జైలు నుంచి విడుదల కాబోతున్న జయ నెచ్చెలి శశికళ!

  • IndiaGlitz, [Saturday,June 27 2020]

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళ జైలు నుంచి విడుదల కాబోతున్నారని ప్రచారం జరుగుతోంది. సత్ప్రవర్తన కారణంగా ఆమె విడుదల కాబోతున్నట్టు తెలుస్తోంది. ఒకట్రొండు రోజుల్లో ఆమె ముఖ్యమంత్రి పదవిని వరించబోతుండగా తమిళ రాజకీయాలు ఊహించని మలుపు తిరిగాయి. శశికళ అక్రమాస్తుల కేసు సుప్రీంకోర్టులో విచారణకు రావడం.. దోషిగా నిర్ధారణ అవడం కొన్ని గంటల్లోనే జరిగిపోయాయి. దీంతో ఆమెను బెంగళూరు పరప్పన అగ్రహార జైలుకి తరలించారు. అప్పటి నుంచి ఆమె అక్కడే శిక్ష అనుభవిస్తున్నారు.

గతంలో కూడా శశికళ జయలలితతో కలిసి కొంతకాలం అదే జైలులో విచారణ ఖైదీగా శిక్షను అనుభవించారు. అయితే ప్రతి ఏడాది స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని సత్ప్రవర్తన కలిగిన కొందరు ఖైదీలను ప్రభుత్వాలు విడుదల చేస్తున్నాయి. ఆగస్టు 15 దగ్గరకు రానున్న నేపథ్యంలో కర్ణాటక జైళ్ల శాఖ కూడా సత్ప్రవర్తన కలిగిన ఖైదీల జాబితాను రూపొందిస్తోందని సమాచారం. ఈ జాబితాలో ఆమె పేరు కచ్చితంగా ఉంటుందని జోరుగా ప్రచారం జరుగుతోంది.