దేనికైనా టైమ్ రావాలి...ఆ టైమ్ వస్తుందనే నమ్మకం ఉంది - సంగీత దర్శకుడు సాయి కార్తీక్
Send us your feedback to audioarticles@vaarta.com
కాల్ సెంటర్ మూవీతో కెరీర్ ప్రారంభించి...అనతి కాలంలోనే యాభై చిత్రాలకు సంగీతం అందించిన యువ సంగీత దర్శకుడు సాయి కార్తీక్. పైసా, ప్రతినిథి, రౌడీ, పటాస్, రాజు గారి గది...ఇలా విభిన్న కథా చిత్రాలకు సంగీతం అందించిన...సాయి కార్తీక్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంటుంది అనే ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకున్నాడు. నారా రోహిత్ తాజా చిత్రం రాజా చెయ్యివేస్తే చిత్రంతో సాయి కార్తీక్ యాభై చిత్రాలను పూర్తి చేసాడు. ఈ సందర్భంగా యువ సంగీత దర్శకుడు సాయి కార్తీక్ తో ఇంటర్ వ్యూ మీ కోసం....
తక్కువ టైమ్ లోనే 50 సినిమాలు పూర్తి చేసారు..ఎలా ఫీలవుతున్నారు..?
నిజమే..మీరన్నట్టుగానే తక్కువ టైమ్ లోనే 50 సినిమాలకు మ్యూజిక్ అందించాను. చిన్న సినిమానా...పెద్ద సినిమానా అని ఆలోచించకుండా నాకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ వర్క్ చేసాను. 50 చిత్రాల్లో 30 తెలుగు చిత్రాలు, 5 కన్నడ సినిమాలు ఉన్నాయి. 15 చిత్రాలకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాను. ఎనిమిది సంవత్సరాల్లో మొత్తం 50 చిత్రాలకు వర్క్ చేసాను. ఒక్కసారి గుర్తుచేసుకుంటే అప్పుడే 50 సినిమాలు పూర్తి చేసానంటే అంటే నాకే ఆశ్చర్యంగా ఉంది.
మీరు చేసిన చిత్రాల్లో టాప్ 5 మూవీస్..?
పైసా, రౌడీ, ప్రతినిథి, పటాస్, రాజు గారి గది..
అసలు..మీ సంగీత ప్రయాణం ఎలా ప్రారంభమైంది..?
నాకు చిన్నప్పటి నుంచి సంగీతం అంటే ప్రాణం. నేను డ్రమ్మర్ గా ఆనంద్, కోటి, వాసురావు, మణిశర్మ, దేవిశ్రీప్రసాద్ ల దగ్గర వర్క్ చేసాను. 2008 లో కాల్ సెంటర్ మూవీతో మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాను. ఇక అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూడలేదు.
సాయికార్తీక్ అంటే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంటుంది అని మీపై ఓ ముద్రపడింది. దీని గురించి మీరేమంటారు..?
నిజమే..చాలా మంది నా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంటుందని చెప్పారు. అలాగే మా సినిమాకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేయండి అంటూ అడుగుతుంటారు. పైసా సినిమాతో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగా చేస్తాననే పేరు వచ్చింది. రౌడీ, ప్రతినిథి చిత్రాలకు కూడా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి మంచి పేరు వచ్చింది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగా చేస్తాననే ఒక ముద్ర పడినా.. బాగా చేస్తాననే పేరు రావడం సంతోషంగా ఉంది.
రాజా చెయ్యివేస్తే...మీకు 50వ సినిమా కదా..స్పెషల్ కేర్ ఏమైనా తీసుకున్నారా..?
ఈ సినిమాకి వర్క్ చేస్తున్నప్పుడు నాకు ఇది 50వ సినిమాని గుర్తులేదు. సినిమా పూర్తయిన తర్వాత తెలిసింది ఈ సినిమా నాకు 50వ సినిమా అని. అందుచేత స్పెషల్ కేర్ అంటూ ఏమీ తీసుకోలేదు కానీ..నిర్మాత సాయి గారి ప్రొత్సహంతో మంచి అవుట్ పుట్ వచ్చింది. ఎక్కువుగా లైవ్ ఆర్కెష్ట్రాతో చేసాం. సినిమా చూస్తున్నప్పుడు ఆడియోన్స్ ని మ్యూజిక్ బాగా ఆకట్టుకుంటుంది.
ఈమధ్య వరుసగా నారా రోహిత్ సినిమాలకు వర్క్ చేస్తున్నారు.. ప్రత్యేక కారణం ఏమైనా ఉందా..?
ప్రత్యేక కారణం అంటూ ఏమీ లేదండీ. ప్రతినిధి, అసుర చిత్రాలకు నేను చేసిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ రోహిత్ గార్కి బాగా నచ్చింది. అందుకే ఆయన వరుసగా అవకాశం ఇస్తున్నారు. నేను చేస్తున్నాను.
రీమిక్స్ సాంగ్ చేయడం అంటే టెన్షన్. అందుచేత రీమిక్స్ సాంగ్ చేయకూడదు అని కొంత మంది సంగీత దర్శకుల అభిప్రాయం. ఈ వాదనతో మీరు ఏకీభవిస్తారా..?
రీమిక్స్ సాంగ్ చేయడం అనేది డైరెక్టర్ నిర్ణయం. సంగీత దర్శకుడి నిర్ణయం కాదు. అయితే నేను రీమిక్స్ సాంగ్ చేస్తే...ఆ పాటను చెడగొట్టకుండా చేయాలనుకుంటాను. అంతే కానీ..రీమిక్స్ సాంగ్ చేయకూడదు అనే నిర్ణయం ఏమీ తీసుకోలేదు. పటాస్ లో అరేవో సాంబా...సుప్రీమ్ లో అందం హిందోలం..అనే రీమిక్స్ సాంగ్స్ చేసాను. అవి నాకు మంచి పేరు తీసుకువచ్చాయి.
ప్రస్తుతం ట్యూన్ చేసిన తర్వాత లిరిక్స్ రాస్తున్నారు...గతంలో లిరిక్స్ రాసిన తర్వాత ట్యూన్ చేసేవారు..మంచి పాటలు రావడానికి రెండింటిలో ఏది మంచిది..?
ప్రస్తుతం ట్యూన్ చేసిన తర్వాత లిరిక్స్ రాస్తున్నారు. సిట్యూవేషన్ క్రిటికల్ గా ఉన్నప్పుడు లిరిక్స్ రాసి ఇస్తారా అని నేనే అడుగుతాను. పైసా, రౌడీ చిత్రాలకు ముందుగా లిరిక్స్ రాసిన తర్వాత ట్యూన్ చేసాను. రెండింటిలో ఎలా చేస్తే మంచి అవుట్ పుట్ వస్తుందో చెప్పలేను కానీ...ఏ పద్దతిలో చేసినా నా మ్యూజిక్ బాగుండాలనుకుంటాను. మంచి మ్యూజిక్ అందించడానికి ప్రయత్నిస్తుంటాను.
ఇటీవల తమన్ కమర్షియల్ మూవీస్ కి మ్యూజిక్ అందించడం చాలా కష్టం అన్నారు. మీరేమంటారు..?
కమర్షియల్ మూవీస్ కి మ్యూజిక్ అందించడం అంటే కాస్త కష్టమే. అయితే....తమన్ కమర్షియల్ మూవీస్ కి ఎక్కువుగా వర్క్ చేసాడు. అందుచేత అలా అనిపించి ఉండచ్చు. నేనైతే చిన్న సినిమా, పెద్ద సినిమాలకు కూడా వర్క్ చేసాను. అలాగే రామ్ గోపాల్ వర్మ గారితో రౌడీ, కృష్ణవంశీ గారితో పైసా మూవీకి వర్క్ చేసాను. అసుర సినిమాకి డిపరెంట్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాను. ఇలా డిపరెంట్ మూవీస్ కి వర్క్ చేయడం వలన నాకు ఎక్స్ పెరిమెంట్స్ చేసే అవకాశం లభించింది.
ఇండస్ట్రీ చెన్నై నుంచి హైదరాబాద్ కి షిప్ట్ అయి ఇన్నేళ్లు అయినా మ్యూజిక్ విషయంలో ఇంకా చెన్నై పై ఆధారపడుతున్నాం కారణం..?
వయలెన్ ఆర్టిస్టులు ఎక్కువ మంది కావాలంటే చెన్నైలో దొరుకుతారు కానీ హైదరాబాద్ లో లేరు. ఇక్కడ ఉన్న వాళ్లతో ఇక్కడే మ్యూజిక్ చేస్తున్నాం. ఇక్కడ లేని వయలెన్ ఆర్టిస్టుల కోసం చెన్నై వెళుతున్నాం.
సంగీత దర్శకుడుగా మీకు స్పూర్తి ఎవరు..?
ఇళయారాజా, ఎ.ఆర్ రెహమాన్, మణిశర్మ...ఈ ముగ్గురు నాకు స్పూర్తి. ఇళయరాజా గారి పాటలన్నీ చాలా ఇష్టం. ఇక రెహమాన్ గారి పాటల్లో బాగా ఇష్టమైన పాట అంటే పెదవే పలికిన మాటల్లోనే తియ్యనటి మాటే అమ్మ...ఈ పాట నా ఆల్ టైమ్ ఫేవరేట్ సాంగ్.ఇక మణిశర్మ గారంటే నా గురువు గారు. కమర్షియల్ మూవీస్ కి మ్యూజిక్ చేయడం అంతా మణిశర్మ గారి దగ్గరే నేర్చుకున్నాను.
మీ పాటల్లో మీకు బాగా ఇష్టమైన పాట ఏది..?
పైసా మూవీలో నీతో ఏదో అందామనిపిస్తుంది....అనే పాట నాకు బాగా ఇష్టం.
తక్కువ టైమ్ లో 50 చిత్రాలకు మ్యూజిక్ అందించారు కానీ..పెద్ద సినిమాలకు స్టార్ హీరోలకు వర్క్ చేయలేదనే అసంతృప్తి ఏమైనా ఉందా..?
పెద్ద హీరోల సినిమాలకు వర్క్ చేయకపోయినా...పెద్ద బ్యానర్స్ అయిన దిల్ రాజు, సాయి కొర్రపాటి గార్ల బ్యానర్లో వర్క్ చేసాను. దేనికైనా టైమ్ రావాలి. స్టార్ హీరోల సినిమాలకు వర్క్ చేసే టైమ్ వస్తుందనే నమ్మకం ఉంది.
నెక్ట్స్ ప్రాజెక్ట్స్ ఏమిటి..?
రాజా చెయ్యివేస్తే, సుప్రీమ్ ఈ రెండు చిత్రాలు త్వరలో రిలీజ్ అవుతున్నాయి. అప్పట్లో ఒకడుండేవాడు మూవీకి మ్యూజిక్ చేస్తున్నాను. నాలుగైదు సినిమాలకు సంబంధించి డిష్కషన్స్ జరుగుతున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments