రంగంలోకి దిగుతున్న సమంత

  • IndiaGlitz, [Monday,December 11 2017]

దక్షిణాదిన వరుస సినిమాలతో బిజీగా ఉన్న హీరోయిన్ సమంత. ఒక‌వైపు వరుస సినిమాలను చేస్తూనే.. మ‌రోవైపు తన ఫేవరేట్ ప్రాజెక్టుని కూడా లైన్లో పెట్టారు ఈ ముద్దుగుమ్మ‌. 2016లో కన్నడలో విడుదలైన యుటర్న్' అనే థ్రిల్లర్ మూవీ.. తన ఫేవరేట్ ప్రాజెక్ట్ అని ఆ మధ్య సమంత వెల్లడించారు.

ఒరిజ‌న‌ల్ వెర్ష‌న్‌లో శ్రద్ధా శ్రీనాథ్ పోషించిన విలేఖరి పాత్ర.. త‌న డ్రీమ్ రోల్ అని.. ఈ సినిమా చేసేందుకు సమంత చాలా ఉత్సాహం చూపించారు. అయితే.. ఈ పాత్రను నిత్య మీనన్ చేయబోతున్నారని ఆ మధ్య మీడియాలో కొన్ని రూమర్లు కూడా వచ్చాయి.

అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం.. స‌మంత‌నే ఈ సినిమా చేయ‌బోతున్నార‌ని తెలిసింది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జనవరి మూడవ వారం మొదలు కానుంద‌ని.. ఒరిజినల్ వెర్షన్ ని డైరెక్ట్ చేసిన పవన్ కుమార్ ఈ రీమేక్ ని కూడా తెరకెక్కిస్తున్నార‌ని తెలిసింది.

ఇప్ప‌టికే స‌మంత ఈ ప్రాజెక్ట్ విష‌య‌మై సంప్ర‌దింపులు జ‌రుపుతున్నార‌ని స‌మాచారం. ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని విషయాలను అధికారికంగా త్వరలో వెల్లడిస్తారు.