'కణం' సినిమాతో ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యాను - సాయిపల్లవి
Send us your feedback to audioarticles@vaarta.com
నాగశౌర్య, సాయిపల్లవి నటించిన చిత్రం ‘కణం’. ఎన్.వి.ఆర్ సినిమా సమర్పణలో లైకా ప్రొడక్షన్స్ సినిమాను నిర్మించింది. విజయ్ దర్శకుడు. సినిమా ఏప్రిల్ 27న విడుదలవుతుంది.
ఈ సందర్భంగా సాయిపల్లవి ఇంటర్వ్యూ....
అమ్మ కోసం చేశాను...
దర్శకుడు విజయ్‌తో `చార్లి` అనే సినిమా చేయాల్సింది. కానీ కుదరలేదు. తర్వాత ఈ కథను నాకు చెప్పారు. కథ విని ముందు నేను నటించనని అన్నారు. ఎందుకంటే తెలుగులో కొన్ని సినిమాలు చేసినప్పటికీ.. నా మాతృభాష తమిళంలో నా మొదటి సినిమా కావడంతో... తొలి తమిళ చిత్రంలోనే తల్లిపాత్రలో ఎందుకు నటించాలని వద్దని అన్నాను. అయితే స్క్రిప్ట్ చదవి, నచ్చితే నటించమని అన్నారు. నేను స్క్రిప్ట్ చదవలేదు కానీ.. మా అమ్మగారు చదివి.. `మంచి కథ, ఎందుకు చేయనని అన్నావు` అని అడిగింది. `తమిళంలో తొలి సినిమా అమ్మ పాత్రలో నటించడమే కాదు.. హారర్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి కదా! ఎందుకు చేయాలనిపించి చేయలేదు` అని ఆమెతో చెప్పాను. అయితే అమ్మ సినిమాలో నటించమని చెప్పడంతో ఆమె కోసం సినిమా చేయడానికి ఒప్పుకున్నాను.
ఆలోచనా విధానం మారింది...
నటిగా పాత్ర ఏదైనా బావుంటే చేయాలి. సాధారణంగా యంగ్ ఏజ్‌లో ప్రేయసి పాత్రలు చేయడానికి ఇష్టపడతాం. అలాగే ఎవరికైనా రెండు మూడు సినిమాలు చేశాక మన ఆలోచనా విధానం మారుతుంది. అలాగే నా ఆలోచనా విధానం మారుతూ వస్తుంది. ఇక `కణం` సినిమాతో ఆ ఆలోచనా విధానం మరింత మెరుగుపడిందనే చెప్పాలి. ఈ సినిమా చేస్తున్నంత సేపూ నన్ను నేను ఓ తల్లిగానే ఊహించుకుంటూ చేశాను. వెరోనికాతో బాగా కనెక్ట్ అయ్యాను. ఓ రకంగా చెప్పాలంటే ఈ సినిమాపై నా ఆలోచనా తీరు మారింది. నాకు నేను కొత్తగా కనపడుతున్నాను. ఈ సినిమా చేసిన తర్వాత తల్లి పాత్రలో ఎందుకు నటించానా? అన్న అసంతృప్తి మాత్రం అస్సలు లేదు.
ఎంత మంచి పాత్ర చేశామన్నదే ముఖ్యం...
నేను జార్జియాలో డాక్టర్ కోర్సు చదువుకున్నాను. నాకు మొటిమలు బాగా వచ్చేవి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మొటిమలు తగ్గలేదు. బయటకు వెళ్లేటప్పుడు ముఖానికి బట్ట కట్టుకుని వెళ్లేదాన్ని. నా తొలి చిత్రం ప్రేమమ్ చేసినప్పుడు నా ముఖం నిండా మొటిమలే. నన్ను ప్రేక్షకులు హీరోయిన్గా ఒప్పుకుంటారా? అని బాధపడేదాన్ని. కానీ సినిమా రిలీజ్ అయ్యాక.. ప్రేక్షకులు నన్ను రిసీవ్ చేసుకున్న తీరు నాకెంతో ధైర్యాన్నిచ్చింది. ముఖం ఎంత అందంగా ఉందని కాదు.. ఎంత మంచి పాత్ర చేశామనేదే ముఖ్యం. ఒకప్పుడు మొటిమలతో బాధపడే అమ్మాయిలు.. ఇప్పుడు సాయిపల్లవికి కూడా మొటిమలు ఉన్నాయి కదా? అని అనుకుంటున్నారు. వాటి గురించి పట్టించుకోవడం మానేశారు.
పాపను దత్తత తీసుకోవాలనుకున్నా....
`కరు` సినిమాను తమిళంలో ఇప్పుడు `దియా` అని టైటిల్ మార్చారు. తల్లికి, బిడ్డకు మధ్య మధ్య ఎమోషనల్ బాండింగ్‌ను మూవీ. సినిమా చేస్తున్నంత సేపు మూవీకి ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యాను. ఇంతకు ముందు చెప్పినట్లు ఇందులో దియా పాత్రలో నటించిన వెరోనికాతో ఎమోషనల్‌గా బగా కనెక్ట్ అయిపోయాను. తల్లి ఇలాగే ఆలోచిస్తుందా? అనిపించేది. ఓ సందర్భంలో విజయ్‌గారి దగ్గరకెళ్లి.. ఆ పాపను దత్తత తీసుకోవాలనుందని చెప్పాను. అదే విషయం అమ్మకు చెబితే `ముందు నిన్ను నువ్వు చూసుకో... తర్వాత వేరే వారి గురించి ఆలోచించవచ్చు` అని చెప్పింది.
అదెంత నిజమో తెలియదు...
నా మాతృభాష తమిళమే అయినా, తమిళంలో డబ్బింగ్ చెప్పడానికి ఒకటిన్నర రోజు పట్టింది. అదే తెలుగులో సగం రోజులోనే డబ్బింగ్ చెప్పేశాను. మాతృభాష తమిళం కంటే తెలుగులోనే బాగా మాట్లాడుతాను.. డైలాగ్ చెబుతానని చాలా మంది అన్నారు. అదెంత నిజమో! తెలియదు కానీ.. తెలుగు కంఫర్ట్‌గా ఉంది.
నేను ఎవరినీ బాధ పెట్టను...
నాగశౌర్యగారు చాలా మంచి నటుడు. తను కెమెరా ముందుకు రాగానే ట్రాన్స్ఫర్మేషన్ అయిపోతారు. సాధారణంగా షూటింగ్ సమయాల్లో నేను ఎక్కువ ప్రాక్టీస్ చేస్తాను. నా డైరెక్టర్స్ బుర్ర తినేస్తాను. ఒకవేళ ఏదైనా సన్నివేశం సమయంలో నాగశౌర్యను చూస్తే.. అతను సైలెంట్‌గా ఉంటే.. అతనికి ఇంకా ఎక్కువ సమయం కావాలేమోననుకుని నేను సైలెంట్‌గా అయిపోయేదాన్ని. తను నేను మాట్లాడటం లేదని ఫీలయ్యాడనుకుంటా. నేను ఎవరినీ బాధ పెట్టను. ఒకవేళ నా వల్ల ఎవరైనా బాధ పడ్డారని తెలిస్తే ... వెంటనే సారీ చెప్పేస్తాను. డబ్బింగ్ సమయంలో అందరం కలిసి డిన్నర్ చేద్దామని నాగశౌర్యకు ఫోన్ చేద్దామనుకుంటే.. అతని వద్ద ఫోన్ లేదని విజయ్‌గారు చెప్పారు. ఆయన మేనేజర్‌కి కాల్ చేస్తే.. ఆయన `ఛలో` మూవీ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారని చెప్పారు. నేను ఆ సమయంలో ఎంతో బాధపడ్డాను. నేను ఆయన్ను కావాలనే బాధపెట్టలేదు. ఒకవేళ నిజంగా బాధ పెట్టి ఉంటే సారీ చెప్పేస్తాను
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com