అక్కినేని ఫ్యామిలీకి కలిసొచ్చిన స్క్రీన్ నేమ్‌తో చైతు?

  • IndiaGlitz, [Friday,July 06 2018]

‘ప్రేమ్‌నగర్’, ‘అల్లరి అల్లుడు’.. అక్కినేని ఫ్యామిలీకి ఘన విజయాన్ని అందించిన ఈ రెండు సినిమాల్లో ఒక కామన్ ఫ్యాక్టర్ ఉంది. అదేమిటంటే.. ఈ రెండు సినిమాల్లో కథానాయకుల స్క్రీన్ నేమ్స్ “కళ్యాణ్” కావ‌డం విశేషం. క‌ట్ చేస్తే.. ఇప్పుడు ఇదే స్క్రీన్ నేమ్‌తో మరో అక్కినేని హీరో కూడా రాబోతున్నారు. ఆ వివరాల్లోకి వెళితే.. యువ కథానాయకుడు నాగ చైతన్య, కేరళ కుట్టి అను ఇమ్మాన్యుయేల్ జంటగా నటించిన చిత్రం ‘శైలజా రెడ్డి అల్లుడు’. యూత్‌ఫుల్ చిత్రాల‌ స్పెషలిస్ట్ మారుతి దర్శకత్వం వహించ‌గా.. సీనియర్ కథానాయిక రమ్యకృష్ణ టైటిల్ రోల్ పోషించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగ వంశీ నిర్మించిన ఈ చిత్రం ఆగ‌ష్టు 31న విడుద‌ల కానుంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో చైతు స్క్రీన్ నేమ్ “కళ్యాణ్” అని సమాచారం. మరి తాత (ఏఎన్నార్‌), తండ్రి (నాగార్జున)కి కలిసొచ్చిన ఈ స్క్రీన్ నేమ్ చైతుకి కూడా క‌లిసొస్తుందేమో చూడాలి.