'ఆర్ ఎక్స్- 100' ఫేమ్ కార్తికేయ హీరోగా అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో చిత్రం ప్రారంభం
Send us your feedback to audioarticles@vaarta.com
‘ఆర్ ఎక్స్–100 ’ ఫేమ్ కార్తికేయ హీరోగా జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్, స్ప్రింట్ టెలీ ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం గురువారం హైదరాబాద్‌లోని ఫిలింనగర్ దైవ సన్నిధానంలో ప్రారంభమైంది . అనిల్ కడియాల, తిరుమల్ రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి అర్జున్ జంధ్యాల దర్శకుడు. ఈ చిత్రం ద్వారా అర్జున్ మొదటిసారిగా మెగా ఫోన్ పట్టనున్నారు. ఈ చిత్ర పూజా కార్యక్రమాలు దైవసన్నిధానంలోని వెంకటేశ్వర స్వామి వద్ద నిర్వహించి చిత్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సినిమా స్క్రిప్ట్‌ను హీరో,దర్శకుడు, నిర్మాతలకు అందచేశారు. అగ్ర దర్శకుడు బోయపాటి శ్రీను గౌరవ దర్శకత్వంతో పాటు హీరోపై క్లాప్ నిచ్చారు. నటులు అలీ, ప్రవీణా కడియాల కెమెరా స్విచాన్ చేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ–‘ అనిల్ కడియాల, ప్రవీణ కడియాల జంట నాకు టీవీ రంగం ద్వారా ఎప్పటినుండో సుపరిచితులు. నేను ఏ సినిమా ఓపెనింగ్‌లకు వెళ్లను. అటువంటిది ఆ జంట ఎంతో కష్టపడి ఇంతదూరం ప్రయాణం చేశారు. వారి ప్రయాణంలోని మొదటి సినిమా ఓపెనింగ్‌కు వచ్చి వాళ్లను మనసారా ఆశీర్వదించటం నా బాధ్యత అనిపించింది. వారితో పాటు మరో నిర్మాత తిరుమల్ రెడ్డి, దర్శకుడు అర్జున్ జంధ్యాల లకు అల్ ది బెస్ట్’ అన్నారు.
దర్శకుడు బోయపాటి శ్రీను మాట్లాడుతూ– ‘ నా దగ్గర పన్నెండు సంవత్సరాలుగా నాతో పాటు అసోసియేట్‌గా ప్రయాణం చేసిన అర్జున్ నాకు తమ్ముడు లాంటివాడు. టాలెంట్, టైమింగ్ ఉన్నవాడతను. అలాగే ఈ నిర్మాతలు నాకు మొదటినుండి మంచి మిత్రులు. హీరోకి ఈ చిత్రం ద్వారా మంచి పేరు వస్తుందని కచ్చితంగా చెప్పగలను’ అన్నారు.
హీరో కార్తికేయ మాట్లాడుతూ– ‘ఆర్ ఎక్స్–100’ చిత్రం విడుదల తర్వాత నేను చాలా కథలు విన్నాను. నేను విన్న అన్ని కథల్లోకి బెస్ట్ కథ ఇది. అందుకే ఈ సినిమా షూటింగ్ ఎప్పుడేప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఎదురు చూస్తున్నాను అన్నారు.
దర్శకుడు అర్జున్ జంధ్యాల మాట్లాడుతూ– ‘నా గురువు, సోదరుడు ఆల్ ఇన్ వన్ అంతా బోయపాటిగారే. ఆయన పేరు ఎక్కడా తగ్గకుండా సినిమా తీస్తానని ప్రామిస్ చేస్తున్నాను. ఈ సినిమా ఇంత తొందరగా స్టార్ట్ అయ్యిందంటే దానికి కారణం హీరో కార్తికేయనే. ఆయన నేను కథ చెప్పగానే కథ మీద ఉన్న నమ్మకంతో ఎంతో ఎంకరేజ్ చేసి ముందు మన సినిమా చేద్దాం అని చెప్పారు. నా నిర్మాతలు నన్ను నమ్మి నేను అడిగిన ప్రతి టెక్నీషియన్‌ను నా కిచ్చి ప్రోత్సహిస్తున్నారు. అందరూ ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్’ అన్నారు.
నిర్మాత అనిల్ కడియాల మాట్లాడుతూ–‘ మొదటగా మమ్మల్ని టీవీ మీడియాలో ఆదరించిన బాపినీడు గారికి, మా షోలను వీక్షిస్తున్న ప్రేక్షకులకు థాంక్స్. సినిమా యూనిట్‌ను ఆశీర్వదంచటానికి వచ్చిన మాకు ఎంతో ఆత్మీయుడు బోయపాటి గారికి, గురుతుల్యులు బాలు గారికి థ్యాంక్స్. టీవీలో మమ్మల్ని ఎలా ఆశీర్వదించారో సిల్వర్ స్క్రీన్‌పై కూడా నన్ను, నా పార్టనర్ తిరుమల్ రెడ్డిని ప్రతిఒక్కరూ మనసారా ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. ఈ కథపై ఉన్న నమ్మకంతో నిర్మాణ రంగంలోకి కాలు పెట్టాము. సినిమా తప్పకుండా విజయం సాధిస్తుంది. హీరో కార్తికేయకు ఇది లైఫ్‌లో గుర్తుండిపోయే సినిమా అవుతుంది’ అన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత డివివి. దానయ్య, మిరియాల రవీంధర్ రెడ్డి, ప్రవీణ్, నటులు హేమా తదితరులు పాల్గొన్నారు.
ఈ చిత్రానికి సంగీత దర్శకుడు: చైతన్య భరధ్వాజ్, కెమరామెన్ :‘ఆర్‌ఎక్స్ 100’ ఫేమ్ రామ్, ఆర్ట్ డైరెక్టర్ : జీయమ్ శేఖర్ ,ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : శివ మల్లాల.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout