Download App

Sarpatta Review

తమిళంతో పాటు తెలుగులో కూడా గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఆర్య. నటుడిగా వేరియషన్స్ కోసం విలన్ పాత్రలు కూడా చేశాడు. తాజాగా ఆర్య నటించిన పీరియాడిక్ స్పోర్ట్ డ్రామా 'సార్పట్ట పరంపర'. రజనీకాంత్ తో చేసిన కబాలి, కాలా చిత్రాలతో సౌత్ లో గుర్తింపు పొందిన పా రంజిత్ ఈ చిత్రానికి దర్శకుడు. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.

కథ:

దివంగత ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ కాలంలో ఈ కథ జరుగుతుంది. మద్రాసు నగరంలో బ్రిటిష్ వారి నుంచి నేర్చుకున్న బాక్సింగ్ బాగా వ్యాపిస్తుంది. వంశపారంపర్యంగా బాక్సింగ్ నేర్చుకున్న వారు గ్రూపులుగా ఏర్పడతారు. ఆ గ్రూపులని పరంపరగా పిలుస్తుంటారు. అందులో ప్రధానమైనవి సార్పట్ట పరంపర, ఇడియప్ప పరంపరలు.

సార్పట్ట పరంపరకు రంగయ్యోరు(పశుపతి) కోచ్ గా ఉంటారు. సార్పట్ట ఆయన కనుసన్నల్లోనే నడుస్తూ ఉంటుంది. ఇడియప్ప పరంపరపై సార్పట్టని విజేతగా నిలపాలనేది అతడి ఆశయం. దానికోసం తన శిష్యులకు శిక్షణ ఇస్తుంటాడు. ఇక స్కూల్ ఎగ్గొట్టి మరీ బాక్సింగ్ పోటీలు చూస్తూ దానిపై మక్కువ పెంచుకుంటాడు సమరన్(ఆర్య). యువకుడు అయ్యాక హార్బర్ లో కూలిపని చేస్తూ కూడా బాక్సింగ్ పోటీలు చూస్తుంటాడు.

ఎప్పటికైనా బాక్సింగ్ రింగ్ లో తలపడాలనేది అతడి కోరిక. కానీ ఆర్య తల్లికి అతడు బాక్సింగ్ పేరెత్తడం కూడా ఇష్టం ఉండదు. ఇలాంటి సమయంలో సార్పట్ట ఆటగాడు ఇడియప్ప పరంపర ప్రధాన ఆటగాడు వేటపులి (జాన్ కొక్కెన్) చేతిలో ఓటమి చెందుతుంది. అవమాన భారం ఉన్నప్పటికీ పశుపతి ఇడియప్ప పరంపరకు ఛాలెంజ్ చేస్తాడు.

ఈ క్రమంలో ఆర్య.. పశుపతి కంటపడతాడు. బాక్సింగ్ గ్లౌజ్ వేసుకుంటాడు. పశుపతి చేసిన ఛాలెంజ్ ఏంటి ? ఆర్య తల్లికి బాక్సింగ్ ఎందుకు ఇష్టం ఉండదు ? బాక్సింగ్ మొదలుపెట్టాక ఆర్యకు ఎదురైన ఆటంకాలు ఏంటి ? పశుపతి పంతం నెగ్గిందా ? ఇవన్నీ సినిమా చూసే తెలుసుకోవాలి.

విశ్లేషణ:

కబాలి, కాలా లాంటి పరాజయాల తర్వాత పా రంజిత్ చేసిన అద్భుత ప్రయత్నం సార్పట్ట పరంపర. కథకు, ఎమోషన్స్ కు ప్రాధాన్యత ఇస్తూ ఈ చిత్రాన్ని రంజిత్ తెరకెక్కించారు. హీరో ఆర్య ఈ చిత్రం కోసం ప్రాణం పెట్టి చేశాడనే చెప్పాలి. సినిమా నెమ్మదిగా మొదలై ఓ మంచి కథని పీరియాడిక్ బాక్సింగ్ నేపథ్యంలో చూస్తున్నాం అనే ఫీలింగ్ తొలి 20 నిమిషాల్లోనే ప్రేక్షకులకు కలుగుతుంది.

కథలోకి ఒక్కో మెట్టు అన్నట్లుగా హీరోని దర్శకుడు ఇన్వాల్వ్ చేసిన విధానం బావుంది. ఇంటర్వెల్ టైం కి ప్రేక్షకులు మంచి హై పీలింగ్ కలుగుతుంది. బాక్సింగ్ క్రీడే అయినప్పటికీ దాని చుట్టూ అల్లిన ఆధిపత్య పోరుతో కథ రంజుగా ఉంటుంది. పీరియాడిక్ డ్రామా కాబట్టి అప్పటి పరిస్థితులకు తగ్గట్లుగా ఉండే నటీనటుల వేషధారణ, అలవాట్లు, చుట్టూపరిసరాలు అప్పటి కాలానికి తీసుకెళతాయి.

బాక్సింగ్ క్రీడపై మక్కువ ఉండే యువకుడిగా, తల్లికి బిడ్డగా, భార్యకు భర్తగా ఆర్య చూపించిన నటన భేష్ అనిపిస్తుంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో పరిస్థితుల వల్ల తాగుబోతుగా మారిన వ్యక్తిగా అద్భుతంగా నటించాడు.

