హీరో హీరోయిన్ కలుసుకోవడం, విడిపోవడం.. మళ్లీ కలుసుకోవడం అనే అంశాలు ప్రేమ కథల్లో కామన్‌గా ఉంటాయి. అయితే దర్శకుడు తన ప్రతిభతో సినిమాను ఎలా ప్రెజెంట్ చేశాడనే కాన్సెప్ట్‌తోనే ఆ ప్రేమకథ ప్రేక్షకులకు రీచ్ అయ్యిందా ? లేదా? అనే అంశం ఆధారపడి ఉంటుంది. దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి ఓ అందమైన ప్రేమకథను తెరకెక్కించడమే కాకుండా.. దానికి నేటి సినిమా భావ పరిస్థితులను మిక్స్ చేస్తూ అందంగా సన్నివేశాలు అల్లుకుంటూ చేసిన ప్రేమ కథ సమ్మోహనం.. మరి ఈ సమ్మోహనం ప్రేక్షకులను ఏ మేర సమ్మోహనపరిచిందో తెలుసుకోవాలంటే ముందు కథలోకి వెళదాం...
విజయ్ అలియాస్ విజయ్ కుమార్ (సుధీర్ బాబు) చిల్డ్రన్స్ బుక్ ఇల్లస్ట్రేటర్. అతనికి సినిమా ప్రపంచం మీద పెద్దగా మంచి ఒపీనియన్ ఉండదు. కానీ విజయ్ తండ్రి (సీనియర్ నరేశ్)కి సినిమాల్లో వేషాలేయాలనే పిచ్చి ఉంటుంది. ఆ పిచ్చితోనే ప్రభుత్వ ఉద్యోగానికి కూడా వాలంటీర్ రిటైర్‌మెంట్ తీసుకుంటాడు. ఇంటిని షూటింగ్‌కు ఇచ్చేస్తాడు. అక్కడికి షూటింగ్ చేయడానికి వస్తుంది హీరోయిన్ సమీర రాథోడ్ (అదితీరావు హైదరీ). ఆమెకు తెలుగు నేర్పుతూ దగ్గరవుతాడు హీరో. ఒకరికొకరు తమ ప్రేమను చెప్పుకోరు. కానీ ఆమె షూటింగ్ పూర్తి చేసుకుని వెళ్లిపోవడంతో వెలితిగా భావిస్తాడు విజయ్. ఆమెను వెతుక్కుంటూ ఆమె షూటింగ్ స్పాట్ మనాలికి చేరుకుంటాడు. అక్కడ ఆమెకు ప్రేమను వ్యక్తం చేస్తాడు. ఆ ప్రేమను సమీరా అంగీకరించదు. అందుకు కారణం అమిత్. విజయ్‌ని అమిత్ ఏమైనా చేస్తాడేమోనని సమీర భయం. ఇంతకీ అమిత్ ఎవరు? అమిత్‌ని చూసి సమీర ఎందుకు భయపడాలి? విజయ్ ప్రేమను అంగీకరించకపోవడానికి కారణం ఏంటి? అనుకోకుండా ప్రమాదంలో చిక్కుకున్న సమీర అందులోనుంచి బయటపడిందా? లేదా? వంటివన్నీ ఆసక్తికరం.
ప్లస్ పాయింట్లు:
ఈ సినిమాకు ప్రధాన బలం నటీనటులు, సాంకేతిక నిపుణులు. ఎవరికి కేటాయించిన పాత్రను వాళ్లు అవలీలగా చేసుకుంటూ పోయారు. సాంకేతిక నిపుణులు కూడా తమ తమ పనిని చక్కగా చేశారనిపిస్తుంది. ఇంద్రగంటి మోహనకృష్ణ రాసుకున్న కథ కూడా చాలా బావుంది. సన్నటి దారంలాంటి కథను ఆయన మలచిన తీరు బావుంది. దాన్ని స్క్రీన్ మీద ప్రెజెంట్ చేసిన సినిమాటోగ్రఫర్ పనితనం, లొకేషన్లు, కాస్ట్యూమ్స్, డైలాగులు, పాటలు, నేపథ్య సంగీతం అన్నీ సమపాళ్లల్లో కుదిరాయి.
