Salaar Collections: బాక్సాఫీస్ దగ్గర ప్రభాస్ వేట మొదలు.. తొలిరోజు వసూళ్లు ఎంతంటే..?

  • IndiaGlitz, [Saturday,December 23 2023]

బాక్సీఫీస్ దగ్గర రెబల్‌స్టార్ ఊచకోత మొదలైంది. తొలిరోజు తొలి ఆట నుంచే భారీ కలెక్షన్లతో దూసుకెళ్తోంది. భారీ అంచనాలతో డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సలార్ సినిమా మొదటి షోకే సూపర్ హిట్ అందుకుని దుమ్మురేపుతోంది. ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే దాదాపు రూ.45 కోట్లు వసూళ్లు వచ్చాయి. ఇక బొమ్మ థియేటర్లలో పడ్డాక ప్రభాస్ హీరోయిజానికి అందరూ పిచ్చెక్కిపోయారు. వెండితెరపై ఓ రేంజ్‌లో ప్రభాస్‌ను డైరెక్టర్ ప్రశాంత్ నీల్ చూపించాడు. దీంతో మూవీ చూసేందుకు అభిమానులు పోటెత్తారు. ఈ క్రమంలో రికార్డు కలెక్షన్లు రాబట్టినట్లు తెలుస్తోంది.

ఆంధ్రా, నైజాంలో సుమారుగా 60 కోట్ల గ్రాస్, కర్ణాటకలో 15 కోట్ల గ్రాస్, కేరళలో 5 కోట్ల గ్రాస్, తమిళనాడులో 10 కోట్ల గ్రాస్, ఉత్తరాదిలో 30 కోట్ల గ్రాస్ వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఓవరాల్‌గా ఇండియాలో 130 కోట్ల గ్రాస్, 110 కోట్ల షేర్ వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఓవర్సీస్‌లోనూ భారీ కలెక్షన్లు నమోదు అయ్యాయి. ఉత్తర అమెరికాలో 2.5 మిలియన్ డాలర్లు, ప్రపంచవ్యాప్తంగా 6 మిలియన్ డాలర్లు రాబట్టింది. అంటే భారత కరెన్సీలో రూ.50 కోట్ల మేర వసూళ్లను సాధించిందని అంచనా వేశారు. మొత్తంగా చూసుకుంటే వరల్డ్‌వైడ్‌గా దాదాపు రూ.175 కోట్ల నుంచి 200 కోట్ల రూపాయల మేర కలెక్షన్లు సాధించవచ్చని అంచనా వేస్తున్నాయి. వీకెండ్ కావడం, సంక్రాంతి వరకు మరో పెద్ద సినిమా లేకపోవడంతో ఈ సినిమా రూ.1000 కోట్లకు పైగా రాబట్టడం ఖాయమంటున్నారు. ఈ ఏడాది విడుదలైన సినిమాల్లో తొలి రోజు వసూళ్లలో సలార్ రికార్డ్ సృష్టించింది. ఆ తర్వాత లియో, ఆదిపురుష్ చిత్రాలు రూ.140కోట్ల గ్రాస్‌తో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

ఇదిలా ఉంటే సలార్ సినిమాను సుమారుగా 270 కోట్ల రూపాయలతో తెరకెక్కించారు. ఇక ఆర్టిస్టుల రెమ్యునరేషన్స్ చూసుకుంటే మరో రూ.150 కోట్ల రూపాయలు.. అలాగే ప్రమోషనల్ ఖర్చులతో కలిపి మొత్తంగా 400 కోట్ల రూపాయలు ఈ సినిమాకు బడ్జెట్ అయినట్లు చెబుతున్నారు. అయితే ఇప్పటికే ప్రీరిలీజ్ బిజినెస్ ఓ రేంజ్‌లో జరిగినట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రా, సీడెడ్, నైజాం థియేట్రికల్ హక్కులను 144 కోట్ల రూపాయలు, కర్ణాటక 30 కోట్ల రూపాయలు, తమిళనాడు హక్కులు 12 కోట్ల రూపాయలు, కేరళ థియేట్రికల్ హక్కులు 6 కోట్ల రూపాయలు అమ్మారు. హిందీ, ఇతర రాష్ట్రాల హక్కులు 82 కోట్ల రూపాయల మేర అమ్మడుపోయాయి. ఓవర్సీస్ హక్కులను 75 కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగింది. ఇలా థియేటర్ల హక్కుల ద్వారానే రూ.350 కోట్లు వచ్చాయి. ఇక డిజిటల్, శాటిలైట్స్ రైట్స్ కూడా భారీ మొత్తానికి అమ్మినట్లు సమాచారం. ఈ లెక్కన చూసుకుంటే సినిమా విడుదలకు ముందే నిర్మాతలు లాభాల బాట పట్టినట్లు తెలుస్తోంది. ఇప్పుడు వసూళ్ల సునామీ మొదలుకావడంతో ఊహించని లాభాలు అందుకోవం ఖాయంగా కనిపిస్తోంది. మొత్తానికి బాహుబలి తర్వాత ప్రభాస్‌కు ఆ స్థాయి హిట్ పడటంతో రెబల్ ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.