Saakshyam Review
స్టార్ హీరోగా రాణించాలనే తపనతో మొదటి నుండి కమర్షియల్ సినిమాలు చేస్తున్న బెల్లంకొండ శ్రీనివాస్ చేసిన నాలుగో చిత్రం `సాక్ష్యం`. ఈ సినిమాలో ప్రకృతి దేనికైనా సాక్ష్యంగా ఉంటుంది. దాన్నుండి ఎవరూ తప్పించుకోలేరు. అనే ఓ కాన్సెప్ట్‌తో శ్రీవాస్ రాసుకున్న కథే ఈ సాక్ష్యం. ఇలాంటి సినిమా చేయాలని నిర్ణయించుకున్న బెల్లకొండ శ్రీనివాస్ యాక్షన్ సినిమా కాబట్టి ఫిజిక్ కోసం బాగానే కష్టపడినట్లు తెలుస్తుంది. ట్రైలర్ ఆసక్తిని పెంచేలా .. మంచి విజువల్స్‌తో ఆకట్టుకోవడంతో సినిమాను చూడాలని చాలా మంది ఆసక్తిగానే ఎదురుచూశారు. మరి వీరి ఆసక్తి ఏ మేర పూర్తి అయ్యిందో తెలుసుకోవాలంటే కథేంటో చూద్దాం...
కథ:
స్వస్తిక్ పురంలోని రాజుగారి దంపతులు(శరత్‌కుమార్ , మీనా) ఓ అబ్బాయి(బెల్లంకొండ శ్రీనివాస్) పుడతాడు. అదృష్టజాతకుడు. చేతిపై రేఖలు ఉండవు కాబట్టి మృత్యుంజయుడు అవుతాడని పరోహితుడు చెబుతాడు. అందరూ ఆనందంగా ఉంటున్న సమయంలో రాజుగారు తమ పనులకు అడ్డు వస్తున్నాడని మునస్వామి అతని తమ్ముళ్లు..(జగపతిబాబు, అశుతోష్ రాణా, రవికిషన్) రాజుగారి కుటుంబాన్నంతటినీ చంపేస్తారు. చిన్నబిడ్డను మాత్రం ఓ ఆవుదూడ కాపాడుతుంది. ఆ బిడ్డ పిల్లలు లేని రవిప్రకాశ్ దంపతులు(జయప్రకాశ్, పవిత్రా లోకేశ్)ల చెంతకు చేరుతాడు. వారు ఆ బిడ్డను శివుని వర ప్రసాదంగా భావించి విశ్వజ్ఞ అనే పేరుతో పెంచి పెద్దచేస్తారు. యు.ఎస్‌లో పెరిగి పెద్దయిన విశ్వజ్ఞ వీడియో గేమ్‌లను తయారు చేసే కంపెనీని రన్ చేస్తుంటాడు. ఓ సందర్భంలో సౌందర్యలహరి(పూజా హెగ్డే)ని చూసి ఆమెతో ప్రేమలో పడతాడు. ఆమె కూడా తన ప్రేమలో పడేలా చేసుకుంటాడు. అయితే అనుకోకుండా ఇద్దరి మధ్య గొడవలు వచ్చి సౌందర్య ఇండియా వచ్చేస్తుంది. ఆమె కోసం విశ్వ ఇండియా వస్తాడు. అదే సమయంలో మునస్వామి, అతని తమ్ముళ్లకు వ్యతిరేకంగా సౌందర్య తండ్రి ఠాగూర్(రావు రమేశ్) కొన్ని సాక్ష్యాలను సేకరిస్తాడు. అతన్ని చంపాలనుకునే క్రమంలో మునస్వామి తమ్ముడు వీరాస్వామి తమ్ముడు విశ్వ చేతిలో చనిపోతాడు. అయితే అది యాదృచ్చికంగా జరిగిందని విశ్వ అనుకుంటాడు. కానీ..విశ్వ కొత్తగా డిజైన్ చేసే వీడియో గేమ్ ప్రకారమే అతని చనిపోయాడని తర్వాత తెలుసుకుంటాడు. ఆ వీడియో గేమ్‌లో ఉన్నట్లుగానే మునస్వామి ఇద్దరు తమ్ముళ్లు కూడా విశ్వ చేతిలోనే చనిపోతారు. అసలు వీడియో గేమ్‌కి, మునస్వామి తమ్ముళ్ల చావులకు కారణం ఎవరు? చివరకు విశ్వ మునస్వామిని చంపేస్తాడా? లేదా? అని తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే...
