వచ్చే నెల చివరి నాటికి అందుబాటులోకి రష్యా వ్యాక్సిన్!

  • IndiaGlitz, [Sunday,August 23 2020]

కరోనా వ్యాక్సిన్ విషయంలో రష్యా ప్రపంచ దేశాలన్నింటికన్నా ముందున్న విషయం తెలిసిందే. సడెన్‌గా కరోనా వ్యాక్సిన్‌కి అనుమతి లభించిందని వెల్లడించి షాక్ ఇచ్చిన రష్యా.. వ్యాక్సిన్‌ను వచ్చే నెల నుంచే అందుబాటులోకి తీసుకురానుందని సమాచారం. ఈ మేరకు రష్యాకు చెందిన వెక్టర్ స్టేట్ రీసెర్చ్ ఆఫ్ వైరాలజీ అండ్ బయో టెక్నాలజీ సంస్థ సెప్టెంబర్ చివరి నాటికి కరోనా వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్టు తెలిపింది. ఈ లోపే వ్యాక్సిన్ అన్ని ట్రయల్స్‌నూ పూర్తి చేసుకుంటుందని రష్యా పరిశోధకులు చెబుతున్నారు.

కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్‌ను రష్యా అధ్యక్షుడు తన కూతురుపైనే నిర్వహించి వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. 'ఎపివ్యాక్ కరోనా' అని నామకరణం చేసిన ఈ వ్యాక్సిన్‌ను మొత్తం 57 మంది వలంటీర్లపై నిర్వహించారు. ఈ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో 14 నుంచి 21 రోజుల్లో కరోనాను ఎదుర్కొనే యాంటీబాడీలు తయారవుతాయని పరిశోధకులు చెబుతున్నారు. అయితే పూర్తి స్థాయిలో పరీక్షలు నిర్వహించకుండానే ఈ వ్యాక్సిన్‌ను ఆమోదించడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

కరోనా వ్యాక్సిన్‌ను రష్యా ప్రకటించడం తొందరపాటు నిర్ణయమని నిపుణులు చెబుతున్నారు. అయితే దీనిపై రష్యా పరిశోధకు మాత్రం తాము అన్ని నియమాలను పాటిస్తున్నామని.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అభయమిస్తున్నారు. కాగా వ్యాక్సిన్ ఉత్పత్తి కోసం ఇండియా రష్యా సహకారాన్ని కోరుతోంది.