Saamy Review
నేను పోలీస్ కాదు.. పోకిరి అంటూ పోలీస్ సినిమాలకు కొత్త అర్థం చెప్పేలా పోలీస్ కథా చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు హరి.. 15 క్రితం హీరో చియాన్ విక్రమ్‌తో తెరకెక్కించిన పోలీస్ బ్యాక్‌డ్రాప్ మూవీ సామి. ఈ చిత్రాన్ని తెలుగులో లక్ష్మీ నరసింహ పేరుతో రీమేక్ కూడా చేశారు. అప్పుడు తెలుగులో విక్రమ్‌కి పెద్దగా మార్కెట్ లేదు. కాబట్టి తెలుగులో రీమేక్ అయ్యింది. ఇప్పుడు విక్రమ్‌కు తెలుగులో ఓ మార్కెట్ ఉండటంతో సామి సీక్వెల్ స్వామి స్క్వేర్‌ను తెలుగులో సామి పేరుతో విడుదల చేశారు. మరి విక్రమ్ సామిగా ఎలా మెప్పించాడో తెలుసుకోవాలంటే కథలోకి వెళదాం..
కథ:
సామిలో కథ ఎలా ఎండ్ అయ్యిందో అక్కడి నుండే సినిమా ప్రారంభం అవుతుంది. పోలీస్ ఆఫీసర్ పరుశురాం స్వామి(విక్రమ్), భువన(ఐశ్వర్య రాజేష్) కొడుకు రామసామి(విక్రమ్) ఢిల్లీలో ఐ.ఎ.ఎస్ ట్రయినింగ్ తీసుకుంటూ ఉంటాడు. ఆ క్రమంలో అతనికి మినిష్టర్ కుమార్తె దియా( కీర్తి సురేష్) పరిచయం అవుతుంది. అది ప్రేమగా మారుతుంది. అయితే ఇంటికి వచ్చిన రామసామికి తన తల్లిదండ్రులను రావణ్ బిక్షు(బాబీ సింహ) చంపేశాడని తెలుసుకుంటాడు. దాంతో ఐ.ఎ.ఎస్ కాకుండా.. ఐ.పి.ఎస్ ఆఫీసర్‌గా మారి విజయవాడ సిటీకి వస్తాడు. రావణ్ బిక్షు అతని తమ్ముళ్లపై రామసామి ఎలా పగ తీర్చుకున్నాడనేదే మిగిలిన కథ
సమీక్ష:
పదిహేనేళ్ల క్రితం చిత్రీకరించిన సామికి సీక్వెల్ అంటే విక్రమ్ లుక్‌లో ఎలాంటి చేంజ్ ఉండకూడదు. అప్పుడే ఆ గ్యాప్‌ని కవర్ చేస్తూ సీక్వెల్‌ను తెరకెక్కించగలం. ఈ విషయంలో హీరో చియాన్ విక్రమ్‌ని అభినందించాలి. విక్రమ్ ఫిజిక్ పరంగా ఎలాంటి మార్పు లేకుండా కనపడ్డాడు. పవర్‌ఫుల్, ఎనర్జిటిక్ ఫెర్‌ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. కీర్తి సురేశ్ గ్లామర్‌తో ఆకట్టుకుంది. పాటల్లో మెరిసింది. ఇక సీక్వెల్‌లో విలన్‌గా నటించిన రావణ్ బిక్షు .. విలనిజంతో వెండితెరపై ఆకట్టుకున్నాడు. చాలా చక్కగా నటించాడు. ఇక త్రిష పాత్రను రీప్లేస్ చేసిన ఐశ్వర్య పాత్ర నిడివి తక్కువే అయినా.. ఆమె పాత్రకు న్యాయం చేసింది. ఇక ప్రభు, సూరి అందరూ వారి వారి పాత్రలకు న్యాయం చేశారు. ఇక దర్శకుడు హరి సెకండాఫ్‌లో ఇద్దరు విక్రమ్‌లు బ్రతికే ఉన్నారా? అనే కన్‌ఫ్యూజన్‌ను క్రియేట్ చేసి.. సెకండాఫ్ ఎలా ఉండబోతుందోనని ఆసక్తిని పెంచాడు. ఇక పోలీస్ ఆఫీసర్స్‌గా హీరోలను తెరపై చూపించాలంటే హరి తర్వాతే ఎవరైనా.. ఈ సినిమాలో కూడా విక్రమ్‌ను చాలా పవర్‌ఫుల్‌గా చూపించాడు హరి. అయితే సీక్వెల్స్ చేసేటప్పుడు ఆయన చేసిన ఇంతకు ముందు సినిమాల్లో సన్నివేశాలను గుర్తుకు తెచ్చేలా రొటీన్‌గా అనిపిస్తాయి. హరి సినిమాల్లో పోలీసులు సూపర్ హ్యుమన్ బీయింగ్‌లుగా కనిపిస్తారు. ఈ సినిమాలోనూ అంతే.. రియాలిటీకి చాలా దూరంగా అనిపిస్తారు. కొన్ని సందర్భాల్లో అలా ఉంటే బావుండు కదా! అనిపించేంతలా హీరో క్యారెక్టర్‌ను పోలీస్ ఆఫీసర్‌గా పొట్రేట్ చేస్తుంటాడు. ఇక దేవిశ్రీ ప్రసాద్ ట్యూన్స్‌తో ఆకట్టుకోకపోయినా.. బ్యాగ్రౌండ్ స్కోర్‌తో మెప్పించాడు. ఈ సినిమా చిత్రీకరణ సమయంలోనే సినిమాటోగ్రాఫర్ ప్రియన్ చనిపోయాడు. దీంతో వెంకటేశ్ అంగురాజ్‌ను కెమెరామెన్‌గా కొంత పార్ట్‌కు ఉపయోగించాడు హరి. సినిమాటోగ్రఫీ పరంగా సినిమా బాగా ఉంది. తమీన్స్ నిర్మాణ విలువలు బావున్నాయి. హరి సినిమాల్లో పవర్‌ఫుల్ యాక్షన్ మధ్య కామెడీ ట్రాక్ ఉంటుంది. అది కూడా ఫస్టాఫ్‌కే ఎక్కువగా పరిమితమై ఉంటుంది. ఈ సినిమాలో కూడా సూరి ట్రాక్ అంతే. ఇది రొటీన్‌గానే అనిపిస్తుంది.
బోటమ్ లైన్: సామి.. రొటీన్ హరి ఫార్ములా పోలీస్ స్టోరి
Read Saamy Movie Review in English
- Read in English