ఫీ బావుంది.

మైన‌స్ పాయింట్స్‌:

ప్ర‌ధాన‌మైన పాయింట్ బాగానే ఉన్నా.. దాని చుట్టూ ఉన్న స‌న్నివేశాల‌ను ద‌ర్శ‌కుడు చందు మొండేటి బ‌లంగా రాసుకోలేక‌పోయాడు. స‌న్నివేశాలు ఆస‌క్తిక‌రంగా లేక‌పోవ‌డంతో మెయిన్ పాయింట్ బ‌ల‌హీనంగా క‌నప‌డింది. ఎమోష‌న‌ల్ సీన్స్ బాగా లేవు. హీరో, విల‌న్ మ‌ధ్య కూడా మైండ్ గేమ్ వీక్‌గా ఉంది. పాట‌లు బాగా లేవు. ల‌గాయిత్తు పాట‌ను చూసి ఈ సాంగ్‌ను ఎందుకు రీమిక్స్ చేశారా? అనిపిస్తుంది. ఫ‌స్టాఫ్‌లో కాలేజ్ స‌న్నివేశాలు చ‌ప్ప‌గా సాగాయి. సెకండాఫ్లో సీరియ‌స్ క‌థ‌లో మ‌ళ్లీ కాలేజ్ స‌న్నివేశాల‌ను యాడ్ చేశారు. ఫ‌స్టాఫ్‌లో కొంత‌మేర ఎడిట‌ర్ క‌ట్ చేసేసి ఉండొచ్చు.

విశ్లేష‌ణ‌:

సిండ్రోమ్‌ను యాక్ష‌న్ పార్ట్‌కు జ‌త చేసి సినిమాను తెర‌కెక్కించాల‌నే పాయింట్‌ను చందు మొండేటి చ‌క్క‌గా అనుకున్నాడు. ఉదాహ‌ర‌ణ‌కు శంక‌ర్ చేసిన అప‌రిచితుడు సినిమాలో హీరో కూడా డిజార్డ‌ర్‌తో బాధ‌ప‌డుతుంటాడు. కానీ ఆ సినిమాలో స‌న్నివేశాలు చాలా బలంగా ఉంటాయి. ఈ సినిమాలో చందు గ్రిప్పింగ్‌గా సినిమాను న‌డిపించ‌డంలో స‌క్సెస్ కాలేక‌పోయాడు. మంచి నటీన‌టులు, టెక్నీషియ‌న్స్‌, నిర్మాత‌లు దొరికినా సినిమా మెప్పించేంత గొప్ప‌గా లేదంటే కార‌ణం అంద‌రి చూపు చందు వైపుకే తిరుగుతాయి. చైత‌న్య యాక్ష‌న్ జోన‌ర్‌లో హిట్ కొట్టి యాక్ష‌న్ హీరో ఇమేజ్ తెచ్చుకోవాల‌నే ఆశకి మ‌రోసారి బ్రేక్ ప‌డ్డ‌టే...

చివ‌ర‌గా..

ఓ క‌థ‌లో ప్ర‌ధాన‌మైన పాయింట్‌ను సినిమాగా మ‌ల‌చ‌డమంటే చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి. సన్నివేశాల‌ను ఆకట్టుకునేలా ఎంగేజింగ్‌గా ఉండేలా రాసుకోవాలి. ఫ‌స్టాఫ్ అంతా క్యారెక్ట‌ర్స్ ప‌రిచ‌యం.. కాలేజ్ బ్యాక్ డ్రాప్ తో సాగిపోయే స‌వ్య‌సాచి.. సెకండాఫ్ అంతా మైండ్ గేమ్‌తో సాగిపోతుంది. అయితే ప్రీ క్లైమాక్స్ త‌ర్వాత కూడా ఆ ఊపు క‌న‌ప‌డ‌దు. సినిమాను లాగించేయాల‌నే స్టైల్లో క‌న‌ప‌డింది.

Read Savyasachi Movie Review in English

Rating : 2.8 / 5.0