మహేష్ సినిమాలాగే బన్నీ సినిమాలో కూడా..
- IndiaGlitz, [Thursday,May 03 2018]
ఈ వేసవి టాలీవుడ్‌కు బాగానే కలిసొచ్చిందనే చెప్పాలి. ‘రంగస్థలం’, ‘భరత్ అనే నేను’.. ఇలా నెల రోజుల గ్యాప్‌లో వచ్చిన రెండు పెద్ద సినిమాలు ఇప్పటికే ఘన విజయాలు సాధించాయి. ఇక మూడో సినిమాగా అల్లు అర్జున్ నటించిన ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమా ఈ నెల 4న విడుదల కానుంది. అయితే.. ఈ సినిమాకి, మహేష్ బాబు నటించిన ‘భరత్ అనే నేను’ మూవీకి ఓ సారూప్యత ఉంది. అదేంటో ఒక్కసారి లుక్కేస్తే.. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ‘భరత్ అనే నేను’ మొత్తం “ప్రామిస్” అనే మాట చుట్టూ తిరుగుతూనే ఉంటుంది.
“ప్రామిస్ అంటే నమ్మకం, దాన్ని బ్రేక్ చేయకూడదు” అంటూ మాటకి ఉండే ప్రాముఖ్యతను చెప్పారీ చిత్రంలో. ఇక వక్కంతం వంశీ రూపొందించిన ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమా విషయానికి వస్తే.. “క్యారెక్టర్” చుట్టూ తిరుగుతూ ఉంటుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. “క్యారెక్టర్ వదిలేయడమంటే ప్రాణాలు వదిలేయడమే.. చావు రాకముందు చచ్చి పోవడమే” అంటూ మనిషికి క్యారెక్టర్ ఎంత ఇంపార్టెంట్ అన్నది చెబుతున్నారు ఈ సినిమాలో. మరి “ప్రామిస్” లాగే “క్యారెక్టర్”కి కూడా ప్రేక్షకులు ఫిదా అయి.. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తారేమో చూడాలి.