Mulayam Singh Yadav : ములాయం సింగ్ యాదవ్ కన్నుమూత... దేశ రాజకీయాల్లో చెరగని ముద్రవేసిన ‘‘నేతాజీ’’
Send us your feedback to audioarticles@vaarta.com
సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకులు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ కన్నుమూశారు. ఆయన వయసు 82 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న ములాయం గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో సోమవారం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ప్రకటించారు.
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, కిడ్నిసంబంధిత అనారోగ్యంతో గత నెలలో ములాయం మేదాంత ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆయనను ఐసీయూలోనే వుంచి నిపుణులైన వైద్య బృందం అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తూ వస్తోంది. ములాయం ప్రాణాలను కాపాడేందుకు డాక్టర్లు శాయశక్తులా ప్రయత్నించారు. అయినప్పటికీ ఫలితం దక్కలేదు. డాక్టర్ నితిన్ సూద్, డాక్టర్ సుశీలా కఠారియా పర్యవేక్షణలో చికిత్స జరిగింది. ప్రధాని నరేంద్రమోడీ, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాధ్ సింగ్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తదితరులు ఆయన ఆరోగ్యంపై ఆరా తీశారు.
ఇదీ ములాయం ప్రస్థానం:
భారతదేశంలోని సీనియర్ రాజకీయ వేత్తల్లో ఒకరైన ములాయం సింగ్ యాదవ్ 1939 నవంబర్ 22న ఉత్తరప్రదేశ్‌లోని ఇటావా జిల్లా సైఫై గ్రామంలో జన్మించారు. యువకుడిగా వున్నప్పటి నుంచి దేశ రాజకీయాలను ఆసక్తిగా గమనించేవారు. 1967లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి యూపీ అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఎమర్జెన్సీ సమయంలో 19 నెలల పాటు జైలు జీవితం గడిపారు. 1992లో సమాజ్‌వాదీ పార్టీని స్ధాపించారు.
దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం, అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్‌కు ములాయం సింగ్ యాదవ్ ముఖ్యమంత్రిగా సేవలందించారు. కేంద్ర మంత్రిగానూ పనిచేశారు. రాజకీయ జీవితంలో పది సార్లు ఎమ్మెల్యేగా.. 7 సార్లు ఎంపీగా ములాయం పనిచేశారు. కుమారుడు అఖిలేష్‌కి సమాజ్‌వాదీ పార్టీ బాధ్యతలను అప్పగించిన అనంతరం ఆయన రాజకీయాలకు దూరంగా వుంటూ వస్తున్నారు. మరోవైపు ములాయం సింగ్ యాదవ్‌కు ఇద్దరు భార్యలు. వీరిద్దరూ గతంలోనే కన్నుమూశారు. 2003లో ఆయన మొదటి భార్య మాలతీ దేవి చనిపోగా.. సాధనా గుప్తాను వివాహం చేసుకున్నారు. అంతకంటే ముందే సాధనతో పెళ్లయ్యిందని.. మొదటి భార్య మరణించాకే ఆయన తమ బంధాన్ని బహిర్గతం చేశారని అంటారు. సాధనా గుప్తా కూడా అనారోగ్యంతో బాధపడుతూ.. ఈ ఏడాది జూలై 9న కన్నుమూశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments