Download App

Saaho Review

`బాహుబ‌లి` నుండి తెలుగు సినిమా ఇత‌ర సినిమా ప్రేక్ష‌కులు చూసే స్థాయి మారింది. ఈ సినిమాతో అంత‌ర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమా పేరు మారు మోగింది. దీంతో ప్ర‌భాస్ సినిమాల గురించి ఇతర సినీ రంగ ప్ర‌ముఖులు ఆరా తీయ‌డం మొద‌లు పెట్టారు. సుజిత్ ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌భాస్ త‌ర్వాత సినిమా సాహో అని అనౌన్స్ చేయ‌గానే సినిమాపై పెద్ద అంచ‌నాలు క్రియేట్ కాలేదు. అయితే బాహుబ‌లి త‌ర్వాత సాహోపై ఆటోమేటిక్‌గా అంచ‌నాలు పెరిగాయి. దీంతో నిర్మాత‌లు సినిమాను అన్‌కాంప్ర‌మైజ్డ్‌గా భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కించారు. పెరిగిన అంచ‌నాల‌తో సాహో ప్యాన్ ఇండియా మూవీగా మారింది. బాలీవుడ్ న‌టి శ్ర‌ద్ధాక‌పూర్ హీరోయిన్‌గా న‌టించ‌డ‌మే కాదు.. మందిరాబేడి, జాకీష్రాఫ్‌, అరుణ్‌విజ‌య్‌, లాల్‌, నీల్ నితిన్ ఇలా చాలా మంది జాయిన్ అయ్యారు. హాలీవుడ్ టెక్నీషియ‌న్స్ సినిమా కోసం వ‌ర్క్ చేశారు. అంద‌రి అంచ‌నాల‌ను పెంచుకుంటూ విడుద‌ల‌కు సిద్ధ‌మైన ఈ సినిమా మ‌రి అంచ‌నాల‌ను అందుకుందో లేదో తెలుసుకోవాలంటే సినిమా క‌థ‌లోకి వెళ‌దాం..

క‌థ‌:

అండ‌ర్ వ‌ర‌ల్డ్ డాన్ రాయ్‌(జాకీష్రాఫ్‌) విదేశాల్లో ఉండి ఇండియాలో ప్ర‌భుత్వాన్ని శాసిస్తుంటాడు. అత‌ని వెనుకున్న డ‌బ్బు, అత‌ని స్థానానికున్న ప‌వ‌ర్‌ను చూసి కొంద‌రు ప్లాన్ చేసి రాయ్‌ని చంపేస్తారు. ఆ స్థానం కోసం దేవరాజ్‌(చుంకీ పాండే) ఆశ‌ప‌డ‌తాడు. కానీ రాయ్ కొడుకు విశ్వ‌క్(అరుణ్ విజ‌య్‌)కే బోర్డు స‌భ్యులు మ‌ద్ద‌తు తెలుపుతారు. దాంతో దేవ‌రాజ్ ఎలాగైనా ఆ స్థానాన్ని చేజిక్కించుకోవాల‌నుకుంటాడు. అదే స‌మయంలో ముంబైలో రెండు కోట్ల రూపాయ‌ల దొంగ‌త‌నం జ‌రుగుతుంది. ఆ కేసుని పోలీసులు డీల్ చేయ‌లేక అండ‌ర్ క‌వ‌ర్ పోలీస్ ఆఫీస‌ర్ అశోక చ‌క్ర‌వ‌ర్తి(ప్ర‌భాస్‌)కి కేసుని అప్ప‌గిస్తారు. అశోక్ అమృతానాయ‌ర్‌(శ్ర‌ద్ధాక‌పూర్‌), డేవిడ్‌(ముర‌ళీశ‌ర్మ‌), గోస్వామి(వెన్నెల‌కిషోర్‌)తో క‌లిసి కేసుని ప‌రిశోధించ‌డం మొద‌లు పెడ‌తాడు. క్ర‌మంతో జై(నీల్ నితిన్‌) అస‌లు నేర‌స్థుడ‌ని వారికి తెలుస్తుంది. జై అనే వ్య‌క్తి ఎలాంటి ఆధారాలు లేకుండా దొంగ‌త‌నం చేశాడు కాబ‌ట్టి.. అత‌న్ని అరెస్ట్ చేయ‌లేరు. దీంతో అత‌న్ని రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుకోవాల‌ని అంద‌రూ ప్ర‌య‌త్నాలు చేస్తారు. అందుకోసం అశోక్ ఓ ప్లాన్ వేస్తాడు. ఆ ప్లానేంటి? అశోక్‌, అమృతానాయ‌ర్‌ని ప్రేమిస్తాడా? అస‌లు రాయ్‌ని చంపాల‌నుకుంది ఎవ‌రు? అశోక్‌కి, రాయ్ గ్యాంగ్‌కి ఉన్న రిలేష‌న్ ఏంటి? అనే విష‌యాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే..

