అందుకే...ఆత్మవిశ్వాసంతో వేస్తున్న అడుగు సప్తగిరి ఎక్స్ ప్రెస్ - సప్తగిరి
- IndiaGlitz, [Thursday,December 22 2016]
బొమ్మరిల్లు, పరుగు చిత్రాల ద్వారా కమెడియన్ గా పరిచయమై...ప్రేమకథా చిత్రమ్ తో బాగా పాపులర్ అయిన యువ హాస్యనటుడు సప్తగిరి. అనతికాలంలోనే అటు ఆడియోన్స్ లోను, ఇటు ఇండస్ట్రీలోను మంచి క్రేజ్ ఏర్పరుచుకున్న సప్తగిరి తొలిసారి హీరోగా నటించిన చిత్రం సప్తగిరి ఎక్స్ ప్రెస్. ఈ చిత్రం ద్వారా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ శిష్యుడు అరుణ్ పవర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. డా.రవికిరణ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా రూపొందిన సప్తగిరి ఎక్స్ ప్రెస్ చిత్రం ఈనెల 23న రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా సప్తగిరి తో ఇంటర్ వ్యూ మీకోసం...!
కమెడియన్ అయిన మీరు సప్తగిరి ఎక్స్ ప్రెస్ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నారు కదా..! హీరో అవ్వాలనే ఇండస్ట్రీకి వచ్చారా..?
నేను హీరో అవ్వాలని ఇండస్ట్రీకి రాలేదు. డైరెక్టర్ అవ్వాలని ఇండస్ట్రీకి వచ్చాను. ఏడు సంవత్సరాలు డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో వర్క్ చేసాను. ఓసారి అనుకోకుండా బొమ్మరిల్లు సినిమాలో చిన్న రోల్ చేసారు. ఆ సినిమా సక్సెస్ అవ్వడంతో డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ పరుగు సినిమాలో ఫుల్ క్యారెక్టర్ ఇచ్చారు. ఆతర్వాత ప్రేమకథా చిత్రమ్ నాకు మంచి పేరు తీసుకువచ్చింది. అయితే... ప్రేమకథా చిత్రమ్ తర్వాత కమెడియన్ గా అవే క్యారెక్టర్ చేస్తుండడం వలన నాకే తెలియని మోనాటినీ వచ్చింది. అందుకనే కమెడియన్ గానే కాకుండా మిగిలినవి కూడా చేయగలను అనే నమ్మకంతో హీరో అవుతున్నాను. ఆత్మవిశ్వాసంతో వేస్తున్న ఈ అడుగును అందరూ ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను.
కమెడియన్ గా బాగానే ఉంది కదా..? ఈ టైమ్ లో హీరోగా చేయడం ఎందుకు అని ఎవరన్నా చెప్పారా..?
చాలా మంది చెప్పారు. అయితే...నేను ఏ క్యారెక్టర్ చేసినా చేసిందే మళ్లీ చేస్తున్నాను అనే ఫీలింగ్ తో లైఫ్ మెకానికల్ అయిపోయింది. ఇంతకు ముందు చెప్పినట్టుగా డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో ఏడు సంవత్సరాలు వర్క్ చేసాను. ఆ అనుభవంతో కథ విషయంలో జాగ్రత్తలు తీసుకుని అందరికీ నచ్చే కథతో హీరో అవుతున్నాను.
సప్తగిరి ఎక్స్ ప్రెస్ మూవీతో సప్తగిరి జర్నీ ఎలా జరిగింది..?
ఎనిమిది నెలలుగా ఈ సినిమా కోసం వర్క్ చేస్తున్నాను. ఈ చిత్రంలో 100% కొత్త సప్తగిరిని చూస్తారు. స్టోరీ చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఈ జర్నీ మరచిపోలేని అనుభూతి.
23న సప్తగిరి ఎక్స్ ప్రెస్ రిలీజ్ కదా...! ఎలా ఫీలవుతున్నారు..?
నేను నిద్రపోయి 15 రోజులు అయ్యింది. ఈ మూవీ కోసం చాలా హార్డ్ వర్క్ చేసాను. కంటెంట్ స్ట్రాంగ్ గా ఉంది. దీంతో సినిమా సక్సెస్ పై నమ్మకం ఉన్నా రిజల్ట్ ఎలా ఉంటుందో అనే టెన్షన్ ఉంది.
పవన్ కళ్యాణ్ సప్తగిరి సినిమా చూస్తాను అన్నారు కదా..చూసారా..?
పవన్ కళ్యాణ్ గారు పొల్లాచ్చిలో జరుగుతున్న కాటమరాయుడు షూటింగ్ లో ఉన్నారు. ఈనెల 23న పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ వస్తున్నారు. సినిమా రిలీజ్ తర్వాత ఈ సినిమాని చూపించాలి అనుకుంటున్నాం.
సప్తగిరి ఎక్స్ ప్రెస్ ట్రైలర్ & పోస్టర్స్ లో మీరు చాలా గెటప్స్ లో కనిపిస్తున్నారు. ఈ గెటప్స్ కథలో భాగంగానే ఉంటాయా..?
కథ గురించి కొంచెం చెప్పాలంటే...ఇందులో సినిమాల్లోకి రావాలనే తపన ఉన్న యువకుడుగా నటిస్తున్నాను. అందుచేత కథలో భాగంగానే ఈ గెటప్స్ వస్తాయి తప్పా...ఏదో కావాలని ఇన్ని గెటప్స్ లో కనిపించాలి అని చేసింది కాదు..!
ఈ మూవీ తమిళ మూవీకి రీమేక్ కదా..! కథలో మార్పులు ఏమైనా చేసారా..?
రెండున్నర గంటల తమిళ మూవీలోని 10 నిమిషాల కంటెంట్ తీసుకుని ఈ సినిమా చేసాం. అది సీరియస్ మూవీగా. ఇది ఎంటర్ టైన్మెంట్ మూవీ. 90% మన నేటివిటీకి తగ్గట్టు మార్పులు చేసాం.
ఇక నుంచి హీరోగానే చేస్తారా..?
హీరోగానే చేయాలి అనుకోవడం లేదు. కమెడియన్ గా కూడా చేస్తున్నాను. చైతన్య హీరోగా సొగ్గాడే చిన్ని నాయనా డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో ఫుల్ క్యారెక్టర్ చేస్తున్నాను. అలాగే శర్వానంద్ సినిమాలో కూడా నటిస్తున్నాను.