CM Jagan:సీఎం జగన్ పుట్టినరోజ సందర్భంగా వాలంటీర్లకు జీతం పెంపు

  • IndiaGlitz, [Thursday,December 21 2023]

సీఎం జగన్ పుట్టినరోజ సందర్భంగా వాలంటీర్లకు ఏపీ ప్రభుత్వం శుభవార్త అందించింది. రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు వాలంటీర్లకు జీతం పెంచుతున్నట్లు ప్రకటించింది. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఈ ప్రకటన చేశారు. జనవరి 1వ తేదీ నుంచి వాలంటీర్స్ జీతం అదనంగా రూ.750 రూపాయలు పెంచుతున్నామని ప్రకటించారు. తమ అధినేత, ముఖ్యమంత్రివర్యులు జన్మదినం కానుకగా వచ్చే నెల 1వ తేదీ నుంచి వాలంటీర్లకు గౌరవ భృతిని రూ.5 వేల నుంచి రూ. 5,750 పెంచుతున్నామని మంత్రి వెల్లడించారు.

గ్రామాల్లో, పట్టణాల్లో వాలంటీర్లు సమర్ధవంతంగా పనిచేయాలనే ఉద్దేశంతో నెలకు రూ.750 పెంచుతున్నట్లు ఆయన తెలిపారు. రాబోయే రోజుల్లో వాలంటీర్లకు మంచి భవిష్యత్తు ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి జగన్ నేతృత్వంలో రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధిలో ముందుకు సాగుతుందన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ కలిసి దోచుకునేందుకు చూస్తున్నారని మండిపడ్డారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా జగన్ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని కారుమూరి ధీమా వ్యక్తం చేశారు.

కాగా 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రవాప్తంగా వాలంటీర్లను నియమించిన సంగతి తెలిసిందే. ప్రజలకు ఇంటి వద్దకే ప్రభుత్వ సేవలు అందించేందుకు వాలంటీర్ల వ్యవస్థను సీఎం జగన్ ఏర్పాటుచేశారు. ఇందుకు వారికి గౌరవ వేతనంగా రూ.5వేలు అందిస్తు్న్నారు. ఇప్పుడు వారి సేవలను మరింత సమర్థవంతంగా వినియోంచుకునేందుకు వారిని ప్రోత్సహించేలా వేతనం పెంచేందుకు నిర్ణయం తీసుకున్నారు.