KCR: కేసీఆర్ తీరుపై సోషల్ మీడియాలో సెటైర్లు.. ఇప్పుడు గుర్తొచ్చారా అంటూ..?
Send us your feedback to audioarticles@vaarta.com
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ వ్యవహారశైలిపై సోషల్ మీడియాలో విస్తృతమైన చర్చ జరుగుతోంది. ఛలో నల్లగొండ సభలో ఆయన మాట్లాడిన వ్యాఖ్యలపై ట్రోలింగ్ నడుస్తోంది. పదేళ్లు సీఎంగా ఉన్న కేసీఆర్.. అధికారం పోగానే ఉద్యమాలు చేయాలంటూ ప్రజలకు పిలుపునివ్వడంపై విమర్శలు చేస్తున్నారు. తెలంగాణ ఏర్పాడ్డాక కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కనీసం ఉద్యమకారులను తన పక్కకు కూడా రానివ్వలేదని గుర్తు చేస్తున్నారు. అంతేకాదు ఎవరైనా తమ డిమాండ్ల కోసం ఆందోళనలు చేస్తుంటే ఉక్కుపాదంతో అణచివేసిన సంగతిని కూడా లేవనెత్తుతున్నారు.
తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన ఉస్మానియా విద్యార్థులను కనీసం యూనివర్సిటీ గడప దాటినీయకుండా కంచెలు ఏర్పాటు చేసింది ఎవరని నిలదీస్తున్నారు. అలాగే ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పడితే వారిపై ఉక్కుపాదం మోపింది ఎవరని ప్రశ్నిస్తున్నారు. ఉద్యమకారులైన కోదండరామ్‌పై వాడు వీడు అంటూ అనుచిత వ్యాఖ్యలు చేసింది ఎవరి హయాంలో అంటున్నారు. అలాగే సీఎంను కలవడానికి వచ్చిన ప్రజాకవి గద్దర్‌ను ప్రగతిభవన్ ఎదుట నడిరోడ్డుపై గంటల తరబడి కూర్చోబెట్టింది ఎవరని మండిపడుతున్నారు.
ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్‌ను ఎత్తివేసిన ఘనత ఏ ప్రభుత్వానిది అని ఎదురు ప్రశ్నలు వేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఉద్యమాలను, ఉద్యమకారులను తీవ్రంగా అణిచివేసిన కేసీఆర్.. ఇప్పుడు ఓడిపోగానే ప్రజల్లోకి వచ్చి ఉద్యమాలు చేయాలని, నడిరోడ్డు మీద నిలదీస్తానని చెప్పడం విడ్డూరంగా ఉందని సెటైర్లు వేస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు విర్రవీగిన కేసీఆర్ అండ్ కోకు ప్రజలు ఇప్పుడు గుర్తుకొచ్చారా అని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
వాస్తవంగా తెలంగాణను తాను, తన కుమారుడు కేటీఆర్ మాత్రమే పాలిస్తారని కేసీఆర్ భావించారని ఉద్యమకారులు చెబుతూ ఉంటారు. అసలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి కాదు కదా కనీసం 10 ఎమ్మెల్యే సీట్లు కూడా గెలవలేదని అంచనా వేశారు. ఇక బీజేపీకి అంత బలం లేదని ఊహించుకున్నారు. దీంతో తనను తెలంగాణలో ఓడించే పార్టీనే లేదని జబ్బలు చర్చుకున్నారు. కానీ రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్‌గా కేసీఆర్‌ను ధీటుగా ఎదుర్కొన్నారు. మాటకు మాట.. కౌంటర్‌కు ప్రతికౌంటర్ ఇస్తూ జనాల్లో పాపులారిటీ తెచ్చుకున్నారు.
దీంతో కాంగ్రెస్ పార్టీలో విపరీతమైన ఊపు వచ్చింది. ఈ నేపథ్యంలో కేసీఆర్ తీరుపై విరుక్తి చెందిన ప్రజలు, ఉద్యమకారులు కూడా కాంగ్రెస్‌ను ఆదరించి అధికారం అప్పగించారు. తన ప్రత్యర్థి అయిన రేవంత్ రెడ్డి తెలంగాణకు ముఖ్యమంత్రి కావడాన్ని కేసీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అందుకే ప్రతిపక్ష నేత అయినా కూడా అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వాన్ని ప్రశ్నించడం లేదని చెబుతున్నారు. అలాంటిది నల్గొండ వెళ్లి ఉద్యమాలు తమకు కొత్త కాదని.. ప్రజలు పోరాడాలని చెప్పడం చూసి నివ్వెరపోతున్నారు.
కేసీఆర్ తాపత్రయం అంతా ప్రజల గురించి కాదని.. తన పార్టీ ఉనికి కోసమని విశ్లేషించుకుంటున్నారు. ఎందుకంటే త్వరలోనే పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కంటే ఎక్కువ స్థానాలు గెలిస్తేనే బీఆర్ఎస్ పార్టీలో నేతలు ఉంటారు. అలా కాకుండా కేవలం ఒకటి, రెండు ఎంపీ స్థానాలకే పరిమతమైతే ఆ పార్టీని వదిలి నేతలు తమ దారి తాము చూసుకుంటారు. అందుకే గులాబీ బాస్ నీళ్ల కోసం ఉద్యమాలు అంటూ కొత్త రాగం అందుకున్నారని రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఎలాగైనా ఎంపీ ఎన్నికల్లో బలమైన ప్రభావం చూపించి కాంగ్రెస్‌ను ధీటుగా ఎదుర్కోవాలని స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. అయితే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం కేసీఆర్ దూకుడు కళ్లెం వేసే పనిలో ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీని భూస్థాపితం చేయాలని కంకణం పెట్టుకున్నారు. మరి కేసీఆర్ వ్యూహాలకు రేవంత్ ఎలా చెక్ పెడతారో అనే దానిపై ఆసక్తి నెలకొంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com