పుకార్లు నమ్మొద్దు.. ఆమె బాగానే వున్నారు, సమంత ఆరోగ్యంపై సిబ్బంది క్లారిటీ
- IndiaGlitz, [Monday,December 13 2021]
టాలీవుడ్ అగ్ర కథానాయిక సమంత ఆరోగ్యంపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ఆమె వ్యక్తిగత సిబ్బంది క్లారిటీ ఇచ్చారు. సమంత పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని కొంచెం దగ్గు ఉండటంతో ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స తీసుకుని ఇంటికి వచ్చేశారని వెల్లడించారు. ప్రస్తుతం సమంత విశ్రాంతి తీసుకుంటున్నారని పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల్లో సామ్ ఆరోగ్యంపై వస్తున్న అసత్య వార్తలను నమ్మొద్దని, అలాగే ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమె వ్యక్తిగత సిబ్బంది విజ్ఞప్తి చేశారు.
కాగా.. ఓ షాపింగ్ మాల్ ప్రారంభించేందుకు ఆదివారం సమంత కడప వచ్చారు. దీంతో ఆమెను చూసేందుకు అభిమానులు, నగర ప్రజలు ఎగబడ్డారు. ఒకానొక దశలో జనాన్ని కంట్రోల్ చేయడం పోలీసులకు సైతం సాధ్యం కాలేదు. ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ.. ఈ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి రావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. అనంతరం సమంత కడపలోని పెద్ద దర్గాను దర్శించి.. చాదర్‌ను సమర్పించారు. కడప పర్యటన ముగించుకుని హైదరాబాద్‌కు వచ్చినప్పటి నుంచి ఆమె తీవ్రమైన జలుబు, వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నారు .ఈ నేపథ్యంలో సమంత చికిత్స నిమిత్తం హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ అసుపత్రిలో చేరారు. మొత్తానికి సమంత ఆరోగ్యంపై వచ్చిన వార్తలు ఒక్కసారిగా అందరినీ ఆందోళనలోకి నెట్టేశాయి.
ప్రస్తుతం అల్లు అర్జున్ ‘‘పుష్ప’’లో సమంత చేసిన స్పెషల్ సాంగ్ ‘ఊ అంటావా మావ.. ఊఊ అంటావా మావ’ అభిమానులను అలరిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చిన ఈ పాటకు చంద్రబోస్ సాహిత్యం అందించగా... ఇంద్రావతి చౌహాన్ ఆలపించారు. కేవలం ఐదు రోజులు మాత్రమే షూటింగ్ చేసిన ఈ పాట కోసం సమంత ఏకంగా కోటి 30 లక్షల రెమ్యునరేషన్ అందుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం పూర్తి చేసిన సామ్.. ఓ హాలీవుడ్ మూవీలోనూ ఛాన్స్ కొట్టేసింది.