కన్నడ సినీ పరిశ్రమలోనూ విషాదం..
- IndiaGlitz, [Wednesday,May 31 2017]
దర్శకరత్న డా.దాసరి నారాయణరావు మరణంతో తెలుగు చిత్రసీమ శోక సంద్రంలో మునిగిపోయింది. ఇదే సమయంలో అటు కన్నడ చిత్రసీమలో కూడా విషాదం నెలకొంది. లెజెండ్రీ నటుడు, కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్ సతీమణి పార్వతమ్మ రాజ్‌కుమార్ ఈరోజు తుది శ్వాస విడిచారు. కిడ్నీ, శ్వాసకోస సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న పార్వతమ్మ ఎం.ఎస్.రామయ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం నాలుగున్నర గంటల ప్రాంతంలో కన్నుమూశారు.
78 ఏళ్ళ పార్వతమ్మ ఈ నెల 14 నుండి ఆసుపత్రిలో చేరారు. వెంటిలేటర్స్‌పై చికిత్స తీసుకుంటున్న ఆమెకు వైద్యులు ప్రత్యేక చికిత్సలు అందించినా లాభం లేకపోయింది. భర్త రాజ్‌కుమార్ లాగానే పార్వతమ్మ కూడా తన రెండు కళ్ళను దానం చేశారు. రాజ్‌కుమార్, పార్వతమ్మలకు ఐదుగురు సంతానం. వీరిలో పునీత్ రాజ్‌కుమార్, శివరాజ్‌కుమార్ కన్నడలో అగ్ర హీరోలుగా కొనసాగుతున్నారు. నిర్మాతగా పార్వతమ్మ అప్పు, అరసు, వంశీ, హుడుగారు, అభి వంటి సినిమాలను నిర్మించారు. పార్వతమ్మ మృతికి సంతాపాన్ని తెలియజేస్తూ కన్నడ సినీ రంగం స్వచ్చందంగా ఈ రోజు బంద్‌ను పాటిస్తుంది.