ప్లస్ పాయింట్స్:
సినిమాలో హర్షవర్ధన్ రామేశ్వర్ నేపథ్య సంగీతం బావుంది. అర్థర్ ఎ.విలన్స్ కెమెరావర్క్ బావుంది. సన్నివేశాల ప్రకారం సాయిమాధవ్ బుర్రా కొన్ని సంభాషణలను చక్కగా రాశారు. ముఖ్యంగ ఆధ్యాత్మిక డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. సినిమా రివేంజ్ డ్రామానే అయితే దర్శకుడు శ్రీవాస్ దానికి ప్రకృతి అనే కాన్సెప్ట్‌ను జోడించి.. ప్రకృతి పగ తీర్చుకుంటే ఎలా ఉంటుంది అనే దాన్ని చక్కగా రాసుకున్నాడు. కాన్సెప్ట్ బాగానే ఉంది. నిర్మాణ విలువలు బావున్నాయి. ప్రతి సన్నివేశం ఎంతో రిచ్‌గా ఉంది. అర్థర్ ఎ.విలన్స్ విజువల్స్ ఆకట్టుకుంటాయి. హర్షవర్ధన్ నేపథ్య సంగీతం బావుంది.
మైనస్ పాయింట్స్:
హీరో, హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్ బాలేదు. అలాగే ఇద్దరూ మధ్య వచ్చే పాటలు సినిమా ఫ్లోను దెబ్బ తీసేలా ఉన్నాయి. ఇక ట్యూన్స్ ఆకట్టుకునేలా లేవు.కామెడీ ట్రాక్ బాలేదు. ఎడిటింగ్‌లో మరో పదినిమిషాల సినిమాను తగ్గించి ఉంటే బావుండేదనిపించింది. సన్నివేశాలు లాజిక్స్‌కు దూరంగా ఉన్నాయి.
సమీక్ష:
మన జీవితంలో లాజిక్స్‌కు అందకుండా చాలా విషయాలు జరుగుతుంటాయి. అవే అంతే అనుకోవాలే తప్ప.. ఎందుకు అలా అని అనుకోవడం వల్ల లాభముండదు. ముఖ్యంగా ప్రకృతి చేసే విషయాలైనా, విలయాలైనా.. ఇదే పాయింట్‌ను ఓ రివేంజ్ డ్రామాగా ఉంటే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్‌తో దర్శకుడు శ్రీవాస్ చక్కగా రాసుకన్నాడు. నెరేషన్ ఇంకాస్త ఆసక్తికరంగా ఇచ్చుంటే బావుండేదినిపిస్తుంది. అలాగే ఆధ్యాత్మికం.. ప్రకృతి ప్రతీకారం అనే విషయాలు.. యూత్‌కి కనెక్ట్ అవుతుందని చెప్పలేం. ఇక సినిమాలో కొన్ని సన్నివేశాలు బావున్నాయి. ముఖ్యంగా ఆవు దూడ చిన్న బిడ్డను కాపాడే సన్నివేశం.. చివర్లో అదే ఆవు దూడ.. పెరిగి పెద్దదై మెయిన్ విలన్‌ని చంపడానికి సహాయపడటం.. హీరోకు ప్రతి విషయంలో ప్రకృతి సహకరించడం.. హీరో చేతిలో చనిపోయే విలన్స్‌కు.. వీడియో గేమింగ్‌కు లింక్ పెట్టడం అనే అంశాలు ఆకట్టుకుంటాయి. అయితే లవ్‌ట్రాక్, కామెడీ ట్రాక్ కాస్త బావుండుంటే.. ఇంకా బెటర్ అనిపించేంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ యాక్షన్ సన్నివేశాల కోసం పడ్డ కష్టం తెరపై కనపడుతుంది. పూజాహెగ్డే పాత్ర ఎక్కువగా పాటలకే పరిమితమైంది. జగపతిబాబు, అశుతోష్ రాణా, రవికిషన్‌ల విలనిజం స్టార్టింగ్‌లో ఉన్నంత సినిమా ఆసాంతం కొనసాగదు. రావు రమేశ్, కృష్ణ భగవాన్, పోసాని, జయప్రకాశ్, పవిత్రా లోకేష్, ఝాన్సీ, బ్రహ్మాజీ ఇలా అందరూ వారి వారి పాత్రలకు న్యాయం చేశారు.
బోటమ్ లైన్: ప్రకృతి రివేంజ్ డ్రామా.. సాక్ష్యం
Saakshyam Movie Review in English
- Read in English