ప్ల‌స్ పాయింట్స్:

- ప్ర‌భాస్‌
- యాక్ష‌న్ పార్ట్‌
- బ్యాగ్రౌండ్ స్కోర్‌
- సినిమాటోగ్ర‌ఫీ

మైన‌స్ పాయింట్స్‌:

- బ‌ల‌మైన ఎమోష‌న్స్ లేక‌పోవ‌డం
- ఆస‌క్తిక‌ర‌మైన స్క్రీన్ ప్లే లేదు
- ఎడిటింగ్‌
- సంగీతం
- కామెడీ

స‌మీక్ష‌:

బ‌ల‌మైన ఎమోష‌న్స్ ఆధారంగా సినిమా క‌థ‌ను రాసుకున్న‌ప్పుడు చూసే ప్రేక్ష‌కుడు ఆటోమెటిక్‌గా సినిమాకు క‌నెక్ట్ అవుతాడు. అదీ కాకుండా బాహుబ‌లి వంటి సినిమా త‌ర్వాత వ‌స్తోన్న సినిమా కావ‌డంతో సినిమాపై భారీ అంచ‌నాలుంటాయి. అలాంటి స‌మ‌యంలో సినిమాపై చాలా జాగ్రత్త‌లు తీసుకోవాల్సిన ప‌రిస్థితి ఉంటుంది. ద‌ర్శ‌కుడు సుజిత్ .. సాహో చిత్రాన్ని ప్ర‌భాస్‌తో చేయాల‌నుకున్న‌ప్పుడు ఆయ‌న‌కున్న ఇమేజ్‌.. బాహుబలి త‌ర్వాత ఉన్న ఇమేజ్‌కి చాలా మారిపోయింది. ఈ ఇమేజ్‌ను బ్యాలెన్స్ చేస్తూ ప్యాన్ ఇండియా సినిమాగా సినిమాను తెర‌కెక్కించ‌డానికి సుజిత్ త‌న వంతు ప్ర‌య‌త్నాల‌ను బాగానే చేశాడు. అందులో భాగంగా యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా సినిమాను తెర‌కెక్కించాల‌నుక‌న్నాడు.హాలీవుడ్ టెక్నియ‌న్స్‌ను రంగంలోకి దించారు. యాక్ష‌న్ ఎలిమెంట్స్‌ను చ‌క్క‌గా ప్లానింగ్ చేసుకుని చ‌క్కగా తెర‌కెక్కించారు. అయితే క‌థ‌, క‌థ‌నం విష‌యంలో జాగ్ర‌త్త‌లు తీసుకోలేక‌పోయారు. సాధార‌ణంగా ద‌క్షిణాది ప్రేక్ష‌కులు సినిమాను ఎంత గొప్ప‌గా చేసిన అందులోని ఎమోష‌న‌ల్ కంటెంట్‌కు బాగా క‌నెక్ట్ అవుతారు. ఆ ఎమోష‌న్స్‌ను సాహో మిస్ అయ్యాం. అలాగే.. ద‌క్షిణాది సినిమాల్లోని నెటివిటీ మారిపోయి బాలీవుడ్ స్టైల్ ఆఫ్ మేకింగ్‌కి సినిమా వెళ్లిపోయింది. అందుక‌నే పాటల్లో కూడా తేడా క‌నిపిస్తుంది. పిక్చ‌రైజేష‌న్ గొప్ప‌గా ఉన్న‌ప్ప‌టికీ... పాట‌ల లిరిక్స్ ఏదో హిందీ అనువాదంలా అనిపిస్తుంది. సినిమా నిడివి మూడు గంట‌లు ఎందుకో అర్థం కాదు.. ఎడిట‌ర్ శ్రీక‌ర్ ప్ర‌సాద్ క‌త్తెర‌కు మ‌రికాస్త ప‌ని కల్పించి ఉండుంటే బావుండుదేమో. మది సినిమాటోగ్ర‌ఫీ చాలా బావుంది. యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించిన విధానం, పాట‌ల పిక్చ‌రైజేష‌న్ అంతా సూప‌ర్బ్‌గా అనిపిస్తుంది. ఇక న‌టీన‌టుల విష‌యానికి వ‌స్తే.. ప్ర‌భాస్ యాక్ష‌న్ పార్ట్‌లో అద్భుతంగా న‌టించాడు. ఇంత‌కు ముందెన్న‌డూ లేని స్టైలిష్ యాక్ష‌న్ స‌న్నివేశాల్లో చ‌క్క‌గా న‌టించాడు. శ్ర‌ద్ధాక‌పూర్ న‌ట‌న బావుంది. ఆమె గ్లామ‌ర్ సినిమాకు ప్ల‌స్ అయ్యింది. నీల్ నితిన్‌, జాకీష్రాఫ్‌, లాల్‌, చుంకీపాండే, ప్ర‌కాష్ బెల‌వాడి, మందిరాబేడి, వెన్నెల‌కిషోర్‌, ముర‌ళీశ‌ర్మ‌, టినూ ఆనంద్ ఇలా అంద‌రూవారి వారి పాత్ర‌ల‌కు న్యాయం చేశారు. గ్లామ‌ర్ సాంగ్‌లో జాక్వ‌లైన్ మెప్పించింది. అలాగే ఎవ్‌లిన్ శ‌ర్మ యాక్ష‌న్ పార్ట్‌లో ఆక‌ట్టుకుంది. అజ్ఞాత‌వాసి, క‌ల్కి వంటి సినిమాల స్క్రీన్‌ప్లేతో సినిమా ర‌న్ అవుతున్న భావ‌న ప్రేక్ష‌కుడికి క‌లుగుతుంది.

చివ‌ర‌గా.. సాహో.. రాజ్యం కోసం పోరాడే యువ‌రాజు

Read Saaho Movie in English

Rating : 2.0 / 5.0