Ramakrishna Reddy:కాంగ్రెస్‌కు షర్మిల మద్దతు ఇవ్వడంపై.. సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు..

  • IndiaGlitz, [Friday,November 03 2023]

తెలంగాణ ఎన్నికల్లో పోటీకి వైసీటీపీ అధినేత షర్మిల దూరం కావడంపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. షర్మిల ఓ పార్టీకి అధ్యక్షురాలు అని.. ఆమె నిర్ణయాలు ఆవిడ ఇష్టమని.. తమకు ఈ రాష్ట్రానికి చెందిన విషయాలే ముఖ్యమని తెలిపారు. జగన్మోహన్‌రెడ్డిని ఏ పార్టీ అయితే వేధించి అక్రమ కేసులు పెట్టిందో ఆ పార్టీతో షర్మిల కలవడాన్ని ఆమె ఇష్టానికే వదిలేస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ వైఎస్సార్ కుటుంబాన్ని వేధించిందని.. ఇబ్బందులు పెట్టిందని అందరికీ తెలుసన్నారు. జగన్‌పై అక్రమ కేసులు పెట్టి కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పెట్టిందని ఆరోపించారు.

ఇక టీడీపీ అధినేత చంద్రబాబుపై వరుస కేసులు పెట్టడంపై ఆ పార్టీ నేతలు చేస్తున్న ఆరోపణపలపై సజ్జల తీవ్రంగా స్పందించారు. చంద్రబాబుపై ఎందుకు తక్కువ కేసులు పెట్టారని అడగాలన్నారు. టీడీపీ హయాంలో ఉచిత ఇసుక పేరుతో ప్రభుత్వానికి రావాల్సిన సొమ్ము నొక్కేశారని ఆరోపించారు. నియమాలు పాటించకుండా, క్యాబినెట్ నిర్ణయం తీసుకోకుండా చేశారని తెలిపారు. చట్టానికి విరుద్ధంగా చేశారు కనుకే చట్ట ప్రకారం కేసు పెట్టారని స్పష్టంచేశారు. చంద్రబాబు చేసిన కుంభకోణాలు చాలా ఉన్నాయని.. ఆధారాలు ఉన్నాయి కనుకే కేసులు పెట్టారన్నారు. ఉచిత ఇసుక అంటే ఎవరికి వాళ్లు తెచ్చుకోవాలి కానీ పెద్ద పెద్ద ప్రొక్లైనర్లు పెట్టి దందా చేశారని మండిపడ్డారు .

ఇదిలా ఉంటే పురంధరేశ్వరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలా? టీడీపీకి ఉపాధ్యక్షురాలా? అని ఆయన ప్రశ్నించారు. ఆమె కేవలం చంద్రబాబు ఫ్యామిలీకి ప్రాతినిథ్యం వహిస్తున్నారని.. వారం పది రోజుల నుంచే ఇలా మాట్లాడుతున్నారని సజ్జల ధ్వజమెత్తారు.