'రెడ్ అలర్ట్'లో విఘ్నేశ్వరుడిపై సంస్కృత గీతం
- IndiaGlitz, [Tuesday,September 15 2015]
ఏకకాలంలో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ... ఇలా నాలుగు భాషల్లో రూపొందిన ఘనతను దక్కించుకున్న చిత్రం 'రెడ్ అలర్ట్'. ఇప్పటికే కన్నడం, మలయాళ భాషల్లో విడుదలై, ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది. ఈ నెల 24న తెలుగు చిత్రాన్ని విడుదల చేయనున్నామని చిత్రదర్శకుడు చంద్రమహేశ్ తెలిపారు. సినీ నిలయ క్రియేషన్స్ పతాకంపై పి.యస్. త్రిలోక్ రెడ్డి సమర్పణలో హెచ్.హెచ్.మహాదేవ్, అంజనా మీనన్ హీరో, హీరోయిన్ గా పీవీ శ్రీరామ్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో చాలా హైలైట్స్ ఉన్నాయని, ముఖ్యంగా క్లయిమ్యాక్స్ లో భాగంగా వచ్చే సాంగ్ చాలా హైలైట్ గా నిలుస్తుందని చంద్రమహేశ్ అన్నారు. ఈ పాటను సంస్కృతంలో రాయించడం విశేషం.
క్లయిమ్యాక్స్ కోసం రాయించిన ఈ పాట గురించి, ఇతర చిత్రవిశేషాల గురించి చంద్రమహేశ్ చెబుతూ - " 'జై జై గణేశా...' అనే పల్లవితో ఈ పాట సాగుతుంది. సందర్భోచితంగా క్లయిమ్యాక్స్ లో వచ్చే పాట ఇది. ముందు తెలుగులో రాయించాం. కానీ, సందర్భం బలమైనది కావడంతో ఆ పాట పేలవంగా అనిపించింది. ఆ తర్వాత కొంతమంది రచయిలతో తెలుగులో రాయించినా, సంతృప్తిగా అనిపించలేదు. చివరికి రచయిత వెనిగళ్ల రాంబాబుతో ఈ పాటను సంస్కృతంలో రాయమంటే, రాశారు. చాలా బాగా వచ్చింది. ఈ పాటను శంకర్ మహదేవన్ గారితో పాడించాం. 'జై జై గణేశా..' అనే ఈ పాటను తెరపై చూస్తున్నప్పుడు రోమాలు నిక్కబొడుచుకుంటాయి. సంస్కృతం అనేది యూనివర్శల్ లాంగ్వేజ్ కాబట్టి, తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ పాటనే ఉంచేశాం. ఇప్పటికే కన్నడ, మలయాళ చిత్రాన్ని చూసినవాళ్లు పాట గురించి కూడా ప్రత్యేకంగా ప్రసంశించారు.
ఈ చిత్రకథ విషయానికొస్తే.. హైదరాబాద్ లో భారీగా జరిగే వినాయకుడి నిమజ్జనాన్ని చూడటానికి ఓ పల్లెటూరికి చెందిన నలుగురు కుర్రాళ్లు నగరానికి వస్తారు. ఆ నలుగురి జీవితం ఎలాంటి మలుపు తీసుకుంది? అనే కథాంశంతో చిత్రం సాగుతుంది'' అని చెప్పారు.
సుమన్, కె.భాగ్యరాజా, అలీ, పోసాని కృష్ణమురళీ, వినోద్ కుమార్, అనితా చౌదరి, మధుమిత తదితరులు నటించిన ఈ చిత్రానికి కథ, మాటలు - శ్రీరామ్ చౌదరి, సంగీతం - రవివర్మ, కెమెరా - కళ్యాణ్ సమి, ఎడిటింగ్ - గౌతంరాజు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత - జైపాల్ రెడ్డి, కో-ప్రొడ్యూసర్ - శ్రీమతి పిన్నింటి శ్రీరాంసత్యరెడ్డి, నిర్మాత - పి.వి.శ్రీరాంరెడ్డి, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం - చంద్రమహేశ్.