నటి శ్రావణి ఆత్మహత్య కేసులో ‘ఆర్ఎక్స్ 100’ నిర్మాత పేరు..

  • IndiaGlitz, [Thursday,September 10 2020]

టీవీ సీరియల్ నటి శ్రావణి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆమె మృతి కేసు ట్విస్టుల మీద ట్విస్టులతో కొనసాగుతోంది. గంటకో పేరు బయటకు వస్తూ సంచలనంగా మారుతోంది. ఇప్పటి వరకూ శ్రావణి ఆత్మహత్య కేసులో ప్రముఖంగా దేవ్‌రాజ్‌రెడ్డి, సాయికృష్ణ పేర్లు మాత్రమే వినిపించగా.. తాజాగా మరో పేరు కూడా బయటకు వచ్చి విస్మయాన్ని కలిగిస్తోంది. ఈ కేసులో ‘ఆర్ఎక్స్-100’ సినిమా నిర్మాత అశోక్ రెడ్డి పేరు బయటకు రావడంతో టాలీవుడ్ షాక్ అయింది.

శ్రావణి కుటుంబ సభ్యులైతే దేవరాజ్‌రెడ్డి కారణంగా తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందని చెబుతున్నారు. దేవరాజ్‌రెడ్డి మరో ఇద్దరు పేర్లను తెరపైకి తీసుకొచ్చాడు. సాయికృష్ణ అనే వ్యక్తి తన ఎదుటే శ్రావణిని హత్య చేసేందుకు చూశాడని చెప్పాడు. తాజాగా శ్రావణి ఆత్మహత్యకు ఆమె కుటుంబ సభ్యులతో పాటు ‘ఆర్ఎక్స్-100’ సినిమా నిర్మాత అశోక్ రెడ్డి కూడా కారణమని ఆరోపించాడు. తనను కాదని శ్రావణి.. అశోక్‌రెడ్డి, సాయికృష్ణలతో సన్నిహితంగా మెలిగేదని కూడా చెప్పుకొచ్చాడు. అశోక్‌రెడ్డి ఏటీఎం కార్డులను శ్రావణి వాడేదని.. ఆయన కూడా శ్రావణిని పర్సనల్‌గా చూసుకునేవాడని చెప్పి షాకిచ్చాడు.

దేవరాజ్ ఆరోపణలను పక్కన పెడితే శ్రావణి, అశోక్‌రెడ్డిల మధ్య జరగిన సంభాషణ ఒకటి తాజాగా వెలుగు చూసింది. ‘దేవరాజ్ నన్ను వేధిస్తున్నాడు. మన విషయం బయటపెడతానని బెదిరిస్తున్నాడు. మనిద్దరం కలిసి ఉండగా చూశాడు’ అని అశోక్‌రెడ్డికి శ్రావణి చెప్పిన ఫోన్ సంభాషణ ఒకటి లీక్ అయింది. అటు దేవరాజ్ అన్ని ఆరోపణలు చేసినా.. ఇటు ఆడియో సంభాషణ లీక్ అయినప్పటికీ అశోక్‌రెడ్డి మాత్రం ఈ వ్యవహారంపై నోరు మెదపకపోవడం అనుమానాలకు తావిస్తోంది. కాగా.. శ్రావణి అంత్యక్రియలు ఆమె స్వస్థలం తూర్పు గోదావరి జిల్లా గొల్లప్రోలు శ్మశాన వాటికలో జరిగాయి.