ముందుగా చెప్పుకున్నట్లుగా మంచి హై ఫీలింగ్ తో ఫస్ట్ హాఫ్ ముగుస్తుంది. కానీ సెకండ్ హాఫ్ లో ప్రీ క్లైమాక్స్ వరకు కథ ట్రాక్ తప్పినట్లు కనిపిస్తుంది. ఆధిపత్య పోరు, ఆర్యపై జరిగే కుట్రలని దర్శకుడు సరైన విధంగా నడిపించడంలో తడబడ్డాడు.ఆర్య కుట్రల్లో చిక్కుకోవడం, వ్యసనపరుడిగా మారే సన్నివేశాలు, చిన్నపాటి ఫ్లాష్ బ్యాక్ గందరగోళానికి గురిచేసే విధంగా ఉంటాయి.

క్లైమాక్స్ బాగానే ఉన్నప్పటికీ.. పూర్తి స్థాయి కిక్ ఇవ్వలేదు. దర్శకుడు సినిమాటిక్ లిబర్టీ తీసుకుని రెగ్యులర్ తరహాలోనే పూర్తి చేశాడు. దాదాపు మూడు గంటలు ఉండే ఈ చిత్ర నిడివి మరో మైనస్ అని చెప్పొచ్చు.

నటీనటులు:

ముందుగా చెప్పుకున్నట్లు ఈ చిత్ర నేపథ్యం, కథ తోపాటు హీరో ఆర్య ప్రధాన బలం. కథ కోసం ఆర్య తనని తాను మార్చుకున్న విధానం అద్భుతం. సినిమా ప్రారంభం నుంచి వివిధ సందర్భాల్లో కథ పరంగా ఆర్య మేకోవర్, వేరియేషన్స్ మార్చాల్సి వస్తుంది. దాని కోసం ఆర్య పడ్డ కష్టం సినిమాలో ప్రతి సీన్ లో కనిపిస్తుంది.

హార్బర్ లో పనిచేసే కూలీగా, బాక్సింగ్ ఆటగాడిగా, కోపంతో రగిలిపోయే వ్యక్తిగా, వ్యసనపరుడిగా ఆర్య నటన మరో స్థాయిలో ఉంటుంది. కోచ్ పాత్రలో పశుపతి నటన బావుంది. ఇక ఆర్య భార్యగా యువనటి దుషారా విజయన్ చాలా బాగా చేసింది. భర్తని ప్రేమించే ఆ కాలం నాటి యువతి పాత్రలో ఒదిగిపోయింది.

ఆమె నటన, హావభావాలు నేచురల్ గా ఉన్నాయి. ఎమోషనల్ సన్నివేశాల్లో దుషారా సాలిడ్ పెర్ఫామెన్స్ ఇచ్చింది. జాన్ విజయ్ ఆంగ్లో ఇండియన్ గా విభిన్నంగా నటించి ఆకట్టుకున్నాడు.

సాంకేతికంగా:

దర్శకుడిగా పా రంజిత్ పడ్డ కష్టం సినిమా మొత్తం కనిపిస్తుంది. ఎమెర్జెన్సీ కాలంలో చెన్నైలో బాక్సింగ్ క్రీడా పరిస్థితులని అద్భుతంగా చూపించాడు. పా రంజిత్ నుంచి వచ్చిన బలమైన కథ ఈ చిత్రం అని చెప్పొచ్చు. నటీనటుల గెటప్ విషయంలో ప్రత్యేక శ్రద్ద తీసుకున్నట్లు అనిపిస్తుంది.

సెకండ్ హాఫ్ లో కథా గమనం కాస్త ట్రాక్ తప్పినట్లు అనిపిస్తుంది. నిడివి ఎక్కువైంది. మిగిలిన అన్ని విభాగాల్లో రంజిత్ దర్శకుడిగా సక్సెస్ అయ్యాడు. అప్పటి పరిస్థితులకు తగ్గట్లుగా డైలాగులు బావున్నాయి. బ్యాగ్రౌండ్ సంగీతం ఒకే అనిపించే విధంగా ఉంది.

సినిమాటోగ్రఫీ విభాగంలో జి. మురళి అదరగొట్టేశారు అని చెప్పాలి. ఆయన కెమెరా వర్క్ సినిమాకు బలాన్ని ఇచ్చింది. ప్రేక్షకులు సినిమాలో లీనం కావడంలో మురళి కెమెరా పనితనం ఎంతైనా ఉంది. ఎడిటింగ్ విభాగంలో లోపాలు చాలానే ఉన్నాయి. సెకండ్ హాఫ్ లో విపరీతమైన సాగదీత కనిపిస్తుంది. అక్కడ చాలా సన్నివేశాలకు కోత పెట్టి ఉంటే బావుండేది.

ఫైనల్ పంచ్:

కథా నేపథ్యం, ఆర్య బ్రిలియంట్ పెర్ఫామెన్స్, బాక్సింగ్ పోరాటాలు ఈ చిత్రానికి ప్రధాన బలం. పీరియాడిక్ బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం సరికొత్త ఫీలింగ్ ఇస్తుంది.  సెకండ్ హాఫ్ లో సాగదీసిన సన్నివేశాలు మైనస్. సో అంచనాలు కాస్త అదుపు చేసుకుని ఈ చిత్రాన్ని ఓపిగ్గా చూడాలి.

Read 'Sarpatta' Movie Review in English

Rating : 2.8 / 5.0