Sai Dahram Tej: గుడిలో అలాంటి పనులా .. వివాదంలో సాయిధరమ్ తేజ్, మండిపడుతున్న పండితులు
- IndiaGlitz, [Saturday,July 15 2023]
భారతదేశంలో వేలాది ఆలయాలు వున్నాయి. వీటిలో ఒక్కొక్కదానికి ఒక్కో ప్రాశస్త్యం, క్షేత్ర పురాణాలు, ఆ ఆలయానికి ప్రత్యేక కట్టుబాట్లు వుంటాయి. ఆలయాల పవిత్రతను కాపాడేందుకు మన పూర్వీకులు వాటిని ఏర్పాటు చేశారు. వేల ఏళ్లుగా రాజులు, మహారాజులు, చక్రవర్తులు వాటిని కాపాడుతూ వచ్చారు. రాజరికం అంతరించినా ప్రభుత్వాలు, ప్రజలు ఇప్పటి వరకు ఆ ఆచారాలను గౌరవిస్తున్నారు. కానీ నేటితరానికి అవి మూఢనమ్మకాలుగా, పుక్కిటి పురాణాలుగా కనిపిస్తున్నాయి. పెద్దలు ఏం చేసినా దాని వెనుక ఏదో ఒక కారణం వుంటుందనే కనీస స్పృహ లేకుండా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే సినీనటుడు సాయిధరమ్ తేజ్ వివాదంలో చిక్కుకున్నారు.
ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు బ్రో :
సముద్రఖని దర్శకత్వంలో తన మేనమామ పవన్ కల్యాణ్‌తో కలిసి సాయిధరమ్ తేజ్ నటించిన చిత్రం ‘‘బ్రో’’. ఈ నెల 28న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. విడుదల తేదీ దగ్గరపడుతూ వుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది. దీనిలో భాగంగా హీరో సాయిధరమ్ తేజ్.. కడప జిల్లాలోని ప్రఖ్యాత అమీన్‌పీర్ దర్గాకు వెళ్లి ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. అనంతరం కాణిపాకానికి, అక్కడి నుంచి శ్రీకాళహస్తికి వెళ్లింది మూవీ యూనిట్. అయితే అక్కడ సాయితేజ్ చేసిన పని వివాదాస్పదమైంది
అర్చకులు లేకపోవడంతో :
శ్రీకాళహస్తిలోని సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో స్వయంగా సాయిధరమ్ తేజ్ హారతి ఇచ్చారు. ఇక్కడి సాంప్రదాయం, ఆచారాల ప్రకారం భగవంతుడికి కేవలం అర్చకులు మాత్రమే హారతులివ్వాలి.. భక్తులు నేరుగా హారతి ఇవ్వడం శాస్త్ర విరుద్ధమని పండితులు మండిపడుతున్నారు. అటు నెటిజన్లు సైతం ఆలయ నియమాల ప్రకారం కేవలం అర్చకులు మాత్రమే దేవుడికి హారతి ఇవ్వాలి కానీ నువ్వు ఎలా ఇస్తావ్ అంటూ ఫైర్ అవుతున్నారు. వివాదం పెద్దదవుతూ వుండటంతో ఆలయ అర్చకులు క్లారిటీ ఇచ్చారు. ఆ సమయంలో అర్చకులు లేకపోవడం వల్లనే సాయిధరమ్ తేజ్ హారతి ఇచ్చారని .. అంతే తప్పించి ఇక్కడ ఎలాంటి తప్పు జరగలేదని క్లారిటీ ఇచ్చారు. కానీ భక్తులు మాత్రం ఈ వివరణతో సంతృప్తి చెందడం లేదు. అయితే ఈ వివాదంపై హీరో సాయిధరమ్ తేజ్ స్పందించాల్సి వుంది.
రోజుకు రూ.2 కోట్లు తీసుకున్న పవన్ :
కాగా.. తమిళ హిట్ మూవీ ‘‘వినోదయ సీతం’’కు ‘‘బ్రో’’ తెలుగు రీమేక్. దీనిని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తుండగా.. టీజీ విశ్వప్రసాద్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో గెస్ట్ రోల్ కోసం పవన్ కల్యాణ్ రోజుకు దాదాపు రూ.2 కోట్లు పారితోషికంగా తీసుకున్నారని టాలీవుడ్ టాక్. 20 నుంచి 25 రోజుల పాటు పవన్ ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొన్నారు. సముద్రఖని, రోహిణి, రాజేశ్వరి నాయర్, రాజా, తనికెళ్ల భరణి, వెన్నెల కిషోర్, సుబ్బరాజు, పృధ్వి రాజ్, నర్రా శ్రీను, యువలక్ష్మి, దేవిక, అలీ రెజా, సూర్య శ్రీనివాస్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో సాయితేజ్ సరసన కేతికా శర్మ హీరోయిన్‌గా నటిస్తుండగా.. మలయాళ నటి ప్రియా ప్రకాశ్ వారియర్ కీలక పాత్ర పోషిస్తున్నారు.