నాగార్జున 'సంతోషం'కి 14 ఏళ్లు

  • IndiaGlitz, [Monday,May 09 2016]

'ప్రేమించ‌డానికి రెండు మ‌నసులు చాలు.. కానీ పెళ్లి చేసుకోవ‌డానికి రెండు కుటుంబాలు కావాలి' అనే పాయింట్‌తో తెర‌కెక్కి కుటుంబ ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ పొందిన చిత్రం 'సంతోషం'. క‌థాబ‌లం ఉన్న ఈ చిత్రంతో కింగ్ నాగార్జున కెరీర్‌లో మ‌రో మంచి విజ‌యం న‌మోదైంది. కొత్త ద‌ర్శ‌కుల‌కు అవ‌కాశాలిచ్చి ప్రోత్స‌హించ‌డంలో ముందుండే నాగ్‌.. ఈ చిత్రంతో ద‌శ‌ర‌థ్‌ని ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేశారు.

క‌థానాయిక శ్రియ కెరీర్‌లో ట‌ర్నింగ్ పాయింట్‌గా నిలిచిన ఈ చిత్రంలో గ్రేసీ సింగ్ మ‌రో హీరోయిన్ గా న‌టించింది. గ్రేసీ సింగ్‌తోనూ, శ్రియ‌తోనూ నాగార్జున పండించిన కెమిస్ట్రీ సినిమా విజ‌యంలో ఓ కీల‌క పాత్ర‌గా నిలిచింద‌న‌డంలో అతిశ‌యోక్తి లేదు. ప్ర‌భుదేవా, కె.విశ్వ‌నాథ్‌, పృథ్వీ త‌దిత‌రులు ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో న‌టించిన ఈ చిత్రాన్ని దుర్గా ఆర్ట్స్ ప‌తాకంపై కె.ఎల్‌.నారాయ‌ణ నిర్మించారు.

ఆర్‌.పి.ప‌ట్నాయ‌క్ సంగీతంలోని పాట‌లన్నీ ఆద‌ర‌ణ పొందాయి. ముఖ్యంగా 'నే తొలిసారిగా క‌ల‌గ‌న్న‌ది' ఇప్ప‌టికీ ఎక్క‌డో చోట వినిపిస్తూనే ఉంటుంది. 2002కిగానూ ' తృతీయ‌ ఉత్త‌మ చిత్రం'గా నంది పుర‌స్కారాన్ని పొందిందీ చిత్రం. అలాగే ఉత్త‌మ‌న‌టుడుగా నాగార్జున‌కి 'నంది', ఉత్త‌మ సంగీత ద‌ర్శ‌కుడుగా ఆర్‌.పికి 'ఫిల్మ్‌ఫేర్' పుర‌స్కారం ద‌క్కాయి. మే 9, 2002న విడుద‌లైన 'సంతోషం' నేటితో 14 వ‌సంతాల‌ను పూర్తిచేసుకుంటోంది.