దుబ్బాకలో హృదయ విదారక ఘటన.. ఆపద్భాంధవుడైన సంపూర్ణేష్ బాబు
- IndiaGlitz, [Thursday,July 01 2021]
నటుడిగా ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న సంపూర్ణేష్ బాబు.. తన సేవ కార్యక్రమాలు, పెద్ద మనసుతో అభిమానుల హృదయాల్లో స్థానం దక్కించుకుంటున్నాడు. ఎలాంటి సంఘటన ఎదురైనా ఆదుకునేందుకు నేనున్నాను అంటూ ముందుకు వస్తుంటారు బర్నింగ్ స్టార్ సంపూ.
పేదవారిని ఆదుకోవడంలో, సేవా కారక్రమాలు నిర్వహించడంలో సంపూ ఖర్చుకు వెనకాడరు. గతంలో ఎన్నో సందర్భాల్లో ఈ విషయం గమనించాం. తాజాగా సంపూ మరోసారి అందరి హృదయాలు గెలుచుకున్నాడు. దుబ్బాకలో ఇటీవల జరిగిన ఓ హృదయ విదారక ఘటన సంపూ కంట పడింది.
ఇదీ చదవండి: అభిమానుల్లో మొదలైన అసహనం.. ఇప్పుడు వెంకటేష్, తర్వాత ఎవరో!
దుబ్బాక పరిధిలో చెల్లాపూర్ మూడవ వార్డులో నరసింహాచారి, అతడి భార్య ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఇటీవల జరిగిన ఈ సంఘటన స్థానికంగా అందరిలో విషాదం నింపింది. వారి కుమార్తెలు లక్ష్మి, గాయత్రీ అనాథలయ్యారు. కరోనా కారణంగా నరసింహాచారి కుటుంబం పని లేక ఉపాధి కోల్పోయింది. నరసింహాచారి వడ్రంగి పని చేస్తారు.
చాలా రోజులుగా పని లేకపోవడంతో ఇల్లుగడవడమే కష్టంగా మారింది. పిల్లలకు తిండి కూడా పెట్టలేని పరిస్థితి. దీనికోసం నరసింహాచారి అప్పులు చేశాడు. అప్పు ఇచ్చిన వారినుంచి ఒత్తిడి మొదలైంది. తమ పరిస్థితికి కుమిలిపోయిన నరసింహాచారి భార్య కొన్ని రోజుల క్రితం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
భార్య మరణం తర్వాత నరసింహాచారి పిల్లలతో కలసి సిద్దిపేటకు వెళ్లారు. అక్కడ కూడా ఆయనకు పని దొరకలేదు. దీనితో చెల్లాపూర్ లో భార్య ఉరివేసుకున్న దూలానికే నరసింహాచారి కూడా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీనితో అతడి పిల్లలు అనాథలుగా మారారు.
ఈ సంఘటన గురించి తెలుసుకున్న సంపూర్ణేష్ బాబు హృదయం చలించింది. ఆ పిల్లలని ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. తక్షణ సాయంగా పిల్లలు గాయత్రీ, లక్ష్మి లకు రూ 25వేలు చెక్కు అందించాడు. వారి చదువుకు సహకరిస్తానని మాట ఇచ్చాడు.
ప్రతి మనిషి జీవితంలో ఆర్థిక ఇబ్బందులు, కష్టాలు ఉంటాయి. అలాగని ఆత్మహత్య చేసుకుంటే పిల్లల జీవితం నాశనం అవుతుంది. ధైర్యంగా ఎదుర్కొనాలి అని సంపూర్ణేష్ బాబు తెలిపారు.