సర్థార్ గబ్బర్ సింగ్ మరో షోలే అవుతుంది - మెగాస్టార్ చిరంజీవి
Monday, March 21, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - కాజల్ అగర్వాల్ జంటగా నటించిన తాజా చిత్రం సర్ధార్ గబ్బర్ సింగ్. ఈ చిత్రాన్ని బాబీ తెరకెక్కించారు. పవన్ ఫ్రెండ్ శరత్ మరార్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. యువ సంగీత సంచలనం దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. ఏప్రిల్ 8న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్న సర్ధార్ గబ్బర్ సింగ్ ఆడియో రిలీజ్ కార్యక్రమం సినీ ప్రముఖులు, అభిమానుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్యఅతిథిగా హాజరై సర్ధార్ గబ్బర్ సింగ్ ఆడియోను రిలీజ్ చేసారు.
గీత రచయిత రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ...ఈ సినిమాలో మూడు పాటలు రాసాను. పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ కి తగ్గట్టు పాటలు రాసాను.నేను రాసిన పాటలు హిట్ అయ్యాయంటే అందులో ఫిఫ్టీ పర్సెంట్ క్రెడిట్ దేవిశ్రీప్రసాద్ గారికి దక్కుతుంది. టైటిల్ సాంగ్ హిట్ అయ్యిందంటే కారణం దేవిశ్రీ. ఈ సినిమాలో ఇంటర్వెల్ బ్యాంగ్ లో వచ్చే పాట రాసాను. అది నాకు మంచిపేరు తీసుకువస్తుందని నమ్మకం. పవన్ కళ్యాణ్ గారితో డిష్కష్ చేసి పాటలు రాసే అకాశం లభించింది. పవన్ కళ్యాణ్ గారికి పాటలు రాయడం అదృష్టంగా భావిస్తున్నాను అన్నారు.
నిర్మాత ఎ.ఎం.రత్నం మాట్లాడుతూ...సర్ధార్ గబ్బర్ సింగ్ సినిమా షూటింగ్ స్పాట్ కి వెళ్లాను. ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ రాత్రి పగలు అనే తేడా లేకుండా కష్టపడ్డారు. సినిమా కోసం ఇంత కష్టపడే హీరోను ఇంత వరకు నేను చూడలేదు. ఏప్రిల్ 8న సర్ధార్ రిలీజ్ అని ఎనౌన్స్ చేసారు. మరి..రిలీజ్ అవుతుందా అని అడిగాను. ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది అని పవన్ చెప్పారని తెలియచేసారు.
హీరోయిన్ సంజన మాట్లాడుతూ...నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ని. ఈ చిత్రంలో కళ్యాణ్ గారితో నటించడం చాలా హ్యాఫీగా ఫీలవుతున్నాను. ఆయన నుంచి చాలా నేర్చుకున్నాను. ముఖ్యంగా ఎలా వర్క్ చేయాలో నేర్చుకున్నాను అన్నారు.
ఆలీ మాట్లాడుతూ...డైరెక్టర్ బాబీని పక్కనపెట్టి పవన్ కళ్యాణ్ గారే డైరెక్షన్ చేసారని టాక్ వినపడుతుంది. కానీ..అందులో వాస్తవం లేదు. ఎవరి పని వాళ్లే చేయాలని కళ్యాణ్ గారు చెబుతుంటారు. ఆయన కావాలంటే శంకర్ ని తీసుకువచ్చి సినిమా చేయగలరు. కానీ..బాబీలో టాలెంట్ చూసి అవకాశం ఇచ్చారు. ఈ సినిమాలో వీణ స్టెప్పు కి కళ్యాణ్ గారు డాన్స్ చేసారు అదిరిపోతుంది అంతే.. ఇక హీరోయిన్ కాజల్ విషయానికి వస్తే..ఈ సినిమాలో ఒక సీన్ లో కాజల్ చేసిందండి ఏక్టింగూ.. అదరగొట్టేసింది అన్నారు.
డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ...తెలుగువాడి సినిమా బలం ఏమిటో చాటిచెప్పిన స్టార్ మెగాస్టార్. ఆయన కుటుంబం నుంచి పవర్ స్టార్ ని ఇచ్చారు. ఆతర్వాత మెగాపవర్ స్టార్ ని ఇచ్చారు. ఇక ఈ సినిమా గురించి చెప్పాలంటే నాకు ఏమీ తెలీయదు. మీలాగే (అభిమానులు) నేను సర్ధార్ గబ్బర్ సింగ్ సినిమా కోసం ఎదురుచూస్తున్నాను. పవర్ ఉన్న మనిషి పవన్ కళ్యాణ్ గార్కి ఈ సినిమా ఆనందం కలిగించాలని కోరుకుంటున్నాను. సర్ధార్ సెట్ కి వెళ్లినా బాబీతో మాట్లాడడం కుదరలేదు. రికార్డ్ కలెక్షన్స్ అన్ని లెక్కపెట్టేసుకున్న తర్వాత బాబీతో మాట్లాడతాను. మన పరిథి మరింత ముందు వెళుతుంది. భారతీయ సినిమా పరిశ్రమ ఒకటి కావాలి. అది ఈ సర్ధార్ గబ్బర్ సింగ్ సినిమాతో కావాలని కోరుకుంటున్నాను అన్నారు.
డైరెక్టర్ బాబీ మాట్లాడుతూ...చిన్నప్పుడు పండగ వస్తే మా నాన్న సినిమాకి తీసుకెళ్లేవారు. ఆ పండగ ఏదో కాదు చిరంజీవి గారి సినిమా. కాలేజికి వెళ్లే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారి సినిమాలు చూసేవాడిని. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారితో ఫోటో తీయించుకోవాలనుకున్నాను కుదరలేదు. అలాంటిది పవన్ కళ్యాణ్ గారి సినిమాకి నేను డైరెక్టర్ అంటే కలలో కూడా ఊహించలేదు. కళ్యాణ్ గారికి కథ చెప్పాను నచ్చలేదు. కానీ..ఆయన రాసుకున్న కథని నన్ను డైరెక్ట్ చేయమన్నారు. నామీద ఎంత నమ్మకం అంటే...పూణే వెళ్లి ఒక ఎపిసోడ్ షూట్ చేసాం. నేను బాగానే తీసుంటానని నమ్మకంతో చాలా రోజులు ఆ ఎపిసోడ్ చూడలేదు. కళ్యాణ్ గారి దగ్గర నుంచి యుద్దం - మొండితనం - సహనం - ప్రేమించడం...ఇలా ఎన్నో నేర్చుకున్నాను. సర్ధార్ టీమ్ అంతా ఒక సైనికుల్లా వర్క్ చేసాం. దేవిశ్రీప్రసాద్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన ఈ సినిమాకి చాలా మంచి పాటలు అందించారు. తన స్నేహితుడి కలను నేరవేర్చడానికి కృషి చేసిన నిర్మాత శరత్ మరార్ గారు. ఆయన అసలు ప్రొడ్యూసర్ లాగే అనిపించలేదు. అందరితో కలసిపోయి వర్క్ చేసారు. నాకు అవకాశం ఇచ్చిన పవన్ కళ్యాణ్ గార్కి థ్యాంక్స్ తెలియచేస్తున్నాను అన్నారు.
దేవిశ్రీప్రసాద్ మాట్లాడుతూ...ఒక పక్క సర్ధార్ - మరో పక్క శంకర్ దాదా ఇద్దరూ స్టేజ్ పైకి నడుచొస్తున్న సమయంలో ఈ రెండు పాటలు ప్లే చేయడం...ఈ రెండు పాటలు నావే కావడం ఆనందంగా ఉంది.పవన్ కళ్యాణ్ గారితో గతంలో మూడు సినిమాలకు వర్క్ చేసాను. ఈ సినిమా కోసం వర్క్ చేసేటప్పుడు ఎక్కువ సమయం కళ్యాణ్ గారితో గడిపే అవకాశం లభించింది. బాబీ ఎంటర్ టైన్మెంట్ - మాస్ ని మిక్స్ చేసి ఈ సినిమా తీసాడు. సర్ధార్ అందరికీ నచ్చుతుంది అన్నారు.
హీరోయిన్ కాజల్ అగర్వాల్ మాట్లాడుతూ...పవర్ స్టార్ ఈ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేసారు. ఆయన డెడికేషన్ చూసి ఇన్ స్పైయిర్ అయ్యాను. నేనే కాదు పవర్ స్టార్ సర్ధార్ టీమ్ లోని ప్రతి ఒక్కర్ని ఇన్ స్పైయిర్ చేసారు. సర్ధార్ సినిమాలో నటించే అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ తెలియచేస్తున్నాను అన్నారు.
నిర్మాత శరత్ మరార్ మాట్లాడుతూ...పవన్ కళ్యాణ్ ఈ సినిమా కోసం డే అండ్ నైట్ వర్క్ చేసారు. ఒక్కొక్కసారి రాత్రి 2.30 వరకు కూడా వర్క్ చేసేవారు. కళ్యాణ్ గారితో 17 ఏళ్లుగా జర్నీ చేస్తున్నాను. ఆయన సింపుల్ గా నవ్వుతారు కానీ...మామూలు మనిషి కాదు.(నవ్వుతూ..) ఈ సినిమా కోసం చేసిన జర్నీ వండర్ ఫుల్ ఎక్స్ పీరియన్స్. ఈ ఎక్స్ పీరియన్స్ నాకు లైఫ్ టైం గుర్తుంటుంది. బాబీ కళ్యాణ్ గారి మనసులో ఏముందో తెలుసుకుని...ఆతర్వాత టీమ్ అందర్ని కో ఆర్డినేట్ చేసుకుంటూ సినిమాని బాగా తెరకెక్కించారు. రెండున్నర సంవత్సరాల జర్నీకి బిగ్గెస్ట్ గిఫ్ట్ చిరంజీవి గారు ఆడియో ఫంక్షన్ కి రావడం. సర్ధార్ టీమ్ అందరికీ థ్యాంక్స్ తెలియచేస్తున్నాను అన్నారు.
మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ...చాలా కాలం తర్వాత తమ్ముడు కళ్యాణ్ బాబు ఫంక్షన్ లో పాల్గొనడం సంతోషంగా ఉంది. ఈమధ్య నేను ఎక్కువ సార్లు చూసిన సినిమా గబ్బర్ సింగ్. ఫుల్ పిక్చర్ రెండు సార్లు చూసినా...టి.వి లో ఎప్పుడు వచ్చినా ఇంట్రస్టింగ్ గా అలా చూస్తుండిపోతున్నాను. గబ్బర్ సింగ్ లో పవన్ విశ్వరూపం చూపించాడు. ఇది నేను కళ్యాణ్ నుంచి కోరుకుంది అని ముచ్చటపడ్డాను. చాలా చాలా ఎంజాయ్ చేస్తూ చూసాను. దబాంగ్ కి గబ్బర్ సింగ్ కి సంబంధం లేదు. టోటల్ గా కళ్యాణ్ మార్చుకుని తనదైన మాస్ మసాలాను చూపించాడు. ట్రెండ్ ని పవన్ ఫాలో అవ్వడు...ట్రెండ్ సెట్ చేస్తాడు. ఇది గబ్బర్ సింగ్ తో ప్రూవ్ అయ్యింది.
అత్తారింటికి దారేది సినిమాలో ఇంకో కోణం చూపించి సపరేటు ట్రెండ్ ని సెట్ చేసాడు. ఈ సినిమా పవన్ మనసుపెట్టి చేసాడు. కథ - స్ర్కీన్ ప్లే తనే రాసాడు. గబ్బర్ సింగ్ లో తన ఇన్ పుట్స్ ఎలా ఉన్నాయో...ఇందులో కూడా ఉన్నాయి. బాబీ ప్రతిభతో తనదైన స్టైల్ తో ఈ సినిమాని తెరకెక్కించాడు. సర్ధార్ సెట్స్ కి వెళ్లాను. రతన్ పూర్ విలేజ్ సెట్ చూసిన తర్వాత సర్ధార్ గబ్బర్ సింగ్ మరో షోలే అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమా ఆద్యంతం అందర్నీ అలరిస్తుంది.ఈ సినిమా కోసం అభిమానులు ఎంతలా ఎదురుచూస్తున్నారో నేను కూడా అలాగే ఎదురుచూస్తున్నాను.
కళ్యాణ్ కెరీర్ గా ఏ రంగాన్ని ఎంచుకోవాలో తెల్చుకోలేని సందిగ్ద స్థితిలో ఉన్నప్పుడు సినిమా ఫీల్డ్ నీకు బాగుంటుందని నేను - సురేఖ చెప్పాం. ఆతర్వాత నటనలో తర్పీదు పొందాడు. ఈరోజు ఈ స్ధాయిలో ఉన్నడంటే అభిమానులందరి చేత ఆరాధింపబడుతున్నాడంటే గర్వపడే మొదటి వ్యక్తి నేను. మా తల్లిదండ్రలు. ఇటీవల కళ్యాణ్ గురించి ఒక వార్త విన్నాను..చదివాను..ఆతర్వాత షాక్ అయ్యాను. అదేమిటంటే..రెండు మూడు సినిమాలు తర్వాత సినిమాలు చేయను. భవిష్యత్ గురించి నిర్ణయం చెప్పలేను అని. అలాంటి నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదు.
అన్నయ్యగా సలహా ఇస్తున్నాను నువ్వు ఏరంగంలోనైనా రాణిస్తావ్. అంత మాత్రం చేత ఇంత మంది ఆరాధించే ఈ రంగాన్ని దూరం చేసుకోవద్దు.నీ శక్తి వీళ్లందరికీ బాగా తెలుసు. జోడు గుర్రాల మీద స్వారీ చేసే కెపాసిటీ నీకు ఉంది. మరో రంగంలో కూడా రాణించాలి. రాణిస్తావ్. ఇంత మంది ఆరాధిస్తున్నారంటే ఎన్నో జన్మల పుణ్యఫలం. ఇంత మంది మనసులని మాత్రం ఒప్పించవద్దు నా మాట కాదంటాడని అనుకోవడం లేదు. ఈ చిత్రం కనివినీ ఎరుగని రికార్డ్స్ బ్రేక్ చేయాలి. ఈ సినిమా రికార్డ్ ని మరో హీరో బ్రేక్ చేయాలి. ఇండస్ట్రీలో ఆరోగ్యకరమైన పోటీ ఉండాలి. బాహుబలి కి అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది. ఈ రికార్డ్ ని సర్ధార్ అధిగమించాలి. రికార్డ్స్ అనేవి ఒకరికే చెందినవి కాదు.అందరి హీరోల సినిమాలు ఆడాలి.
బాబీ తెరకెక్కించిన పవర్ సినిమాని చూసాను. టైటిల్ కి తగ్గట్టు ఇంట్రస్టింగ్ గా తీసాడు. ఈ సినిమాని కూడా బాగా తెరకెక్కించాడు. ఈ సినిమాలో కళ్యాణ్ వీణ స్టెప్ వేసాడని తెలిసింది. ఈ స్టెప్ని కళ్యాణ్ ఎలా వేసాడో చూడాలని ఉత్సాహాంగా ఉంది. సినిమా చూస్తున్నప్పుడు ఈ స్టెప్ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తాను. ఫ్యాన్స్ కి ఈ స్టెప్ ఓ గిఫ్ట్. నిర్మాత శరత్ మరార్ మా ఫ్యామిలీకి ఆప్తుడు. ఈ సినిమాతో టాప్ ప్రొడ్యూసర్ అనిపించుకుంటాడు. ఈ సినిమా 100డేస్ ఆడాలని..ఆ వేడుకకు కూడా నేను రావాలని కోరుకుంటున్నాను.
దేవిశ్రీప్రసాద్ నెం 1 మ్యూజిక్ డైరెక్టర్. దేవిశ్రీ మ్యూజిక్ డైరెక్టర్ అవ్వక ముందు నేను వాచీ గిప్ట్ గా ఇచ్చి నీ టైమ్ మారుతుంది అని చెప్పాను. నేను చెప్పినట్టుగానే దేవిశ్రీ టైమ్ మారింది ఎంతలా అంటే నిర్మాతలకు టైమ్ ఇవ్వడానికి కూడా ఖాళీ లేనంతగా. అన్నివర్గాల ప్రేక్షకులకు తనదైన సంగీతంతో దగ్గరైయ్యాడు. నా సినిమాకి కూడా దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. చందమామ లాంటి కాజల్ సర్ధార్ తోజతకట్టడంతో ఈ సినిమాకి మరింత గ్లామర్ వచ్చింది. ఈ సినిమా వంద కోట్ల బిజినెస్ చేసిందని వినగానే హ్యాఫీగా ఫీలయ్యాను. హిందీలో ఈ సినిమాని 800 థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు. నార్త్ - సౌత్ లో సర్ధార్ గబ్బర్ సింగ్ ప్రేక్షకులను అలరిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు అన్నారు.
పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ...నాకు ఏక్టింగ్ అంటే తెలియదు. హీరో అంటే అన్నయ్య. ఎవరు లేరు నాకు. అమితాబ్ అంటే ఇష్టం. నేను నటుడవ్వానికి కారణం అన్నయ్య - వదిన. ఇంట్లోకి ఇద్దరు అతిథులు వస్తేనే దాక్కొనేవాడిని. అలాంటిది నేను ఇలా... అంటే నమ్మలేకపోతున్నాను. నేను అన్నయ్య గురించి మాట్లాడడం తక్కువ. అన్నయ్య అంటే ఇష్టం. పది మందిలో చెప్పే సమయం వచ్చినప్పుడు మాట్లాడతాను. అన్నయ్య ఎంతో కష్టపడి వచ్చి షూ కూడా తీయకుండా అలా బెడ్ మీద పడుకుంటే నేను వెళ్లి అన్నయ్య షూష్ తీసేవాడ్ని. ఒక సాధారణ కానిస్టేబుల్ కొడుకుగా ఇండస్ట్రీలో ప్రవేశించి ఏక్టర్ అయి..కష్టపడి ఈ స్థాయికి వచ్చి ఎందరికో ఆదర్శంగా నిలిచారు. ఎవరైనా సరే ఒక థ్యేయం అనుకుంటే నిరూపించుకోవచ్చు అని స్పూర్తి ఇచ్చిన మహాశక్తి చిరంజీవి అన్నయ్య. నాకు నటించడం ఇష్టం లేదు. బుక్స్ చదవడం ఇష్టం. నటించాలి అన్నప్పుడు అర్హత ఉందా అనిపించింది. ఆయనకు చెడ్డపేరు తీసుకురాకూడదని కష్టపడ్డాను.
పాలిటిక్స్ విషయంలో ఆయనకు నచ్చంది చేసాను. ఆతర్వాత చెప్పాను అర్ధం చేసుకున్నారు. మా బంధం వేరు రాజకీయాలు వేరు. నేను, అన్నయ్య గుండెల్లో ఉంటాను. పదే పదే నిరూపించుకోవాల్సి అవసరం లేదు. తల్లిదండ్రలు తర్వాత నాకు అన్నయ్య - వదిన. జానీ ఫ్లాప్ తర్వాత అన్నయ్య ప్లాప్స్ కి బయపడకూడదు. సరిగ్గా ఇంకా కష్టపడి ఉంటే బాగుండేది అన్నారు. జానీ తెలియక చేసింది కాదు..అలా జరిగిపోయింది. అన్నయ్యకి కమర్షియల్ సినిమా అంటే ఇష్టం. అన్ని అంశాలు ఉన్న సర్ధార్ గబ్బర్ సింగ్ అన్నయ్యకి నచ్చుతుంది అనుకుంటున్నాను.
ఓసారి ఖమ్యం వైపు వెళ్లినప్పుడు అక్కడ ఛత్తిస్ గడ్ బోర్డర్ ఉంది. అక్కడ ఉన్న ప్రాంతాన్ని చూసి ఇక్కడ ఓ లవ్ స్టోరీ తీస్తే బాగుంటుందనే ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనతో ఈ స్ర్కిప్ట్ రాసాను. ఈ స్ర్కిప్ట్ రాయడానికి రెండున్నర సంవత్సరాలు పట్టింది.నన్ను భరించిన నా మిత్రుడు శరత్ మరార్ కి థ్యాంక్స్ తెలియచేస్తున్నాను. నా సినిమాలో ఆలీ లేకపోతే ఏదో వెలితిలా ఉంటుంది. ఈ సినిమాలో కాజల్ నటించిన విధానం బాగుంది. ఏప్రిల్ లో ఈ సినిమాని రిలీజ్ చేయాలని టీమ్ ని హింసించాను. నేను నిద్రపోలేదు. టీమ్ ని నిద్రపోనివ్వలేదు. నలభై రోజుల్లోనే డబ్బైశాతం షూటింగ్ చేసాం.ఈ సినిమా అందరికీ ఆనందం కలిగిస్తుంది. సర్ధార్ ని హిందీలో కూడా రిలీజ్ చేస్తున్నాం.ఈ సినిమా ఏ సినిమాకి పోటీ కాదు. ఏదో సాధించాలని కాదు ఛాలెంజ్ గా తీసుకోలేదు. సినిమా పరిశ్రమలో ప్రతి ఒక్కరు విజయం సాధించాలని కోరుకుంటున్నాను అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments