‘కోల్కతా లతా మంగేష్కర్’కు సల్లు భాయ్ కల్లుచెదిరే గిఫ్ట్!
- IndiaGlitz, [Wednesday,August 28 2019]
మొన్నామధ్య రాజమండ్రి పరిసరాల్లోని పల్లెకోకిల పసల బేబీ ఉదంతం గురించి అందరికీ తెలిసే ఉంటుంది.. ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. తాజాగా.. పశ్చిమ బెంగాల్లో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. రాణు మోండాల్ అనే మహిళ రైల్వే స్టేషన్ ప్లాట్ ఫామ్ మీద పాడిన పాట ఓవర్ నైట్ సెలబ్రిటీగా మార్చేసింది. రాణాఘాట్ రైల్వేస్టేషన్ లో ‘ఏక్ ప్యార్ కా నగ్మా హై’ అనే గీతాన్ని అత్యంత శ్రావ్యంగా ఆలపించిన రాణు ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది.
హిమేష్ రూ. 7లక్షల రెమ్యునరేషన్..!
గానకోకిల లతా మంగేష్కర్ పాడిన ఆ పాటకు రాణు మోండాల్ మళ్లీ ప్రాణం పోసిందని సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు అందరూ కొనియాడారు. దాంతో అంతా ఆమెను ‘కోల్ కతా లతా మంగేష్కర్’ అంటూ పిలవడం మొదలెట్టారు. అంతేకాదు... బాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు హిమేశ్ రేషమ్మియా తన కొత్త చిత్రంలో ఓ పాట కూడా పాడించడంతో ఈమె రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఈ పాట పాడినందకు గానూ ఆమెకు.. హిమేష్ రూ.6 నుంచి 7 లక్షల రెమ్యూనరేషన్ ఇచ్చినట్టు తెలిసింది.
కండలవీరుడు ఏకంగా ఇల్లే!
అయితే ఈమె ప్రతిభకు గురించి తెలుసుకున్న బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (సల్లు భాయ్) ముగ్ధుడైపోయాడు. రాణు గాత్రానికి ఫిదా అయిపోయిన భాయ్ ఒకట్రెండు కాదు ఏకంగా రూ.55 లక్షలు విలువ చేసే ఇంటిని కానుకగా ఇచ్చినట్టు బాలీవుడ్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు ప్రచురిస్తోంది. అంతటితో ఆగని కండలవీరుడు ‘దబాంగ్-3’ సినిమాలో కూడా రాణు మోండాల్తో ఓ పాట పాడించాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
కాగా.. ‘దబాంగ్’ సీరీస్లో మూడో సినిమా దబాంగ్-3 షూటింగ్ షురూ అయ్యింది. సల్మాన్ ఖాన్ హీరోగా చేస్తున్న ఈ సినిమాలో సోనాక్షి సిన్హా నటిస్తుండగా.. ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్న విషయం విదితమే.