కమెడియన్ నుండి హీరోలుగా మారిన వారిలో సప్తగిరి ఒకడు. ఇంతకు ముందు తమిళ సినిమాను సప్తగిరి ఎక్స్‌ప్రెస్ పేరుతో తెలుగులోకి రీమేక్ చేశాడు. సినిమా మంచి విజయాన్ని సాధించింది. అదే ఊపుతో సప్తగిరి చేసిన మరో ప్రయోగమే సప్తగిరి ఎల్.ఎల్.బి. ఈ సినిమా కూడా రీమేకే కావడం విశేషం. బాలీవుడ్‌లో విజయవంతమైన జాలీ ఎల్.ఎల్.బి సినిమాకు ఇది రీమేక్. తొలిసారి హీరోగా నటించిన సప్తగిరి ఎక్స్‌ప్రెస్ చిత్రంలో పోలీసు కానిస్టేబుల్స్ గురించి చెప్పిన సప్తగిరి..ఈ చిత్రంలో లాయర్స్ గురించి తెరపై చూపించబోతున్నాడు. మరి సప్తగిరి హీరోగా చేస్తోన్న రెండో సినిమా సప్తగిరి ఎల్.ఎల్.బి తనకు ఎలాంటి విజయాన్ని తెచ్చి పెట్టిందో చూడాలంటే కథలోకి ఓ లుక్కేద్దాం..
కథ:
సప్తగిరి ఎల్ ఎల్ బీ (సప్తగిరి) పుంగనూరులో ఉంటాడు. లోకల్‌గా లా ప్రాక్టీస్ చేస్తుంటాడు. అయితే అక్కడ తగినంత గుర్తింపు లేదని బాధపడుతుంటాడు. అతని మరదలు చిట్టి (కశిశ్ వోరా)కి, సప్తగిరికి మధ్య ప్రేమ సాగుతుంటుంది. అయితే చిట్టి తండ్రి వీరి పెళ్లకి అంగీకరించడు. సప్తగిరికి తగినంత గుర్తింపు లేదనే సాకు చూపిస్తాడు. ఇదంతా ఆలోచించిన సప్తగిరి సిటీకి వెళ్లి పరపతి సంపాదించాలనుకుంటాడు. ఆ ప్రకారం తన బావ (రవికిరణ్) దగ్గరకు వెళ్తాడు. అతని సాయంతో బార్ కౌన్సిల్‌లో చేరుతాడు. అక్కడ అతనికి రాజ్‌పాల్ (సాయికుమార్) గురించి తెలుస్తుంది. ఓ సందర్భంలో రాజ్‌పాల్ క్లోజ్ చేసిన కేసును సప్తగిరి రీ ఓపెన్ చేస్తాడు. అందుకు క్యాంటీన్ చాచా (గొల్లపూడి మారుతీరావు) సపోర్ట్ కూడా చేస్తాడు. రాజ్ పాల్ క్లైంట్ రోహిత్ చేసిన యాక్సిడెంట్ సెన్సేషనల్‌గా ఎందుకు మారుతుంది? ఇంతకీ యాక్సిడెంట్‌లో చనిపోయింది భిక్షగాళ్లా? రైతులా? మేరు పర్వతంలాంటి రాజ్‌పాల్‌ని సప్తగిరి ఎలా ఢీకొట్టాడు వంటివన్నీ ఆసక్తికరమైన అంశాలు.
ప్లస్ పాయింట్లు:
సప్తగిరి, సాయికుమార్, శివప్రసాద్, కోట శ్రీనివాసరావు, గొల్లపూడి మారుతీరావు, ఎల్బీ శ్రీరామ్, నిర్మాత రవికిరణ్, షకలక శంకర్ .. తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. సెకండాఫ్‌లో ప్రీ క్లైమాక్స్ నుంచి కథ ఊపందుకుంటుంది. ఫుట్‌పాత్ బతుకులకు, డబ్బున్నవారి అహంకారానికి, రైతులకు కథను ముడిపెట్టిన తీరు బావుంది. కెమెరాపనితనం బావుంది. రెగ్యులర్ కమర్షియల్ హీరోలాగా సప్తగిరి ఫ్లోర్ డ్యాన్స్ లు, ఫైట్లు ట్రై చేసి కొంతమేర సక్సెస్ అయినట్టే. కొన్ని చోట్ల తన యాసను వదిలి రెగ్యులర్ పద్ధతిలో డైలాగులు చెప్పడానికి ప్రయత్నం చేశారు. సీనియర్ ఆర్టిస్ట్ సాయికుమార్‌కు, సప్తగిరికి మధ్య క్లైమాక్స్ లో వచ్చే పేజీల డైలాగులు వినడానికి బావున్నాయి. ఇద్దరూ ఆ సన్నివేశాల్లో పోటాపోటీగా నటించారు. అలాగే శివప్రసాద్, సాయికుమార్ మధ్య కోర్టులో జరిగే సంభాషణ కూడా ఆసక్తికరంగా ఉంటుంది. కోర్టంటే బిగుసుకునిపోయి ఉండనవసరం లేదని, అక్కడ జడ్జిలు కూడా సరదాగానే ఉంటారని చెప్పే సన్నివేశాలు లైవ్లీగా ఉన్నాయి.
మైనస్ పాయింట్లు:
సినిమాలో ప్రథమార్థం ఇంటర్వెల్ బ్యాంగ్ వరకు సాదా సీదీగా ఉంది. ఇక హీరోయిన్ పాత్రను పాటలకే పరిమితం చేసేశారు. పాటలు కూడా సందర్భానుసారం లేవు. సప్తగిరి సినిమాల్లో కామెడీ ఎక్కువగా ఉంటుందనుకుని థియేటర్‌కు వెళ్లే ప్రేక్షకుడికి నిరాశ తప్పదు. సినిమా ప్రధానమైన కథాంశం సెకండాఫ్‌లోనే ప్రారంభం కావడం. అప్పటి వరకు సినిమా హీరో బిల్డప్‌లు, ఏదో కామెడీతో లాగించాలనుకోవడం సినిమాను వీక్ చేశాయి.
విశ్లేషణ:
జాలీ ఎల్ ఎల్ బీ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కిన చిత్రం `సప్తగిరి ఎల్ ఎల్ బీ`. `సప్తగిరి ఎక్స్ ప్రెస్` తర్వాత సప్తగిరి మెయిన్ లీడ్ చేసిన సినిమా ఇది. ఆ చిత్రాన్ని నిర్మించిన రవికిరణ్ ఈ సినిమాను కూడా తెరకెక్కించారు. ఫస్టాఫ్ చాలా స్లోగా సాగే సినిమా ఇది. సప్తగిరి విలేజ్ ఎపిసోడ్ జనాలకు పెద్దగా ఎక్కదు. ఇంటర్వెల్ బ్యాంగ్ వరకు సోసోగా సాగుతుంది. ఇంటర్వెల్ ఎపిసోడ్ కూడా పెద్దగా మెప్పించదు. సెకండాఫ్ మొదలైన కొంత సేపటికి కథ రసకందాయంలో పడుతుంది. సప్తగిరి కేసును డీప్‌గా స్టడీ చేసేకొద్దీ ప్రేక్షకుడు సినిమాలో ఇన్వాల్వ్ కావడం మొదలుపెడతాడు. అక్కడక్కడా పంటికింద రాయిలా తగిలే పాటలు, అక్కర్లేని సన్నివేశాలను కట్ చేసి క్రిస్ప్ చేస్తే సినిమా జనాల్లోకి బాగా చేరుతుంది. మన దేశంలో ఫుట్‌పాత్‌ల మీద పడుకునే వారు ఎవరు? ఎందుకు పడుకోవాల్సి వస్తుంది? ఫుట్‌పాత్‌ల మీద మనుషులు పడుకుంటే తప్పు.. డ్రైవింగ్ చేస్తే తప్పు కాదా? వంటి కొన్ని సెన్సిటివ్ అంశాలను తెరపై చక్కగా చూపించారు. కోర్టు సన్నివేశం అనగానే గంభీరంగా సాగుతుందేమో అని అనుకుంటారు... కానీ జడ్జి పాత్రలో శివప్రసాద్ చాలా హాయిగా నవ్వించారు. అదే సమయంలో సరైన ఎమోషన్స్ ని పండించారు. శివప్రసాద్, సాయికుమార్ మధ్య సాగే సన్నివేశాలు కూడా ప్రేక్షకుడికి నచ్చుతాయి. ఇగో అనేది మనిషిని ఎలాంటి మార్గంలో నడిపిస్తుందో ఇందులో సాయికుమార్ పాత్ర ద్వారా చక్కగా చెప్పారు. ఎడిటింగ్ ఇంకాస్త బాగా చేసుకుని ఉండాల్సింది. అక్కడక్కడా వెకిలిగా సాగే సన్నివేశాలను కట్ చేయాల్సింది. షకలక శంకర్‌ని చక్కగా వాడుకోలేదేమోనని అనిపిస్తుంది. సప్తగిరి తన యాసను వదిలి అక్కడక్కడా మామూలుగా మాట్లాడటం అంత తేలిగ్గా మింగుడుపడదు.
బాటమ్ లైన్: సప్తగిరి ఎల్.ఎల్.బి... ఎమోషనల్‌గా ఓకే. .ఎంటర్‌టైన్‌మెంట్ పరంగానే వీక్
Saptagiri LLB Movie Review in English
Comments