మైనస్ పాయింట్లు:
సీనియర్ నరేశ్ పాత్రను పరిచయం చేసినప్పుడున్న కిక్కు, క్లైమాక్స్ లో పెద్దగా అనిపించదు. కథాపరంగా గొప్పగా చెప్పుకోవడానికి ఇందులో ఏమీ లేదు. ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ మెప్పించదు. ఫొటోలు చూపించి బెదిరిస్తున్నాడనే కారణంగా స్టార్‌డమ్ ఉన్న ఓ హీరోయిన్ అతను పెట్టే టార్చర్‌ను మౌనంగా అంగీకరించాల్సిన అవసరం ఈ కాలంలో ఎవరికీ లేదు. ఇంత పోలీస్ వ్యవస్థ, ఇంత బలగం ఉన్నప్పుడు ఆమె భయపడటం అనేది సిల్లీగా అనిపిస్తుంది. సెకండాఫ్‌లో ఆ చిన్న విషయంలో జాగ్రత్త తీసుకోవాల్సింది.
విశ్లేషణ:
చిల్డ్రన్ బుక్స్ ఇల్లస్ట్రేటర్ గా పనిచేసే హీరోని ఇప్పటిదాకా మనం తెలుగు తెరమీద చూడలేదు. ఆ రకంగా ఇది కొత్త పాయింటే. ఆర్టిస్టిక్ మనసున్న హీరోకి, సినిమా ఆర్టిస్ట్ కీ మధ్య ప్రేమ అనేది మామూలుగా ఊహకు అందదు. కానీ ప్రేమను ఏ రెండు మనసులను కలుపుతుందో తెలియదనే భావంతో ఈ కథను అంగీకరించాల్సిందే. అష్టాచమ్మా, గోల్కొండ హైస్కూల్, జెంటిల్‌మన్ వంటి సినిమాలతో ఇంద్రగంటి మోహనకృష్ణ తనదైన శైలిని, తనదైన ప్రేక్షకులను క్రియేట్ చేసుకున్నారు. వారితో పాటు ప్రేమ గురించి తెలిసిన ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యే కథ ఇది. పాటలు బావున్నాయి. వాటిని తీసిన విధానం కూడా బావుంది. అనుకున్న కథను అంతే అందంగా, పొందిగ్గా సినిమాలో చొప్పించారు. విజయ్‌కుమార్ పాత్రలో సుధీర్‌బాబు నటన మెప్పిస్తుంది. ఇప్పటి వరకు సుధీర్ చిత్రాల్లో ఇది భిన్నమైంది. నటన పరంగా కూడా సుధీర్ పరిణితిని కనపరిచాడు. అదితిరావు హైదరి పాత్ర చాలా అందంగా, హుందాగా ఉంది. ఇక సీనియర్ నరేశ్ పాత్రలో కామెడీ మనకు కనపడినా.. అంతర్లీనంగా మనుషులు వారి మనసు ఏం చెబుతుందో అది చేయాలని, ఇతరుల అభిప్రాయాలకు కూడా గౌరవం ఇవ్వాలనే అంశాలను దర్శకుడు అందంగా చూపించాడు. రాహుల్ రామకృష్ణ, శిశిర్ శర్మ నేటి యూట్యూబ్, వెబ్‌సైట్స్ పనితీరు ఎలా ఉందో వివరించే సీన్ కూడా ప్రేక్షకులను నవ్విస్తుంది. అలాగే క్లైమాక్స్‌లో విలన్‌ను నరేశ్, హీరో గ్యాంగ్ బెదిరించే సీన్‌లో సుధీర్, రాహుల్ నటన ప్రేక్షకులను అలరిస్తుంది. అలాగే ఇండస్ట్రీ అంటే చులకన భావం వద్దు. మంచి చెడులు అన్నిచోట్ల ఉంటాయి. మరి సినిమావాళ్లనే ఎందుకు చిన్నచూపు చూస్తారనే కాన్సెప్ట్‌ను కూడా దర్శకుడు చక్కగా ప్రెజెంట్ చేశాడు. హీరోయిన్స్ గురించి చాలా మందికి ఉన్న అభిప్రాయం తప్పు అని మరో సన్నివేశంలో చూపించాడు దర్శకుడు. ఇలా మంచి ప్రేమకథకు, సినిమా ఇండస్ట్రీలోని నేటి పరిస్థితులను లింక్ చేస్తూ ఇంద్రగంటి అందంగా తెరకెక్కించారు.
బోటమ్ లైన్: 'సమ్మోహనం'..అందమైన ప్రేమకథ
Comments