అనాథ శరణాలయం నిర్మాణాన్ని పూర్తి చేసిన సాయి తేజ్..

  • IndiaGlitz, [Saturday,September 19 2020]

మెగా హీరోల్లో సాయి తేజ్ వేరుగా ఉంటాడు. ఆయన ఆలోచనా విధానం సామాన్యుడికి చాలా దగ్గరగా ఉంటాయి. గతేడాది తన బర్త్ డే సందర్భంగా ఓ వినూత్న ఆలోచనకు సాయి తేజ్ శ్రీకారం చుట్టాడు. బర్త్ డే అనగానే అనాథ శరణాలయంలో పండ్లు పంచడం.. కేక్ కట్ చేయడం వంటివన్నీ చేయడం కంటే ఒక ప్రాబ్లమ్‌కి పర్మినెంట్ సొల్యూషన్‌ ఇస్తే ఎలా ఉంటుందనే ఆలోచన చేశాడు. అంతేకాదు.. వెంటనే దానిని అమలు చేశాడు. ఈ ఏడాది తన బర్త్‌డే సమయానికి పూర్తి చేసి వావ్ అనిపించాడు.

అసలు విషయానికి వస్తే.. విజయవాడలోని అమ్మ అనే అనాథ శరణాలయం వాళ్లు తమ శరణాలయ దుస్థితిని ట్విట్టర్ వేదికగా వెల్లడిస్తూ సాయితేజ్‌కు ట్యాగ్ చేసి కనస్ట్రక్షన్ పూర్తి చేయడం కోసం సాయం అందించమని కోరారు. దీంతో సాయం కాదని.. పూర్తిగా కనస్ట్రక్షన్ బాధ్యత తానే తీసుకుంటానని సాయి తేజ్ ప్రకటించాడు. వెంటనే మెగా ఫ్యాన్స్ అందరికీ ఓ విన్నపం చేశాడు. తన బర్త్‌డేకి ఫ్లెక్సీలవీ వద్దని.. వారు పెట్టే ఫ్లెక్సీల ఖర్చు.. లేదంటే మీరివ్వగలిగే అమౌంట్ రూపాయి అయినా కానీ.. తనకు ఇస్తే వాళ్ల పేరుపై ఆ అనాథ శరణాలయానికి డొనేట్ చేస్తానని వెల్లడించాడు.

దీంతో అభిమానులంతా లక్ష రూపాయలకు పైగా అందించారు. దానితో పాటు మిగిలిన ఖర్చును సాయితేజ్ పెట్టుకుని అనాథ శరణాలయం నిర్మాణాన్ని పూర్తి చేశాడు. అంతేకాదు.. రెండేళ్ల వరకూ అనాథ శరణాలయం నిర్వహణ బాధ్యతను కూడా తానే భరిస్తానని వెల్లడించాడు. అనుకున్న ప్రకారం తాజాగా 720 అడుగుల చదరపు అడుగుల స్థలంలో అమ్మ అనాథ శరణాలయాన్ని పూర్తి చేశారు. అందరూ హీరోలు సాయి తేజ్ బాటనే ఎంచుకుంటే ఇటువంటి ఎన్నో మంచి పనులు సాకారమవుతాయి.