డాన్స్ ఛాలెంజ్ పూర్తి చేసిన స‌మంత‌.. ఫిదా అయిన సెలబ్రిటీలు

  • IndiaGlitz, [Tuesday,March 09 2021]

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత శాంకుత‌లం అనే సినిమా మిన‌హా మ‌రో సినిమాలో న‌టించ‌లేదు. బిజి బిజీగా న‌టించే స‌మంత అక్కినేని, ఇప్పుడు ఎందుకు సినిమాలు చేయ‌డం లేద‌నేది మాత్రం స‌మాధానం లేని ప్ర‌శ్న‌గానే ఉంది. సినిమాల‌కు దూరంగా ఉన్న స‌మయంలోనూ సోష‌ల్ మీడియాలో మాత్రం అభిమానుల‌ను ప‌ల‌క‌రిస్తూ వ‌చ్చింది. త‌నకు సంబంధించిన ఫొటోల‌ను, వీడియోల‌ను పోస్ట్ చేస్తూ అప్‌డేట్స్ ఇస్తూ వ‌చ్చింది. రీసెంట్‌గా ‘డోంట్ రష్’ అనే హాలీవుడ్ ప్రైవేట్ ఆల్బ‌మ్‌కు సెల‌బ్రిటీ కొరియోగ్రాఫ‌ర్ అనూష స్వామితో కలిసి స్టెప్పులేసింది స‌మంత. ఈ వీడియోను త‌న ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది. ‘‘విక్కీ కౌశ‌ల్ దీన్ని మేము చేయ‌గ‌లిగేలా చేశాడు. అనూష అద్భుత‌మైన మ‌హిళ‌. ఆమెకు నా అభినంద‌న‌లు. ఆమె ఓ ఏడాది సమ‌యం ఇస్తే, నేను డాన్స్‌లో ఈ నీస్థాయిని చేరుకోగ‌ల‌ను’’ అని మెసేజ్‌ను పోస్ట్ చేసింది స‌మంత‌.

నెట్టింట ఈ వీడియో వైర‌ల్‌గా మారింది. చాలా మంది సినీ సెల‌బ్రిటీలు సైతం స‌మంత డాన్స్‌కు ఫిదా అయ్యారు. ‘సామ్.. నువ్వు డాన్స్ చాలా బాగా చేశావ్.. రిపీట్ మోడ్‌లో పెట్టుకుని నీ వీడియోనే చూస్తున్నాను’ అని ఉపాస‌న రిప్ల‌య్ ఇచ్చింది. ర‌కుల్ ప్రీత్ సింగ్‌, లావ‌ణ్య త్రిపాఠి, దియా మీర్జా, నందినీ రెడ్డి, విమ‌లా రామ‌న్‌, సుశాంత్ త‌దిత‌రులు కూడా స‌మంత డాన్స్ బావుంద‌ని ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.