ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అవుతూనే అన్నాడీఎంకే నేతలకు షాక్ ఇచ్చిన శశికళ
Send us your feedback to audioarticles@vaarta.com
ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అవుతూనే శశికళ అన్నాడీఎంకే నేతలకు షాక్ ఇచ్చారు. ఆమె జైలు నుంచి బయటకు వస్తూనే దివంగత ముఖ్యమంత్రి జయలలితను అనుసరించడం గమనార్హం. జయ పార్టీ కార్యక్రమాలకు వాడే కారును, ఆ కారుపై అన్నాడీఎంకే జెండాను వినియోగించి, అచ్చు జయలానే చేతులూపుతూ కార్యకర్తలకు కనిపించారు. అది కూడా జయ పార్టీ కార్యక్రమాలకు ఎక్కువగా వినియోగించే కారులో కూర్చుని రావడం విశేషం. కాగా.. గతంలో అన్నాడీఎంకే నుంచి శశికళను బహిష్కరిస్తున్నట్టు ఆ పార్టీ నేతలు ప్రకటించారు. అయినప్పటికీ ఆమె జయ కారులో ఆ పార్టీ పతాకాన్నే పెట్టుకుని రావడం చర్చనీయాంశంగా మారింది. అన్నాడీఎంకే అధినేత్రి అనే భావన తమిళవాసుల్లో కలిగేంచేందుకు శశికళ ప్రయత్నించినట్టు ఆమె తీరు చెప్పకనే చెబుతోంది.
నాలుగేళ్ల పాటు పరప్పన్ జైలులో శశికళ ఉన్నారు. అయితే ఆమె విడుదలయ్యే సమయంలో కరోనా సోకి విక్టోరియా ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఆమె కరోనా నుంచి కోలుకోవడంతో ఆస్పత్రి వర్గాలు ఆమెను ఆదివారం డిశ్చార్జి చేశాయి. కాగా.. శశికళ కరోనా నుంచి కోలుకున్నప్పటికీ ఆమె వారం రోజుల పాటు క్వారంటైన్లో ఉండాలని వైద్యులు సూచించారు. వారి సూచనల మేరకు శశికళ బెంగుళూరు శివారులోని దేవనహళ్లిలో వున్న ఫాంహౌస్‌కు వెళ్లిపోయారు. కొద్దిరోజులు ఆమె అక్కడే విశ్రాంతి తీసుకోనున్నారు. అయితే శశికళకు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. కాగా... శశికళ అన్నాడీఎంకే పార్టీ జెండాను వినియోగించడం పట్ల ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ పార్టీ నుంచి బహిష్కరించినప్పటికీ జెండాను ఎలా వినియోగిస్తారని ప్రశ్నిస్తున్నారు.
దీనిపై మత్స్యశాఖా మంత్రి జయకుమార్ మాట్లాడుతూ.. అన్నాడీఎంకే జెండాను వినియోగించేందుకు శశికళకు ఎలాంటి హక్కు లేదన్నారు. శశికళకు అన్నాడీఎంకేలో సాధారణ సభ్యత్వం కూడా లేదన్నారు. శశికళ సహా ఆమె కుటుంబ సభ్యులందరినీ జయలలిత పార్టీ నుంచి తొలగించారన్నారు. అందుకే ఆ కుటుంబీకులు ‘అమ్మా మక్కల్ మున్నేట్ర కళగం’ పేరుతో పార్టీ పెట్టుకుని, ఎన్నికల కమిషన్ అను మతితో గుర్తు కూడా రూపొందించుకున్నారన్నారు. అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు ఎంజీఆర్, దివంగత సీఎం జయలలిత చిత్రపటాలను వాడుకునేందుకు కూడా శశికళకు హక్కు లేదని జయకుమార్ పేర్కొన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments