ఈ ఏడాది నాలుగు చిత్రాలతో సాయిధరమ్..
- IndiaGlitz, [Wednesday,February 28 2018]
2014లో పిల్లా నువ్వు లేని జీవితం'తో కథానాయకుడిగా పరిచయమయ్యాడు మెగా హీరో సాయిధరమ్ తేజ్. 2015లో రేయ్', సుబ్రహ్మణ్యం ఫర్ సేల్' .. ఇలా రెండు చిత్రాలు చేసిన సాయిధరమ్, 2016లో సుప్రీమ్', తిక్క'తో మరోసారి రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇందులో పిల్లా నువ్వు లేని జీవితం', సుబ్రహ్మణ్యం ఫర్ సేల్', సుప్రీమ్' విజయాలను అందించగా.. మిగిలిన రెండు బాక్సాఫీస్ వద్ద అంచనాలను అందుకోలేకపోయాయి. ఇక గత ఏడాది సాయి నుంచి మూడు చిత్రాలు (విన్నర్', నక్షత్రం', జవాన్') వచ్చాయి. అయితే ఇవేవీ తేజుకు ఆశించిన విజయాన్ని అందివ్వలేకపోయాయి.
ఇక ఈ ఏడాది ప్రారంభంలో ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఇంటిలిజెంట్' తన కెరీర్లోనే అతి పెద్ద డిజాస్టర్ గా నిలిచిపోయింది. ప్రస్తుతం.. యూత్‌ఫుల్ డైరెక్టర్ కరుణాకరన్‌తో ఒక సినిమా చేస్తున్న తేజు.. గోపీచంద్ మలినేనితో సినిమాని కూడా లైన్లో పెట్టేసాడు. అంతేగాకుండా.. నేను శైలజ', ఉన్నది ఒకటే జిందగీ' వంటి చిత్రాలను తెరకెక్కించిన కిషోర్ తిరుమల దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నట్టు సమాచారం. నిజానికి ఈ కథ కిషోర్.. నాని కోసం రాసుకున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల నాని తప్పుకోవడంతో.. ఈ కథను తేజు టేకాప్ చేసారని ఇండస్ట్రీ టాక్. గోపీచంద్ మలినేని చిత్రంతో పాటు.. కిషోర్ తిరుమల మూవీ కూడా మే నుంచి సమాంతరంగా చిత్రీకరణ జరుపుకోనుందని తెలుస్తోంది. అంటే.. అన్నీ కుదిరితే ఈ ఏడాది సాయిధరమ్ నాలుగు చిత్రాలతో సందడి చేసే అవకాశముందన్నమాట.
మొత్తానికి.. ప్రతీ ఏడాది తన సినిమాల సంఖ్యను పెంచుకుంటున్న ఈ యువ కథానాయకుడు.. వీటితో పాటు విజయాలను కూడా పెంచుకుంటే బాగుంటుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.