చిత్ర సీమలో విషాదం.. అనారోగ్యంతో కేజీఎఫ్ 2 స్టార్ మోహన్ జునేజా కన్నుమూత
Send us your feedback to audioarticles@vaarta.com
కన్నడ చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు మోహన్ జునేజా మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. కర్ణాటక రాష్ట్రం తుమకూరు జిల్లాలో జన్మించిన మోహన్.. తొలుత సీరియల్స్ ద్వారా తన ప్రతిభను చాటుకున్నారు. అనంతరం సిల్వర్ స్క్రీన్‌పై ఎంట్రీ ఇచ్చి.. అతి తక్కువ సమయంలోనే మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. చెల్లాట సినిమా ఈయనకు బ్రేక్ ఇచ్చింది. అంతేకాదు ఆ తర్వాత మళ్లీ వెనుదిరిగి చూసుకుని అవకాశం రాలేదు.
ఆపై వరుసగా మస్తీ, రామ్‌లీలా, బచ్చన్, కేజీఎఫ్ లాంటి సినిమాలలో నటించారు మోహన్. కేజీఎఫ్ చిత్రంతో ఈయనకు కర్ణాటకతో పాటు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. గ్యాంగ్‌తో వచ్చే వాడు గ్యాంగ్‌స్టర్.. కానీ అతనొక్కడే వస్తాడు మాన్‌స్టర్... అంటూ మోహన్ జునేజా చెప్పిన డైలాగ్ బాగా పాపులర్ అయ్యింది. ఆయన మరణం పట్ల కన్నడతో పాటు ఇతర సినీ పరిశ్రమలకు చెందిన ప్రముఖులు సంతాపం తెలియజేశారు. కేజీఎఫ్ తెచ్చిన గుర్తింపుతో మోహన్ మరింత బిజీ అవుతారని భావిస్తున్న తరుణంలో ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
ఇకపోతే కేజీఎఫ్‌కు సీక్వెల్‌గా తెరకెక్కిన కేజీఎఫ్ 2 వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తోంది. విడుదలై దాదాపు నెల రోజులు కావొస్తున్నా ఈ సినిమా హవా తగ్గడం లేదు. ఇప్పటికే 1000 కోట్ల మార్క్‌ను దాటేసింది. తాజాగా బాలీవుడ్ సూపర్‌స్టార్ అమీర్‌ఖాన్ నటించిన దంగల్ రికార్డులను కేజీఎఫ్ 2 బ్రేక్ చేసింది. ఇప్పటి వరకు హిందీలో 511.3 కోట్లను సాధించి 'బాహుబలి 2' మొదటి స్థానంలో ఉంటే, 387.4 కోట్ల వసూళ్లతో 'దంగల్' రెండో స్థానంలో నిలిచింది. ఇప్పుడు ఈ రికార్డును 'కేజీఎఫ్ 2' బద్ధలు కొట్టింది. రెండు రోజుల క్రితం 391.65 కోట్లను రాబట్టిన 'కేజీఎఫ్ 2' .. 'దంగల్' స్థానాన్ని ఆక్రమించింది. ఇప్పుడు దాని చూపు బాహుబలి 2పై పడింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments