Sajjala:అభ్యర్థుల మార్పుపై స్పందించిన సజ్జల.. ఏమన్నారంటే..?
Send us your feedback to audioarticles@vaarta.com
అధికార వైసీపీ కొంతమంది అభ్యర్థులను మారుస్తుందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రంగా ఖండించారు. అయిదు నెలల పాటు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేసి అభ్యర్థులను ఎంపిక చేశామని.. అలాంటిది ఇప్పుడు అభ్యర్థుల మార్పు ఎందుకు ఉంటుంది..? అని ప్రశ్నించారు. అభ్యర్థుల మార్పు విషయంలో గందరగోళం టీడీపీ కూటమిలోనే ఉందని.. అది కవర్ చేసుకోవడానికి సోషల్ మీడియాలో వైసీపీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కొత్తగా నలుగురు వ్యక్తులు వచ్చి చేరారని వైసీపీలో అభ్యర్థుల మార్పు ఉండదని స్పష్టం చేశారు .
అలాగే చంద్రబాబుపైన తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు రోజుకో మాట మారుస్తారని.. నాలుగు ఓట్లకోసం అబధ్ధపు హామీలు ఇస్తున్నారని విమర్శించారు. వాలంటరీ వ్యవస్థ పై నమ్మకం ఉంటే.. ఇన్నాళ్లు చంద్రబాబు మాట్లాడిన మాటల సంగతి ఏంటి అని నిలదీశారు. వాలంటరీల వ్యవస్థపై గతంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ తప్పుగా మాట్లాడిన విషయాలను గుర్తుచేశారు. వాలంటరీ వ్యవస్థ తీసేస్తామన్న చంద్రబాబు.. ఇప్పుడు ఆ వ్యవస్థ కొనసాగిస్తాం అంటున్నారని తెలిపారు. కూటమి అధికారంలోకి వస్తే ఇప్పుడున్న వాలంటరీలను తీసేసి జన్మభూమి కమిటీ సభ్యులతో నింపుతారని సజ్జల ఆరోపించారు.
రాజీనామా చేసిన వాలంటీర్లు వైసీపీ నేతల ప్రచారంలో పాల్గొంటే టీడీపీకి ఎందుకని ప్రశ్నించారు. ఇక రాష్ట్రంలో ఎన్నికలు నిష్పాక్షికంగా జరగడం లేదని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం ఏ పార్టీ మీద ఎక్కువ కేసులు పెట్టిందో చూడాలన్నారు. అధికార వైసీపీకే ఎక్కువగా ఎలక్షన్ కమిషన్ నుంచి నోటీసులు వస్తున్నాయని.. కేసులు బుక్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగితే వైసీపీదే విజయం అనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
కాగా కొన్ని సీట్ల విషయంలో వైసీపీ మార్పులు చేర్పులు చేయనుందని ప్రచారం ఊపందుకుంది. ముఖ్యంగా మైలవరం నుంచి జోగి రమేశ్‌ను తిరిగి నిలబెడతారని.. గుంటూరు ఎంపీగా విడదల రజినీని.. గుంటూరు వెస్ట్ అభ్యర్థిగా కిలారు రోశయ్య.. విజయవాడ పశ్చిమ అభ్యర్థిగా పోతిన మహేష్.. చిలకలూరిపేట అభ్యర్థిగా మర్రి రాజశేఖర్ పేర్లు ఖరారు అయ్యాయని ఓ వార్త హల్చల్ చేస్తోంది. అయితే ఈ వార్తలను తాజాగా సజ్జల ఖండించడంతో అభ్యర్థుల విషయంలో ఎలాంటి మార్పులు ఉండవని స్పష్టత వచ్చింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments