అడుగు దూరంలో ఢమాల్.. చంద్రునిపై కుప్పకూలిన రష్యా ల్యాండర్, రేసులో చంద్రయాన్ 3
Send us your feedback to audioarticles@vaarta.com
దాదాపు 47 ఏళ్ల తర్వాత.. అది కూడా భారత్ చంద్రయాన్ 3 ప్రయోగించిన సమయంలోనే రష్యా నింగిలోకి పంపిన లూనా 25 ల్యాండర్ మిషన్ విఫలమైంది. చంద్రుడిపై దిగే క్రమంలో ల్యాండర్ క్రాష్ ల్యాండింగ్ అయినట్లుగా రష్యా అంతరిక్ష పరిశోధనా సంస్ధ రోస్కాస్మోస్ తెలిపింది. అనూహ్య కక్ష్యలో పరిభ్రమించిన అనంతరం అది కూలిపోయినట్లుగా పేర్కొంది. దీంతో 5 దశాబ్థాల తర్వాత చంద్రుడిపైకి అడుగుపెట్టాలనుకున్న మాస్కో కల చెదిరిపోయినట్లయ్యింది.
ప్రీ ల్యాండింగ్ సమయంలో సాంకేతిక ఇబ్బంది:
లూనా 25ని ఆగస్ట్ 11న రష్యాలోని వోస్తోక్నీ కాస్మోడ్రోమ్ నుంచి ప్రయోగించారు. దాదాపు పది రోజుల పాటు అంతరిక్షంలో ప్రయానించిన ల్యాండర్.. చంద్రుని కక్ష్యలోకి కూడా అత్యంత వేగంగా అడుగుపెట్టింది. షెడ్యూల్ ప్రకారం రేపు సాఫ్ట్ ల్యాండింగ్ కావాల్సి వుండగా అది క్రాష్ ల్యాండ్ అయ్యింది. శనివారం కీలకమైన ప్రీ ల్యాండింగ్ ఆర్బిట్‌ను చేరడానికి లూనా 25 విన్యాసాలు చేపట్టింది. ఈ దశలో వ్యోమనౌకలోని ఆటోమేటిక్ స్టేషన్లో సాంకేతిక సమస్య తలెత్తినట్లు రోస్కాస్మోస్ గుర్తించింది. దీనిని సరిదిద్దేందుకు రష్యా శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తుండగానే ల్యాండర్‌తో సంబంధాలు తెగిపోయాయి.
1976లో చివరిసారిగా చంద్రుడిపై రష్యా ప్రయోగం :
47 ఏళ్ల క్రితం చివరిసారిగా చంద్రుడిపై రష్యా లూనా 25 మిషన్ చేపట్టింది. అది అప్పట్లోనే ఫెయిల్ అయ్యింది. ఇది ప్రచ్ఛన్న యుద్ధం సమయంలో సోవియట్ యూనియన్ అంతరిక్ష ప్రయోగాలకు తీవ్ర అప్రతిష్టను తెచ్చిపెట్టింది. దీంతో చాలా ఏళ్ల పాటు చంద్రుడిపై ప్రయోగాలను చేపట్టలేదు రష్యా. ఈ క్రమంలో ఐదు దశాబ్ధాల తర్వాత లూనా 25 ద్వారా చంద్రుడిపై అన్వేషణను మొదలుపెట్టింది. కేవలం 11 రోజుల్లోనే చంద్రుడిపై దిగడానికి ప్లాన్ చేసింది.
చంద్రయాన్ 3పై ప్రపంచం ఆసక్తి :
మరోవైపు.. చంద్రయాన్ 3కి పోటీగా వచ్చిన లూనా 25 క్రాష్ ల్యాండ్ కావడంతో ఇప్పుడు ప్రపంచం దృష్టి ఇస్రో ప్రయోగంపై పడింది. ఆర్బిటర్ నుంచి విడిపోయిన విక్రమ్ ల్యాండర్ చంద్రుడికి మరింత చేరువైంది. చంద్రయాన్ 2 నాటి అనుభవాలను దృష్టిలో వుంచుకుని సాఫ్ట్ ల్యాండింగ్ కోసం ఇస్రో అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. అన్ని సజావుగా జరిగితే ఆగస్ట్ 23 సాయంత్రం చంద్రుడి ఉపరితలంపై ల్యాండర్ దిగనుంది. అదే జరిగితే జాబిల్లి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన తొలి దేశంగా భారత్ నిలవనుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments