శరత్‌బాబుకు అస్వస్థత.. బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు తరలింపు, లేటెస్ట్ అప్‌డేట్ ఇదే

  • IndiaGlitz, [Saturday,April 22 2023]

సీనియర్ నటుడు శరత్ బాబు కొద్దిరోజుల క్రితం అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిన్న ఆయన ఆరోగ్యం కాస్త సీరియస్‌గా వుండటంతో బెంగళూరు నుంచి హైదరాబాద్‌ గచ్చిబౌలిలో వున్న ఏఐజీ ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. అక్కడ ఐసీయూలో శరత్ బాబుకు చికిత్స అందించారు వైద్యులు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా వున్నట్లుగా తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు ఏఐజీకి వెళ్లి శరత్ బాబు ఆరోగ్యంపై వాకబు చేసినట్లుగా సమాచారం.

అప్పట్లో అమ్మాయిల కలల రాకుమారుడిగా శరత్ బాబు :

కాగా.. 1970-80 దశకాలలో శరత్ బాబు స్టార్‌గా వెలుగొందారు. వైట్ స్కిన్ టోన్‌తో అమ్మాయిల కలల రాకుమారుడిగా అప్పట్లో ఆయన నిలిచారు. హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకున్నారు. మూడుముళ్ల బంధం, సీతాకోక చిలుక, సంసారం ఒక చదరంగం, అన్నయ్య, ఆపద్భాందవుడు, సాగర సంగమం, బొబ్బిలి సింహం , శివరామరాజు ఇలా ఆయన కెరీర్‌లో ఎన్నో మరుపురాని చిత్రాలు వున్నాయి. తెలుగు చిత్ర పరిశ్రమ మద్రాస్ నుంచి హైదరాబాద్ వచ్చేసినప్పటికీ ఆయన చెన్నైలోనే తన శేష జీవితాన్ని ప్రశాంతంగా గడుపుతున్నారు.

రమాప్రభతో ఎక్కువ రోజలు సాగని బంధం :

శరత్ బాబు సీనియర్ నటి రమాప్రభను పెళ్లాడిన సంగతి తెలిసిందే. అయితే కాపురంలో మనస్పర్థల కారణంగా ఈ జంట ఎక్కువ రోజులు కలిసి లేరు. ఆ తర్వాత స్నేహ నంబియార్ అనే నటిని శరత్ బాబు పెళ్లాడారు. అంతేకాకుండా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన పలు సీరియల్స్‌లోనూ ఆయన నటించారు. తన కెరీర్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి మూడు సార్లు నంది అవార్డులు అందుకున్నారు శరత్ బాబు.