అభివృద్ధి కనిపించడం లేదా..? షర్మిల వ్యాఖ్యలపై సజ్జల విమర్శలు..
Send us your feedback to audioarticles@vaarta.com
అప్పుడే మీసాలు వచ్చిన కుర్రాడు నా అంత పోటుగాడు లేడని ఊహించుకుంటూ ఉంటాడు.. అలాగే ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమితులైన షర్మిల.. అప్పుడే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ తన గురించి తాను గొప్పగా ఊహించుకుంటున్నారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి సెటైర్లు వేశారు. అలా రాష్ట్రానికి వచ్చారో లేదో రాష్ట్రంలో అభివృద్ధి కనిపించడం లేదంటూ విమర్శలు చేయడం మొదలుపెట్టారని.. చంద్రబాబును సీఎం చేయాలనే లక్ష్యంతో ఉన్న షర్మిలకు అభివృద్ధి ఎలా కనిపిస్తుందని మండిపడ్డారు. సచివాలయాలు, పాఠశాలలు, ఆసుపత్రులు, ఫిషింగ్ హార్బర్‌లు, పోర్టులు, యువతకు ఆరున్నర లక్షల ఉద్యోగాలేవి ఆమె కంటికి కనిపించడం లేదా అని ఆయన ప్రశ్నించారు.
షర్మిల వెనక చంద్రబాబు..
నోటాకు వచ్చిన ఓట్ల కంటే తక్కువ ఓట్లు వచ్చిన పార్టీకి అధ్యక్షురాలై ప్రగాల్భాలు పలుకుతున్నారని.. షర్మిలను చూస్తే జాలి కలుగుతోందని ప్రజలు అనుకుంటున్నారని తెలిపారు. వైఎస్సార్ కుటుంబాన్ని నాశనం చేయాలని చూసిన కాంగ్రెస్ పార్టీలో చేరి ఆమె వ్యక్తిత్వం కోల్పోయారని పేర్కొన్నారు. తన మైలేజీ పెంచుకునేందుకు నోటికొచ్చినట్లు మాట్లాడుతూ వాస్తవాలను వక్రీకరిస్తున్నారని చెప్పారు. షర్మిల వాడిన భాష చూస్తే రోజూ చంద్రబాబు చేసే ఆరోపణలే గుర్తుకు వస్తున్నాయి సజ్జల పేర్కొన్నారు. అందుకే చంద్రబాబు డైలాగులనే షర్మిల కూడా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.
తెలంగాణ కోడలుకు ఆంధ్రాలో ఏం పని..
అసలు ఆంధ్రా రాష్ట్రంతో సంబంధం లేని తెలంగాణ కోడలు అయిన షర్మిలకు ఇక్కడ ఏమి పని అని ఆయన ప్రశ్నించారు. నా క్యాడర్.. నా పోరాటం... నా అస్తిత్వం.. నా ఉనికి.. నా రాజకీయం అంటూ తెలంగాణాలో రాజకీయాలు మొదలు పెట్టిన విషయం మర్చిపోయారా అని నిలదీశారు. అక్కడ రాజకీయాల్లో ఏం చేయలేక ఆమె పెట్టిన పార్టీ జెండాను కాంగ్రెస్‌లో విలీనం చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఆంధ్రాలో అడుగుపెట్టిన మరుక్షణమే అభివృద్ధి కానరావడం లేదని విమర్శలు చేశారంటే ఆమె ఆలోచన స్థాయి ఎలా ఉందో అర్థం అవుతోందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీ కోలుకోవడం అసాధ్యం..
చంద్రబాబు, సోనియా గాంధీ కలిసి జగన్‌పై అక్రమ కేసులు బనాయించిన విషయాన్ని మర్చిపోయారా అని దుయ్యబట్టారు. అలాంటి వ్యక్తులకు లబ్ధి చేకూరేందుకు షర్మిల వకాల్తా పుచ్చుకోవడం వైఎస్సార్ అభిమానులు ఎప్పటికీ సహిచరని అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నిలువునా చీల్చి.. తీరని ద్రోహం చేసిన కాంగ్రెస్ పార్టీని రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితి కూడా లేదన్నారు. ఎప్పుడో ఆ పార్టీని వెయ్యి అడుగుల లోతున సమాధి చేసేశారని.. భవిష్యత్‌లోనూ ఆ పార్టీ కోలుకోవడం కష్టమే అని తెలిపారు. కనీసం వంద ఓట్లు కూడా లేని పార్టీకి అధ్యక్షురాలిగా నియమితులై ఏం ఉద్ధరిస్తారని ప్రశ్నల వర్షం కురిపించారు. ఎప్పుడో చనిపోయిన కాంగ్రెస్ పార్టీకి తిరిగి ప్రాణం పోయాలని షర్మిల పడుతున్న ఆరాటాన్ని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని సజ్జల వెల్లడించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments